Sunday, August 31, 2025

Top 5 This Week

Related Posts

ఔనా…? గణపతి లొంగిపోతాడా!?

ఔనా…? మావోయిస్టు పార్టీ అగ్రనేత ముప్పాళ్ల లక్ష్మణరావు అలియాస్ గణపతి ప్రభుత్వానికి లొంగిపోతాడా? ఈ వార్త నిజమే అయితే విప్లవోద్యమ చరిత్రలో ఇదో పెద్ద కుదుపుగానే భావించాలి. ఎందుకంటే గణపతి అనే నక్సల్ నేత సాధారణ విప్లవకారుడేమీ కాదు. మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ కార్యదర్శిగా వ్యవహరించి దాదాపు ఏడాదిన్నర కాలంగా ఎటువంటి నాయకత్వ బాధ్యతలు లేకుండా ఖాళీగానే ఉంటున్న అగ్రనేత. విప్లవోద్యమానికి టాటా చెప్పేసి లొంగుబాటలో గణపతి పయనిస్తున్నాడనే వార్తలు గత అర్ధ రాత్రి నుంచి చక్కర్లు కొడుతున్నాయి. ప్రముఖ పత్రికల ఎడిటర్లు కూడా ఈ అంశం నిర్ధారణ కాక తలలు నిమురుకుంటున్నారు.

ఇంతకీ గణపతి లొంగిపోతాడా? లేక పోలీసులు అరెస్ట్ చూపిస్తారా? ఈ రెండిట్లో ఏదో ఒకటి జరిగే అవకాశం ఉందా? ఇదీ అసలు ప్రశ్న. గణపతి లొంగిపోతాడనే అంశంపై తీవ్రవాద కార్యకలాపాల అణచివేతలో దూకుడుగా వ్యవహరించిన రిటైర్డ్ పోలీసు అధికారులు కూడా భిన్నాభిప్రాయాలను వ్యక్తం చేస్తుండడమే ఇందుకు కారణం. గణపతి ‘లొంగుబాటు’ అంశానికి సంబంధించి నిన్న రాత్రి స్పెషల్ ఇంటలిజెన్స్ బ్యూరో (ఎస్ఐబీ)లోనూ చర్చ జరిగినట్లు సమాచారం. ఎస్ఐబీ అధికారులు గణపతి లొంగుబాటు అంశాన్ని అత్యంత గోప్యంగా ఉంచినట్లు తెలుస్తోంది. ఈ పరిస్థితుల్లోనే గణపతి లొంగిపోతారనే ప్రచారం మరోవైపు ఊపందుకుంది.

ఒకప్పటి పీపుల్స్ వార్, ప్రస్తుత మవోయిస్టు పార్టీకి గణపతి నాయకత్వపరంగా ఎదిగిన నేపథ్యాన్ని కాసేపు పక్కనబెడితే అసలు ఆయన ఎందుకు లొంగిపోతారు? ఇదీ విప్లవ కార్యకలాపాల పరిశీలకుల అసలు సందేహం. ఎందుకంటే గణపతి ఓ రెబల్. గణపతి పీపుల్స్ వార్ వ్యవస్థాపకుడు కొండపల్లి సీతారామయ్య టైపు కాదు. పార్టీ వ్యవస్థాపకుని విధానాలనే వ్యతిరేకించి సాయుధ పోరాటమే శరణ్యమని భావించి కేంద్ర కమిటీ కార్యదర్శి పదవిని అధిష్టించిన నేపథ్యం. పార్టీని జాతీయ స్థాయిలో విస్తరించిన విప్లవోద్యమ పట్టుదల, తిరుగుబాటు తత్వం గణపతి సొంతంగా పోలీసు అధికారులు కొందరు విశ్లేషిస్తుంటారు.

ఇటువంటి రెబల్ గణపతి ఎందుకు లొంగిపోతారనేది కూడా ఓ సందేహమనే వాదన కూడా వినిపిస్తోంది. వాస్తవానికి గణపతి వయస్సు ప్రస్తుతం 71 సంవత్సరాలు. ఆయన 1949 జూన్ 16వ తేదీన జన్మించారు. ఏడాదిన్నర క్రితం పార్టీ కేంద్ర కమిటీ కార్యదర్శి పదవి నుంచి గణపతిని తప్పించారు. నంబళ్ల కేశవరావు అలియాస్ బసవరాజ్ ప్రస్తుతం సెంట్రల్ కమిటీ కార్యదర్శిగా వ్యవహరిస్తున్నారు. ఈ నేపథ్యంలో పార్టీ పరంగా పెద్దగా విధులుగాని, బాధ్యతలుగాని గణపతికి లేవని, పైగా వయోభారం, అనారోగ్యం వంటి సమస్యలు ఆయనను వెంటాడుతున్నాయనే వాదనను పోలీసు వర్గాలు వినిపిస్తున్నాయి. కొండపల్లిని నాయకత్వ బాధ్యతల నుంచి తప్పించిన తరహాలోనే గణపతిని కూడా తొలగించారనే ప్రచారం కూడా జరిగింది.

పీపుల్స్ వార్ వ్యవస్థాపకుడు కొండపల్లి సీతారామయ్య

‘ఈ పరిస్థితుల్లో గణపతి ప్రస్తుతం ఏం చేయాలి? ఓవైపు అనారోగ్యం. మరోవైపు రక్షణపరంగా అభద్రతా భావం. తనను నాయకత్వ బాధ్యతల నుంచి తప్పించిన పరిస్థితుల్లో, అతని రెబల్ స్వభావానికి అనుగుణంగా కొత్త విప్లవ గ్రూపును స్థాపించేందుకు వయోభారం ప్రతిబంధకంగా మారింది. అందుకు పరిస్థితులు కూడా అనుకూలంగా లేవు. అందుకే గణపతి లొంగుబాటను ఎంచుకుని ఉండవచ్చు.’ ఇదీ ఓ వాదన. కానీ… గణపతి విప్లవ నేపథ్యాన్ని పరిశీలిస్తే ఆయన తుది శ్వాస వరకు కూడా తన పంథాను మార్చుకోకపోవచ్చనే మరో వాదన కూడా వినిపిస్తున్నది. చనిపోయేవరకు కూడా పార్టీలోనే ఉంటాడని, సరెండరయ్యే అవకాశం ఉండకపోవచ్చనేది ఈ వాదన సారాంశం. కొండపల్లి సీతారామయ్యను కూడా అప్పట్లో ఇదే విధంగా భావించామని, చివరికి ఏంజరిగింది? ఆయన లొంగిపోలేదా? అనేది ఇంకో వాదన.

మొత్తంగా ఆయా అంశాలను పరిశీలించినపుడు వివిధ కారణాలు గణపతి లొంగుబాటు వాదనకు కాస్త బలాన్ని చేకూరుస్తుండవచ్చు. మరికొన్ని కారణాలు లొంగుబాటు వార్తల విశ్వసనీయతను ప్రశ్నిస్తుండవచ్చు. కానీ… గణపతి లొంగుబాట నిజమే అయితే? అందుకు మీడియేషన్ (మధ్యవర్తిత్వం) చేసేదెవరు? ఇది ఇంకో ప్రశ్న. ఎందుకంటే గణపతి లొంగుబాటు అంశంలో లాభనష్టాలు సమానంగా ఉంటాయన్నది ఓ రిటైర్డ్ పోలీసు అధికారి అభిప్రాయం. అందుకు సామాజిక సమీకరణలు దోహదం చేస్తాయనేది ఆయన వాదన.

ఈ నేపథ్యంలో గణపతి ‘లొంగుబాటు’ ప్రచారపు వార్త ఏ కోణంలో చూసినా పాలక వర్గాలకు ప్రయోజనం చేకూర్చే అంశమనేది నిర్వివాదం. ‘‘గణపతి లొంగిపోతే మావోయిస్టు పార్టీ కేడర్ ఆత్మస్థయిర్యాన్ని కోల్పోతుంది. అందుకు విరుద్ధంగా జరిగితే ఈ ప్రచారం వల్ల సాయుధ దళాలు గందరగోళ స్థితిని ఎదుర్కుంటాయి. తీవ్రవాద కార్యకలాపాల అణచివేతలో ప్రభుత్వ, పాలకుల వ్యూహాలు ఇందులో భాగం. అది రాజ్యపాలన తీరులో ఓ ఎత్తుగడ. ఇందులో తప్పు పట్టాల్సింది కూడా ఏమీ లేదు. తీవ్రవాదం అణచివేతలో ఇది మా విధి కూడా.’’ అని తన పేరు రాయడానికి నిరాకరించిన విశ్రాంత పోలీసు అధికారి వ్యాఖ్యానించడం విశేషం.

Popular Articles