Top 5 This Week

Related Posts

అమిత్ షా ముందు లొంగిపోనున్న దేవ్ జీ!?

ఛత్తీస్ గఢ్: మావోయిస్ట్ పార్టీ కేంద్ర కమిటీ కార్యదర్శిగా ప్రాచుర్యంలో గల ఆ పార్టీ అగ్రనేత దేవ్ జీ అలియాస్ తిప్పిరి తిరుపతి కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా ముందు లొంగిపోనున్నారా? ఇందుకు అవసరమైన ప్రక్రియ సిద్ధమవుతోందా? సరైన సమయం, సందర్భానుసారం దేవ్ జీ లొంగుబాట జరుగుతుందా? నక్సల్స్ రహిత దేశంగా కేంద్ర ప్రభుత్వం దేవ్ జీ లొంగుబాటు ఘటననే ప్రకటించే అవకాశముందా? ఇటువంటి అనేక ప్రశ్నలకు ఔననే చెబుతున్నాయి ఇంటెలిజెన్స్ విభాగానికి చెందిన విశ్వసనీయ వర్గాలు. ఇదే నిజమైతే దేవ్ జీ పయనించే లొంగు‘బాట’ మావోయిస్ట్ పార్టీ విప్లవోద్యమ చరిత్రలో చివరి సరెండర్ దృశ్యంగా మిగిలిపోనున్నట్లు తెలుస్తోంది.

గత నెల 18వ తేదీన ఏపీలోని అల్లూరి జిల్లా మారేడుమిల్లి అడవుల్లో జరిగిన ఎన్కౌంటర్ ఘటనలో మోస్ట్ వాంటెడ్ మావోయిస్ట్ లీడర్ హిడ్మా, అతని భార్య రాజే సహా ఐదుగురు నక్సల్స్ మృతి చెందిన సంగతి తెలిసిందే. ఈ ఘటన జరిగిన రోజే విజయవాడ, కాకినాడ, ఏలూరు తదితర నగరాల్లో 50 మంది మావోయిస్టులను ఏపీ పోలీసులు అరెస్ట్ చేశారు. అరెస్టయినవారిలో మావోయిస్ట్ పార్టీ కేంద్ర కమిటీ నాయకుడు దేవ్ జీ అంగరక్షకులు తొమ్మిది మంది కూడా ఉన్నట్లు పోలీసు అధికారులు అప్పట్లో ప్రకటించారు. ఈ పరిస్థితుల్లో ఇంతకీ దేవ్ జీ ఎక్కడ? అంటూ పలు వార్తా కథనాలు వెలువడ్డాయి.

అయితే హిడ్మా, టెక్ శంకర్ ల ఎన్కౌంటర్ ఘటనల్లో దేవ్ జీపై ఛత్తీస్ గఢ్ కు చెందిన మాజీ ఎమ్మెల్యే మనీష్ కుంజా, సోనిసోడిలు చేసిన ఆరోపణలను మావోయిస్ట్ పార్టీ ఖండించింది. ఆంధప్రదేశ్ లో అరెస్టయిన నక్సలైట్లలో దేవ్ జీ, మల్లా రాజిరెడ్డిలు లేరని స్పష్టం చేసింది. అయితే దేవ్ జీ, మల్లా రాజిరెడ్డిలు క్షేమంగానే ఉన్నారా? అనే అంశాన్ని మాత్రం పార్టీ తన ప్రకటనలో స్పష్టం చేయలేదు. ఈ పరిస్థితుల్లోనే దేవ్ జీ లొంగుబాటు అంశంపై భిన్న కోణాల్లో వార్తలు వస్తూనే ఉన్నాయి.

మహారాష్ట్ర, ఛత్తీస్ గఢ్ ముఖ్యమంత్రుల ముందు లొంగిపోయిన మావోయిస్ట్ పార్టీ అగ్ర నేతలు మల్లోజుల వేణుగోపాల్, ఆశన్న (ఫైల్ ఫొటో)

ఇదే దశలో దేవ్ జీ లొంగుబాటకు మార్గం సుగమం అవుతోందనే ప్రచారం జరుగుతోంది. కేంద్ర హోం మంత్రి అమిత్ షా సమక్షంలో దేవ్ జీ జనజీవన స్రవంతిలో కలిసేందుకు ప్రయత్నం జరుగుతున్నట్లు ఇంటెలిజెన్స్ వర్గాలు చెబుతున్నాయి. అయితే లొంగిపోయిన నక్సలైట్లపై పూర్తి స్థాయిలో కేసులు ఎత్తివేయాలని, జనజీవన స్రవంతిలో కలిసినవారిని ఏ ఇబ్బందీ పెట్టవద్దనే షరతులు ఈ సందర్భంగా ముందుకు వస్తున్నట్లు తెలిసింది. ఇప్పటికే మహారాష్ట్ర, ఛత్తీస్ గఢ్ ముఖ్యమంత్రుల ముందు పార్టీ అగ్రనేతలు మల్లోజుల వేణుగోపాల్ అలియాస్ సోను, తక్కళ్లపల్లి వాసుదేవరావు అలియాస్ ఆశన్న సహా వందలాది మంది నక్సల్స్ లొంగిపోయిన సంగతి తెలిసిందే.

లొంగు‘బాట’లో పయనించిన నక్సల్స్ పై కేసుల ఎత్తివేత అంశాన్ని పరిశీలించేందుకు ఛత్తీస్ గఢ్ ప్రభుత్వం ఇటీవలే మంత్రివర్గ ఉపసంఘాన్ని నియమించింది. ఈ నేపథ్యంలోనే దేవ్ జీ లొంగుబాటు, కేసుల ఎత్తవేత అంశాలపై ఈ తరహా ప్రచారం జరుగుతోంది. అయితే దేవ్ జీ తన సమక్షంలో లొంగిపోయేందుకు కేంద్ర హోం మంత్రి అమిత్ షా అనుమతిస్తారా? లేదా? అనే ప్రశ్నలపైనా భిన్నవాదనలు వినిపిస్తున్నాయి. దేవ్ జీ లొంగుబాటుకు అవసరమైన మార్గం సుగమమవుతోందని, దేవ్ జీతోపాటు అతనితో సహా లొంగిపోయే నక్సల్స్ ఘటన మావోయిస్ట్ పార్టీ చరిత్రలో గుర్తుండిపోయే ఘటనగా ఉండవచ్చంటున్నాయి ఇంటెలిజెన్స్ వర్గాలు. బహుషా కేంద్రం విధించిన డెడ్ లైన్.. వచ్చే మార్చి నెలాఖరు తేదీలోపు దేవ్ జీ లొంగుబాటు సీన్ ఎప్పుడైన కనిపించవచ్చని చెబుతున్నాయి ఆ వర్గాలు.

Popular Articles