మావోయిస్ట్ పార్టీ సెంట్రల్ కమిటీ సెక్రటరి నంబాల కేశవరావు అలియాస్ బసవరాజ్ ఎన్కౌంటర్ లో మరణించారు. ఛత్తీస్ గఢ్ లోని నారాయణ్ పూర్ జిల్లాలో బుధవారం జరిగిన ఎన్కౌంటర్ లో మావోయిస్ట్ పార్టీ అగ్రనేత కేశవరావు సహా 27 మంది నక్సలైట్లు ప్రాణాలు కోల్పోయారనేది ప్రధాన వార్త. నంబాల మృతి పార్టీకి భారీ నష్టం.. నంబాల నేపథ్యం తదితర అంశాల గురించి వచ్చిన వార్తలు సాధారణం. ఈ ఎన్కౌంటర్ ఘటనపై దేశ ప్రధాని స్పందించడం నక్సలిజం చరిత్రలోనే తొలిసారి.. అదీ అసలు అంశం.
మావోయిస్టు పార్టీ లేదా అంతకు ముందుగల పీపుల్స్ వార్ పార్టీకి చెందిన అగ్రనేతలు అనేక మంది ఎన్కౌంటర్లలో మృతి చెందారు. కమ్యూనిస్టు పార్టీ వ్యవస్థాపకుడు చార్ మజుందార్ 1970లో చనిపోయిన సందర్భం నుంచి 1994లో వరంగల్ జిల్లా ధర్మసాగర్ మండలం మద్దెలగూడెం ఎన్కౌంటర్ లో ప్రాణాలు కోల్పోయిన అప్పటి పీపుల్స్ వార్ ప్రొవిన్షియల్ కమిటీ సెక్రటరీ పులి అంజయ్య దంపతుల వరకు అనేక మంది ముఖ్య నాయకులు ఎన్కౌంటర్ లో మరణించారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా మల్హర్ మండలం కొయ్యూరులో 1999లో జరిగిన ఎన్కౌంటర్ లో పీపుల్స్ వార్ కేంద్ర కమిటీ సభ్యుడు నల్లా ఆదిరెడ్డి, ప్రొవిన్షియల్ కమిటీ మెంబర్ యర్రంరెడ్డి సంతోష్ రెడ్డి, ఉత్తర తెలంగాణా స్పెషల్ జోన్ కమిటీ కార్యదర్శి శీలం నరేష్ వంటి అగ్ర నేతలను కూడా పార్టీ కోల్పోయింది.

అనేక ఎదురుకాల్పుల ఘటనల్లో పలువురు ముఖ్య నేతలను అప్పటి పీపుల్స్ వార్, ఇప్పటి మావోయిస్టు పార్టీ కోల్పోయి కోలుకోలేని ఎదురుదెబ్బలను చవి చూసింది. అయితే ఇటువంటి అనేక ఎన్కౌంటర్లలో పాలకులు, ముఖ్యంగా దేశ ప్రధాని స్థాయి నాయకుడు స్పందించిన తొలి సందర్భం నంబాల కేశవరావు ఎన్కౌంటర్ ఘటనగానే చెప్పవచ్చు. వచ్చే మార్చి నెలాఖరుకల్లా నక్సలిజాన్ని తుదముట్టిస్తామని, నక్సల్స్ రహిత దేశంగా మారుస్తామని కేంద్ర హోం మంత్రి అమిత్ షా పునరుద్ఘాటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే నంబాల కేశవరావు మృతి చెందారనే విషయాన్ని సైతం కేంద్ర హోం మంత్రి అమిత్ షా బుధవారం ధ్రువీకరించారు. నక్సలిజం నిర్మూలనలో ఇదొక మైలురాయిగా అమిత్ షా తన ఎక్స్ ఖాతా ద్వారా వ్యాఖ్యానించారు.

అయితే నక్సలిజం చరిత్రలో తొలిసారి ఓ ఎన్కౌంటర్ ఘటనపై దేశ ప్రధాని స్పందించడం గమనార్హం. ఈమేరకు ప్రధాని నరేంద్ర మోదీ ఎక్స్ వేదికగా స్పందిస్తూ, ఆపరేషన్ లో పాల్గొన్న భద్రతా బలగాలను ప్రశంసించారు. బలగాల అద్భుత విజయాన్ని చూసి గర్విస్తున్నానని, మావోయిజం ముప్పును నిర్మూలించి ప్రజలకు శాంతి, పురోగతితో కూడిన జీవితాన్ని అందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉన్నట్లు ప్రధాని మోదీ పేర్కొన్నారు. దశాబ్ధాల నక్సలిజం చరిత్రలో భారీ ఎన్కౌంటర్ ఘటనపై దేశ ప్రధాని స్పందించడం ఇదే తొలిసారి విప్లవ కార్యకలాపాల పరిశీలకులు సైతం ప్రస్తావిస్తున్నారు.

