ఎమ్మెల్సీ చింతపండు నవీన్ @ తీన్మార్ మల్లన్నకు టీపీసీ షోకాజ్ నోటీస్ జారీ చేసింది. కుల గణన సర్వే పత్రాల దహనం తదితర అంశాల్లో నవీన్ ప్రవర్తనా తీరును ఆక్షేపిస్తూ టీపీసీసీ క్రమశిక్షణా కమిటీ చైర్మెన్ జి. చిన్నారెడ్డి ఈ నోటీసును జారీ చేశారు. నోటీసుపై ఈనెల 12వ తేదీలోగా వివరణ ఇవ్వాలని పేర్కొన్నారు.
ఇటీవలి కాలంలో చింతపండు నవీన్ వ్యవహార శైలి కాంగ్రెస్ పార్టీకి ఇబ్బందికరంగా పరిణమించిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా సొంత పార్టీ నేతలపై నోరు పారేసుకోవడం, ప్రభుత్వం నిర్వహించిన కులగణన సర్వేపై చేసిన వ్యాఖ్యలు, కొన్ని సామాజిక వర్గాలను దూషించడం వంటి అంశాలు కాంగ్రెస్ పార్టీకి సమస్యగా మారాయి. ఈ నేపథ్యంలో సంజాయిషీని కోరుతూ ఎమ్మెల్సీ నవీన్ కు జారీ చేసిన షోకాజ్ నోటీసు ప్రతిని దిగువన చూడవచ్చు.
