తిరుపతి: సోషల్ మీడియాలో తనపై దుష్ప్రచారం జరుగుతోందని తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్, టీవీ5 ఛానల్ అధినేత బీఆర్ నాయుడు పేర్కొన్నారు. అసలు ఈ వీడియోల్లో ఏముందని ఆయన ప్రశ్నించారు. అందులో అసభ్యత ఏముందని నిలదీశారు. ముప్పయి సంవత్సరాలుగా తమ కుటుంబం, ఆ వీడవియోల్లో ఉన్నవారు స్నేహితులమన్నారు. మూడు దశాబ్ధాలుగా వారితో పరిచయం ఉందని చెప్పారు. తాను ఎన్నిసార్లు చూసినప్పటికీ, వీడియోల్లో తప్పేమీ అనిపించలేదని, అందులో అసభ్యత ఏదీ కనిపించలేదన్నారు. తిరుపతిలో బీఆర్ నాయుడు మీడియా సమావేశంలో మాట్లాడారు.
తనపై బురదజల్లే కార్యక్రమం సాగిస్తున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను ఉద్ధేశించి నాయుడు వ్యాఖ్యానించారు. ఆ వీడియోలపై తన కుటుంబ సభ్యులుగాని, అందులో ఉన్నవారి కుటుంబ సభ్యులుగాని ఫిర్యాదు చేయాలన్నారు. అందులో ఉన్న కొన్ని ఫొటోలు తాను 20-25 ఏళ్ల కింద దిగిన చిత్రాలుగా చెప్పారు. ఆ ఫొటోలు, ఈ ఫొటోలు మిక్స్ చేసి, దానికో మ్యూజిక్ పెట్టి.., ఈ సన్నాసులకేం పనిలేదా? అని ప్రశ్నించారు.. తనను వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తే ఊర్కునేది లేదన్నారు. తానూ మీడియాలో ఉన్నానని, చుక్కలు చూపిస్తానని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను హెచ్చరించారు. ఇవన్నీ చీప్ పాలిటిక్స్ అని, తన దగ్గర నడవవని, హైదరాబాద్ నడిబొడ్డున ఉండి వ్యాపారాలు చేస్తున్నానని చెప్పారు. తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నవారిపై ఇప్పటికే పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు బీఆర్ నాయుడు పేర్కొన్నారు.

కాగా ఈ అంశంపై టీటీడీ మాజీ చైర్మెన్ భూమన కరుణాకర్ రెడ్డి కూడా స్పందించారు. ఇలాంటి అరాచక, అనైతిక కార్యక్రమాలకు పాల్పడేటువంటి వ్యక్తిని క్షణంలో తీసివేయాల్సిందిపోయి, అతనిచేత పోలీసు కంప్లయింట్ ఇప్పించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను అరెస్ట్ చేయాలని పురమాయిస్తున్నారంటే ఇది రాజకీయ దౌర్భాగ్యం కాదని, వేంకటేశ్వరస్వామిపట్ల మీరు చేస్తున్నపాపాలకు పరాకాష్ట అని ఆయన వ్యాఖ్యానించారు. బీఆర్ నాయుడికి ఛాలెంజ్ చేస్తున్నానని, అవి డీప్ ఫేక్ వీడియోలు కాదని, ఇంతకంటే బలమైనవి బయటకు వస్తాయని కరుణాకర్ రెడ్డి ప్రకటించారు.

