హైదరాబాద్: మావోయిస్ట్ పార్టీకి చెందిన ఇద్దరు అగ్రనేతలు తెలంగాణా డీజీపీ శివధర్ రెడ్డి ముందు మంగళవారం లొంగిపోయారు. వీరిలో పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు పుల్లూరి ప్రసాదరావు అలియాస్ చంద్రన్న, తెలంగాణా రాష్ట్ర కమిటీ సభ్యుడు బండి ప్రకాష్ అలియాస్ ప్రభాత్ ఉన్నారు. ఈ సందర్భంగా మీడియా అడిగిన పలు కీలక ప్రశ్నలకు డీజీపీ శివధర్ రెడ్డి స్పందిస్తూ, లొంగిపోయిన వారిని హెచ్చరిస్తూ మావోయిస్ట్ పార్టీ హెచ్చరికలు జారీ చేయడానికి సిద్ధాంతపరంగా దిగజారుడుతనంగా అభివర్ణించారు. జనజీవన స్రవంతిలో కలిసిన నక్సలైట్లను ఎలా కాపాడుకోవాలో తమకు తెలుసని, రక్షణ కల్పిస్తామని కూడా డీజీపీ ప్రకటించారు.
జనజీవన స్రవంతిలో కలిసిన ఇద్దరు అగ్రనేతల్లో పుల్లూరి ప్రసాదరావు ఈ సందర్భంగా మీడియా ప్రశ్నలకు సమాధానాలిచ్చారు. ఆపరేషన్ కగార్, అనారోగ్యం వల్ల తాము జనజీవన స్రవంతిలో కలిసినట్లు చెప్పారు. తెలంగాణా సీఎం రేవంత్ రెడ్డి నక్సలైట్లను తమ అన్నదమ్ములని చెప్పారని, సీఎంతోపాటు డీజీపీ శివధర్ రెడ్డి పిలుపుమేరకు తాము అజ్ఞాతం వీడినట్లు చెప్పారు. ఇప్పుడున్న పరిస్థితులు ఇందుకు దారి తీశాయని చెప్పారు. అయితే తమది లొంగుబాటు కాదని, జనజీవన స్రవంతిలోకి మాత్రమే వచ్చామన్నారు. అప్పుడూ, ఇప్పుడూ తాము ప్రజల కోసమే పనిచేస్తామన్నారు. తమ సిద్ధాంతం ఓడిపోలేదని ఆయన వ్యాఖ్యానించారు.


