తెలంగాణాలో ఇద్దరు సబ్ రిజిస్ట్రార్లు లంచం తీసుకుంటూ శుక్రవారం అవినీతి నిరోధక శాఖకు చిక్కారు. ఇందులో ఒకరు ఆదిలాబాద్ ఇంచార్జి సబ్ రిజిస్ట్రార్ కాగా, మరొకరు రంగారెడ్డి జిల్లా వనస్థలిపురం సబ్ రిజిస్ట్రార్. ఆదిలాబాద్ ఇంచార్జి జాయింట్ సబ్ రిజిస్ట్రార్ గా వ్యవహరిస్తున్న శ్రీనివాసరెడ్డి గిఫ్ట్ డీడ్ రిజిస్ట్రేషన్ చేసేందుకు రూ. 5,000 మొత్తాన్ని లంచంగా స్వీకరిస్తూ రెడ్ హ్యాండెడ్ గా ఏసీబీకి రెడ్ హ్యాండెడ్ గా చిక్కారు. గతంలోనూ శ్రీనివాసరెడ్డి లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడినట్లు తెలుస్తోంది.

అదేవిధంగా వనస్థలిపురం సబ్ రిజిస్ట్రార్ ఎస్. రాజేష్ కుమార్ ఓ ఆస్తిని రిజిస్ట్రేషన్ చేసేందుకు ఫిర్యాదుదారుని నుంచి లక్ష రూపాయల మొత్తాన్ని లంచంగా డిమాండ్ చేసి, బేరసారాల్లో రూ. 70,000 తీసుకుని అధికారిక మేలు చేసేందుకు అంగీకరించాడు. ఇందులో భాగంగానే కె. రమేష్ అనే వ్యక్తి మధ్యవర్తిగా ఆయా మొత్తాన్ని లంచంగా స్వీకరిస్తూ ఏసీబీకి పట్టుబడ్డారు. ఆయా ఘటనల్లో ఇద్దరు సబ్ రిజిస్ట్రార్లు శ్రీనివాసరెడ్డి, రాజేష్ కుమార్ లనే గాక, కె. రమేష్ అనే వ్యక్తిని కూడా ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు.
