Saturday, January 24, 2026

Top 5 This Week

Related Posts

ఎన్కౌంటర్ మృతుడు ఆ అగ్రనేత గన్ మెన్!

నిన్న భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో జరిగిన ఎన్కౌంటర్ ఘటనలో మృతుడు ఎవరనే అంశంపై క్లారిటీ వచ్చినట్లే కనిపిస్తోంది. గుండాల మండలం దుబ్బగూడెం-దేవళ్లగూడెం అటవీ ప్రాంతంలో గురువారం తెల్లవారుజామున పోలీసులకు, మావోయిస్టు పార్టీ నక్సలైట్లకు మధ్య జరిగిన ఎన్కౌంటర్ లో ఆ పార్టీ యాక్షన్ టీం సభ్యుడు మరణించినట్లు పోలీసులు ప్రకటించిన సంగతి తెలిసిందే.

చనిపోయిన వ్యక్తిని గుర్తించాలంటూ కొత్తగూడెం ఎస్పీ నిన్న సాయంత్రం ఓ ప్రకటన కూడా జారీ చేశారు. గులాబీ రంగు టీ షర్ట్, నీలం రంగు లోయర్ ధరించి, 26 ఏళ్ల వయస్సు, 5.3 అడుగుల ఎత్తు, గోధుమ రంగు ఛాయ గల గుర్తు తెలియని మావోయిస్టుగా పోలీసులు మృతున్ని ప్రకటించారు. అతని మృతదేహాన్ని కొత్తగూడెం ప్రభుత్వాసుపత్రిలో ఉంచామని, బంధువులుగాని, ఇతర వ్యక్తులుగాని అతన్ని గుర్తించినట్లయితే జిల్లా పోలీసులను సంప్రదించాలని ఎస్పీ పేర్కొన్నారు.

ఈ నేపథ్యంలోనే ఎన్కౌంటర్ లో చనిపోయిన మృతుని గురించి వార్తలు వెలువడుతున్నాయి. ఎన్కౌంటర్ మృతుడు ఛత్తీస్ గఢ్ లోని బీజాపూర్ జిల్లా కిష్టారం సమీపంలోని దూలోడు గ్రామానికి చెందిన దూది దేవాలు అలియాస్ శంకర్ గా సమాచారం. మావోయిస్టు పార్టీ తెలంగాణా రాష్ట్ర కమిటీ కార్యదర్శి హరిభూషణ్ అలియాస్ జగన్ కు శంకర్ గన్ మెన్ గా వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోంది.

Popular Articles