సింహాద్రి అప్పన్న చందనోత్సంలో విషాద ఘటన చోటు చేసుకుంది. విశాఖపట్నంలోని సింహాచలం లక్ష్మీనరసింహస్వామి చందనోత్సవం సందర్భంగా ఆయన నిజరూప దర్శనం కోసం వచ్చిన భక్తులపై గోడ కూలడంతో ఎనిమిది మంది దుర్మరణం చెందారు. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. ప్రాణాలు కోల్పోయినవారిలో ఐదుగురు పురుషులు కాగా, ముగ్గురు మహిళలు.

సింహగిరి బస్టాండ్ నుంచి ఎగువకు వెళ్లే మార్గంలోని షాపింగ్ కాంప్లెక్స్ వద్ద రూ. 300 టికెట్ తీసుకుని క్యూ లైన్ లో గల భక్తులపై గోడ కూలింది. మంగళవారం అర్ధరాత్రి దాటిన తర్వాత సింహాచలంలో భారీ వర్షం కురిసిన పరిస్థితుల్లో భక్తులపై గోడకూలినట్లు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. దుర్ఘటనపై ఏపీ, తెలంగాణా సీఎంలు చంద్రబాబునాయుడు, రేవంత్ రెడ్డిలు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు.
