(సమీక్ష ప్రత్యేక కథనం)
‘ఎర్ర’ పార్టీలు చందాలు వసూలు చేయడం కొత్త విషయమేమీ కాకపోవచ్చు.. సభలు, సమావేశాల నిర్వహణ సందర్భాల్లో వ్యాపారవేత్తల నుంచి, రాజకీయ నాయకుల నుంచి, విద్యా సంస్థల నుంచి, కాంట్రాక్టర్ల, తదితర కాస్త డబ్బున్న వర్గాల నుంచి చందాలు వసూలు చేయడం సహజం. చివరికి మావోయిస్ట్ పార్టీ కూడా కాంట్రాక్టర్ల నుంచి, తునికాకు వ్యాపారుల నుంచి చందాలు వసూల్ చేస్తుంది. ఛత్తీస్ గఢ్ అడవుల్లో జనతన సర్కార్ నిర్వహణకు తాము కాంట్రాక్టర్ల నుంచి నిధులు వసూలు చేస్తామని ఆ పార్టీ మాజీ కేంద్ర కమిటీ సభ్యుడు తిప్పిరి తిరుపతి అలియాస్ దేవ్ జీ నిన్న మీడియా సంస్థలకు ఇచ్చిన ఇంటర్వ్యూల్లో స్పష్టం చేశారు కూడా. ప్రజావసరాల కోసం, పార్టీ కార్యక్రమాల కోసం ఈ తరహా వసూళ్లలో తప్పు పట్టాల్సింది కూడా ఏమీ లేదనే అభిప్రాయాలున్నాయి. కానీ నిలువ నీడ కల్పిస్తామంటూ పేదల నుంచే వసూళ్లకు తెగబడితే.. అదీ ఎర్ర జెండాను భుజాన వేసుకున్న వారే ఈ వసూళ్లు, కేసులు, అరెస్టుల వివాదంలో చిక్కుకుంటే..? అదీ అసలైన చర్చ. వెలుగుమట్ల భూదాన్ భూముల వ్యవహారంలో ప్రస్తుతం తీవ్ర వివాదాస్పదంగా మారిన వసూళ్ల ‘కత’లోని లోతైన భిన్నకోణాల సమీక్ష ఇది. ఇక విషయంలోకి వెడితే..
దిగువన గల ఈ ఫొటోలోని వ్యక్తి గుర్తున్నాడా? ఇతని పేరు కల్తీ ఎర్రయ్య అలియాస్ ఎర్రబాబు.. వెలుగుమట్ల భూముల్లో పేదల ఇండ్ల కూల్చివేతల ఘటన నేపథ్యంలో పోలీసులు ఇతన్ని గత నెలాఖరులో పోలీసులు అరెస్ట్ చేశారు. వెలుగుమట్ల భూవివాదంలో నమోదైన ‘వసూళ్ల’ కేసులో అందిన ఫిర్యాదు మేరకు ఎర్రబాబును అరెస్ట్ చేసినట్లు పోలీసులు ప్రకటించారు. వెలుగుమట్ల బాధితులను పరామర్శించి, వారికి బాసటగా నిలిచేందుకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఖమ్మం పర్యటనకు వచ్చిన సందర్భంగా ఎర్రబాబు అనూహ్యంగా పోలీసులకు చిక్కాడనే కథనం కూడా ప్రచారంలో ఉంది. తమనుంచి డబ్బు వసూల్ చేసిన ఎర్రబాబును వెలుగుమట్ల బాధితులే పట్టుకుని పోలీసులకు అప్పగించారనేది ఆ ప్రచారపు సారాంశం. తమకు అందిన ఫిర్యాదు ప్రకారం ఎర్రబాబును అరెస్ట్ చేశామని పోలీసులు అధికారికంగా ప్రకటించారనేది వేరే విషయం.

ఖమ్మం అదనపు పోలీస్ కమిషనర్ ప్రసాదరావు తాజా ప్రకటన సారాంశంలోకి వెడితే..
యూసీసీఆర్ఐ (యంఎల్), దాని అనుబంధ ఓపీడీఆర్, భూదాన్ కమిటీ ముసుగులో నిరుపేదల నుంచి రూ. 3.00 కోట్ల వరకు వసూళ్ళు చేసిన ముఠా నాయకుల, సభ్యుల కోసం ముగ్గురు సీఐలతో ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేశారు. ఈ వివాదానికి సంబంధించి 24 కేసుల నమోదు ద్వారా ఇప్పటి వరకు 60 మందిని నిందితులుగా గుర్తించి, 11 మందిని అరెస్ట్ చేశారు. వెలుగుమట్ల భూదాన్ భూముల్లో దురాక్రమణకు పాల్పడి, పేదలను మోసగించిన వ్యక్తులపై అందిన ఫిర్యాదుల ప్రకారం వరుస అరెస్టులు చోటు చేసుకుంటున్నాయి.
ఖమ్మం జిల్లాలోని పోలీస్ స్టేషన్ల వారీగా ఖానాపురం హవేలీలో 19 కేసులు, రఘునాథపాలెం, కొణిజర్ల, చింతకాని, సత్తుపల్లి, ఏన్కూరు స్టేషన్లలో ఒక్కో కేసు చొప్పున మొత్తం 24 కేసులు నమోదయ్యాయి. బాధితుల ద్వారా వివిధ పోలీస్ స్టేషన్లలో తమకు అందుతున్న ఫిర్యాదుల్లో దాదాపు నిందితుల పేర్లు ఒకే విధంగా ఉన్నాయని పోలీస్ శాఖ ప్రకటించింది. ఇప్పటికే అరెస్టయిన నిందితుల్లో సూర్యాపేట జిల్లా నామవరానికి చెందిన కొప్పెర వెంకన్న, ఖమ్మం జిల్లా ఏన్కూరు మండలం కేసుపల్లికి చెందిన కొట్టే బసు, బురద రాఘవపురానికి చెందిన బల్లి శ్రీనివాసరావు, లచ్చగూడేనికి చెందిన మంకిడి లింగరాజు, ఖానాపురం హవేలీ గోపాలపురానికి చెందిన సంపంగి వెంకటాచలం, వెలుగుమట్లకు చెందిన తాళ్లూరి కృష్ణ, బుడిగె రాములు, రాచకొండ నరసింహాచారి, ఖమ్మం బోసుబొమ్మ సెంటర్ కు చెందిన దండా లింగయ్య, కామేపల్లి మండలం ముద్దులపల్లికి చెందిన పోలెబోయిన ముత్తయ్య, దండా లింగస్వామి ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు.

ఇదే దశలో వెలుగుమట్ల బాధితులకు ఇచ్చిన హామీ మేరకు నిందితుల నుంచి వసూళ్ల డబ్బును రాబట్టే దిశగా చర్యలు చేపట్టామని అదనపు డీసీపీ ప్రసాదరావు చెప్పారు. ఇందులో భాగంగానే ముగ్గురు సీఐలతో సొమ్ము రికవరీకి అవసరమైన దర్యాప్తు చర్యలు తీసుకున్నామన్నారు. బాధితుల నుంచి వసూల్లు చేసిన డబ్బుతో నిందితులు ఆస్తులు సంపాదించినా, కొనుగోలు చేసినా, వాటిని గుర్తించి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పారు. బాధితుల సొమ్మును రికవరీ చేసి వారికి అప్పగించే విషయంలో పోలీసు శాఖ చిత్తశుద్ధితో ఉందని వివరించారు.
ఇక అసలు విషయంలోకి వెడితే..
ఈ దృశ్యాన్ని నిశితంగా గమనించండి. చేతుల్లో కర్రలు, గుత్పలు పట్టుకుని రండిరా.. ఎవడొస్తాడో.. అనే తరహాలో నిల్చున్న మహిళలు, పురుషులు వెలుగుమట్ల ప్రాంతవాసులే. గతంలో జరిగిన ఓ ఘటన తాలూకు ఫైల్ ఫొటో ఇది. కూల్చివేతలకు ముందు వెలుగుమట్ల భూదాన్ భూముల్లో ఇండ్లు నిర్మించుకున్న ప్రాంతానికి వెళ్లేందుకు ఖమ్మం మీడియాకు కూడా అనుమతి లేదంటే అశ్చర్యం కాదు. బారికేడ్లు, టోల్ గేట్ల ఏర్పాట్ల ద్వారా అనుమతి లేనిదే వెలుగుమట్ల భూదాన్ భూముల్లో నిర్మించుకున్న కాలనీకి వెళ్లే స్వేచ్ఛ మీడియా ప్రతినిధులకూ లభించలేదన్నది వాస్తవం. దాంతో అసలు అక్కడేం జరుగుతోందనే అంశంపై గడచిన ఎనిమిదేళ్లుగా నిగూఢంగానే మిగిలిపోయిందని చెప్పవచ్చు.

వెలుగుమట్ల బాధితుల పక్షాన మీ పత్రిక సరైన ధర్మాన్ని నిర్వర్తించలేదని ఓ ప్రముఖ పత్రిక పాత్రికేయ సోదరున్ని ‘సమీక్ష’ ప్రశ్నించి, ప్రస్తావించినపుడు.. ‘గతంలో ఓ వార్తా కథనం రాసినందుకే నాకు ఫోన్లు చేసి బెదిరించారు సర్..’ అని ఆ జర్నలిస్టు మిత్రుడు గుర్తు చేయడం గమనార్హం. నిన్న సీపీఐ (ఎంఎల్) మాస్ లైన్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి పోటు రంగారావు, మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్యలతోపాటు ఆ పార్టీకి చెందిన మరికొందరు నాయకులు వెలుగుమట్ల బాధితుల తరపున మీడియా సమావేశం నిర్వహించిన సందర్భంగా మరో జర్నలిస్ట్ మిత్రుడు చేసిన వ్యాఖ్య కూడా ఆలోచింపదగినదే..
‘మేం అసలైన బాధితులం, మాకు స్థలం కేటాయించలేదు..’ అని ఒకరిద్దరు మహిళలు తమ ఆవేదన వెలిబుచ్చగా, ఎలక్ట్రానిక్ మీడియాకు చెందిన ఓ ఛానల్ ప్రతినిధి స్పందిస్తూ, ‘మేం మీ బాధలను ప్రభుత్వ యంత్రాంగం దృష్టికి తీసుకువెళ్లేందుకు వచ్చినపుడు మమ్మల్ని లోనికి రాకుండా అడ్డుకున్న విషయాన్ని మర్చిపోయారా?’ అని ప్రశ్నించడం గమనార్హం. వేర్వేరు సందర్భాల్లో వెలుగుమట్ల గుట్టపైకి వెళ్లేందుకు స్థానిక మీడియాను కూడా నిరోధించినవారిలో ఆవేదన వ్యక్తం చేసిన మహిళలు లేకపోవచ్చు. కానీ ఆ ఇద్దరు జర్నలిస్టు సోదరులు చెప్పిన విషయంలో వాస్తవం ఉంది. వెలుగుమట్లలో ప్రవేశించేందుకు యూసీసీఆర్ఐ (ఎంఎల్) పార్టీ తరపున నియమించిన గుంపు అనుమతి అనివార్యమని, అవసరమనే అంశం కాదనలేని నిజం. తమకు అనుకూల వ్యక్తులను మినహా, మరే ఇతర, చివరికి మీడియా ప్రతినిధులు సైతం ప్రవేశించే అవకాశమే అక్కడ లేదు.

పోలీసు శాఖకు చెందిన ఇంటెలిజెన్స్, స్పెషల్ బ్రాంచ్ సిబ్బంది కూడా అక్కడికి వెళ్లేందుకు ఒకింత జంకేవారంటే ఆశ్చర్యం కాదు. రెవెన్యూ శాఖకు చెందిన అధికారులు ఆ ప్రదేశంలోని వ్యక్తుల చేత దెబ్బలు తిన్న చేదు అనుభవపు ఘటనలూ ఉన్నాయి. పోలీసులకు ఫిర్యాదు అందిన ఈ తరహా ఉదంతాల్లో అప్పట్లో చర్యలు తీసుకోలేదనే విమర్శలూ లేకపోలేదు. ఇటీవలి కాలంలో మంత్రులు పొంగులేటి, తుమ్మల వ్యాఖ్యల ప్రకారం.. కలెక్టర్ ఆఫీసు పక్కనే అదొక మాఫియా ముఠా, సమాంతర సామ్రాజ్యం. యూసీసీఆర్ఐ (ఎంఎల్) మాజీ నాయకుడు గుండా సత్యానారాయణరెడ్డి చెప్పిన ప్రకారం.. దారి తప్పిన నాయకుల వైఖరిగా చెప్పవచ్చు.

అడ్డగోలు వసూళ్లకు ఆధారాలివిగో..
వెలుగుమట్లలో ఇండ్లు నిర్మించుకున్న పేదల నుంచి యూసీసీఆర్ఐ (ఎంఎల్) పార్టీ నాయకులు చేసిన వసూళ్లకు ఆధారాలు కూడా ఉన్నాయి. మూడు కోట్ల వరకు పేదల నుంచి వసూళ్లు చేశారని పోలీసు శాఖ చెబుతుండగా, మొత్తం రూ. 20.00 కోట్ల వరకు ఈ వసూళ్ల సొమ్ము ఉంటుందని అదే పార్టీకి చెందిన మాజీ నాయకుడు గుండా సత్యనారాయణరెడ్డి ఆరోపణ. భారత కమ్యూనిస్టు విప్లవకారుల సమైక్యతా కేంద్రం, వినోభా భూదాన్ వెల్ఫేర్ సొసైటీ పేరుతో వసూళ్లు సాగాయి. రూ. 5 వేల నుంచి రూ. 40 వేల వరకు వసూళ్లు చేసినట్లు లభ్యమైన రశీదు ప్రతులే బహిర్గతం చేస్తున్నాయి. గడచిన ఎనిమిదేళ్ల కాలంలో ఈ వసూళ్ల మొత్తం రూ. 5.00 లక్షల వరకు చేరుకుందనే ఆరోపణలూ ఉన్నాయి. ఆనవాళ్లుగా చూపిన దిగువన గల రశీదు నెంబర్ల ప్రకారం వసూళ్లు వేల మంది నుంచి చేసినట్లు స్పష్టమవుతోంది.

దారి తప్పిన యూసీసీఆర్ఐ (ఎంఎల్) లక్ష్యం:
వాస్తవానికి యూసీసీఆర్ఐ (ఎంఎల్) అనే పార్టీ తొలుత ఎంచుకున్న లక్ష్యం వేరని ఆ పార్టీకి చెందిన మాజీ నాయకుడు సత్యనారాయణరెడ్డి చెబుతున్నారు. దమ్మపేట మండలంలో అప్పట్లో తమ పార్టీ నిర్వహించిన భూపోరాటం పేదలకు మేలు చేసిందన్నారు. అయితే వెలుగుమట్లలో పేదలకు మేలు చేయాలనే లక్ష్యం వసూళ్లకు దారి తీయడమే తమను బాధించిందని ఆయన చెబుతున్నారు. అందువల్లే తనవంటి వారు ఆ పోరాటంనుంచి వైదొలగాల్సి వచ్చిందని సత్యనారాయణరెడ్డి శుక్రవారం మీడియా సమావేశంలో చెప్పారు. మొత్తంగా వెలుగుమట్ల కూల్చివేతల వివాదంలో ఓ ‘ఎర్ర’ పార్టీ చేసిన వసూళ్లు ఇప్పుడు కేసులు, అరెస్టులకు దారి తీస్తున్నాయనేది కళ్లముందుకు కనిపిస్తున్న తాజా దృశ్యం.

కూల్చివేత ఓరకంగా మేలే చేసిందా!?
వెలుగుమట్లలో పేదలు నిర్మించుకున్న ఇండ్లను అధికారులు నిర్దాక్షిణ్యంగా కూల్చివేసి, వారికి నిలువ నీడ లేకుండా చేసిన చర్య అమానుషం, అమానవీయం. ఇందులో ఎటువంటి సందేహం లేదు. ఈ చర్య వల్ల రేవంత్ రెడ్డి ప్రభుత్వం జాతీయ స్థాయిలోనూ అప్రతిష్టను మూటగట్టుకుంది. ఫలితంగానే పాలకులు దిగివచ్చారనేది కాదనలేని నిజం. నష్టనివారణ చర్యలను చేపట్టిందనేది నిర్వివాదం. ఆగమేఘాలపై సర్వే నిర్వహించి 311 మందికి ఇంటి స్థలం పట్టాలు, 101 మందికి ఇందిరమ్మ ఇల్లు పథకాన్ని వర్తింపజేశారు. అంతేకాదు వెలుగుమట్లలో రోడ్లు, తాగునీరు, విద్యుత్ వంటి సౌకర్యాలను యుద్ధప్రాతిపదికన కల్పిస్తున్నారు. ఇళ్ల నిర్మాణానికి భూమి పూజ కూడా చేశారు.

గడచిన ఎనిమిదేళ్లుగా చిమ్మ చీకట్లలో, దారీతెన్నూ తెలియకుండా కాలిబాటల్లో, విద్యుత్ సౌకర్యం, గుక్కెడు తాగునీరు లేకుండా గడిపిన పేదల జీవితాల్లో కూల్చివేతలు ఓ రకంగా మేలే చేశాయని చెప్పవచ్చు. ఇప్పుడు ఆ పేదల నుంచి వసూళ్లు చేసుకునే అవకాశం, అధికారం కూడా ఎవరికీ లేదు. ఎందుకంటే చట్టబద్ధంగా ప్రభుత్వమే ఇప్పుడు బాధితులకు నివాస స్థలాన్ని ఇవ్వడమే కాదు, అక్కడ అన్ని సౌకర్యాల కల్పనకు నడుం బిగించింది. ఇటువంటి చట్టబద్ధ వసతులేవో కూల్చివేతకు ముందే చేసి ఉంటే బాగుండేది కదా? అనే ప్రశ్నకు మాత్రం సహేతుక సమాధానం పాలకుల నుంచి లేదన్నది నిర్వివాదాంశం.
