Top 5 This Week

Related Posts

రౌడీషీటర్ సహా ఇద్దరి అరెస్ట్

రౌడీ షీటర్ సహా ఇద్దరు వ్యక్తులను ఖమ్మం నగర పోలీసులు మంగళవారం అరెస్ట్ చేశారు. వ్యవస్థీకృత నేరాలకు పాల్పడుతున్న రౌడీషిటర్ నవీన్, మరోవ్యక్తిని అరెస్ట్ చేసినట్లు ఖమ్మం టూ టౌన్ సీఐ బాలకృష్ణ తెలిపారు. గత కొంతకాలంగా నగరంలో పలు నేరాలకు పాల్పడుతూ ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్న రౌడీ షీటర్ ముద్ధంగుల నవీన్(29) తో పాటు పాత నేరస్తుడు మంజుల విజయ్ కుమార్ (27) లను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించినట్లు చెప్పారు.

విజిబుల్ పోలీసింగ్ లో భాగంగా నగరంలోని బీఆర్ఎస్ కార్యాలయం ఎదురుగా ఉన్న ఎన్ఎస్పీ కాలనీలో ఎస్సై రామారావు ఆధ్వర్యంలో పెట్రోలింగ్ చేస్తున్న పోలీసులను చూసి అనుమానాస్పదంగా పారిపోతున్న ఇద్దరు వ్యక్తులను పట్టుకొని విచారించగా, ద్వారక నగర్ ప్రాంతానికి చెందిన పాత నిందితులు ముద్ధంగుల నవీన్, మంజుల విజయ్ కుమార్ గా గుర్తించి అరెస్ట్ చేసినట్లు వివరించారు. ఈ సందర్భంగా వీరిద్దరూ పాల్పడిన నేరాలను కూడా సీఐ తెలిపారు.

గత నెల 9వ తేదీన ఎన్ఎస్పీ కాలనీలో స్కూటీపై వెళుతున్న ఓ వ్యక్తి ఆపి, బెదిరించి అతని బ్యాగులో గల రూ. 30 వేలు లాక్కొని పారిపోయారన్నారు. అదేవిధంగా ఖమ్మం అర్బన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కవిరాజనగర్ లో గత నెల 14వ తేదీ అర్ధరాత్రి మోటార్ సైకిల్ పై వెళ్తున్న మరో వ్యక్తి కళ్ళల్లో కారం చల్లి, బ్యాగు లాక్కొనటానికి ప్రయత్నించారని, అతను ప్రతిఘటించడంతో వీరిద్దరూ పారిపోయినట్లు తమ విచారణలో నిందితులు వెల్లడించారని సీఐ తెలిపారు. మోటార్ సైకిల్ మీద బ్యాగుల్లో డబ్బులు తీసుకు వెళ్తున్న వారిని గమనించి, వారిని అడ్డగించి డబ్బులు లాక్కోవడానికి వీళ్లు ప్రయత్నిస్తూ ఉంటారని అన్నారు.

ఈ కేసులోని మొదటి వ్యక్తి నవీన్ ఖమ్మంలో గత కొన్ని సంవత్సరాల నుంచి రోడ్లపై గొడవలు చేస్తూ సెటిల్మెంట్లు చేస్తూ ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తూ అనేక కేసుల్లో నిందితుడిగా ఉన్నట్లు చెప్పారు. అలాగే రెండు హత్యాయత్నం ఘటనలతోపాటు సుమారుగా 10 కేసులలో నిందితునిగా జైలుకు వెళ్లి బెయిల్ పై వచ్చినట్లు తెలిపారు. ఖమ్మం టూ టౌన్ పోలీస్ స్టేషన్లో రౌడీషీట్ కూడా ఉందని పెర్కొన్నారు. మరో నిందితుడు మంజుల విజయ్ కుమార్ పై 2021 సంవత్సరంలో ఖమ్మం అర్బన్ పోలీసులలో గంజాయి కేసు కూడా ఉందని తెలిపారు. వీరిద్దరి నుండి ఒక స్కూటీ, సెల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నట్లు సీఐ బాలకృష్ణ పేర్కొన్నారు.

Popular Articles