(సమీక్ష ప్రత్యేక కథనం)
సంక్రాంతి పండుగకు ఏపీవైపు వెళ్లేవారి సౌలభ్యం కోసం ‘టోల్ ఫ్రీ’ సదుపాయం కల్పించాలని తెలంగాణా రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కేంద్ర రోడ్డు, రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీకి లేఖ రాసిన సంగతి తెలిసిందే. హైదరాబాద్-విజయవాడ నేషనల్ హైవే మార్గంలోని పంతంగి, కొర్లపహాడ్, చిల్లకల్లు టోల్ గేట్ల వద్ద పండుగ రద్దీ వల్ల ఇబ్బందులు తలెత్తకుండా వాహనదారులకు ‘టోల్ ఫ్రీ’ అవకాశం ఇవ్వాలని కోమటిరెడ్డి రాసిన లేఖపై నెటిజన్లు తీవ్రంగా మండిపడుతున్నారు. తెలంగాణాలోనూ ఈ లేఖపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. కోమటిరెడ్డి లేఖకు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ స్పందిస్తారా? లేదా? అనేది వేరే విషయం.
కానీ.. ఇదే దశలో ‘మేడారం’ మహాజాతర విషయంలోనూ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇదే విధంగా లేఖ రాయాలనే డిమాండ్ ను సమ్మక్క-సారలమ్మ భక్తులు తెరపైకి తీసుకువస్తున్నారు. హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై సంక్రాంతి వంటి పండుగ సమయాల్లో రోజుకు సగటు వాహనాల సంఖ్య లక్ష వాహనాలుగా ఓ అంచనా. ఓ నివేదిక ప్రకారం 2023 చివరి త్రైమాసికం ప్రకారం దినసరి సగటు వాహనాల సంఖ్య మాత్రం 24,300గా నమోదైంది. వాస్తవానికి సంక్రాంతి పండుగకు హైదరాబాద్-విజయవాడ నేషనల్ హైవేపై పయనించే వాహనాలు ఎక్కువగా ఏపీవైపే వెడుతుంటాయి. ముఖ్యంగా గుంటూరు, పశ్చిమగోదావరి, కృష్ణా జిల్లాకు చెందినవారి వాహనాలకే ఎక్కువ లబ్ధి చేకూరుతుందనే వాదనలు వినిపిస్తున్నాయి.
ఈ నేపథ్యంలోనే మేడారం జాతరకు వచ్చే భక్తుల సంఖ్యను కూడా పరిగణనలోకి తీసుకుని ‘టోల్ ఫ్రీ’ కోసం మంత్రి కోమటిరెడ్డి మరో లేఖను కేంద్రానికి రాయాల్సిన అవసరముందనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఆసియాలోనే అతిపెద్దదైన మేడారం మహాజాతరకు కోటి మందికిపైగా భక్తులు హాజరవుతున్నట్లు ఇప్పటికే సంఖ్య నమోదైంది. ఆర్టీసీ బస్సులు కూడా వేల సంఖ్యలో నడుపుతారు. తెలుగు రాష్ట్రాల నుంచేగాక మహారాష్ట్ర, ఒడిషా, ఛత్తీస్ గఢ్, కర్నాటక, మధ్యప్రదేశ్ తదితర రాష్ట్రాల నుంచి కూడా భక్తులు మేడారం మహాజాతరకు కార్లు, జీపులు, ఆటోల వంటి వాహనాల్లో వస్తుంటారు.

ఇంత భారీ సంఖ్యలో వచ్చే భక్తుల్లో ఇతర రాష్ట్రాలకు చెందినవారి సంగతి ఎలా ఉన్నప్పటికీ, తెలంగాణాలోని దాదాపు అన్ని జిల్లాల నుంచి వచ్చే భక్తుల వాహనాలకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి నేషనల్ హైవేల్లో గల టోల్ గేట్ల వద్ద ‘టోల్ ఫ్రీ’ సౌకర్యం కల్పించాల్సిన అవసరముందంటున్నారు. హైదరాబాద్ నుంచి భువనగిరి, ఆలేరు, జనగామ, హన్మకొండ, ములుగు, ఏటూరునాగారం మీదుగా వెళ్లే ఛత్తీస్ గఢ్ లోని జగదల్ పూర్ వెళ్లే మార్గంలోనూ పలు టోలు గేట్లు ఉన్నాయి. మహారాష్ట్ర, ఆదిలాబాద్, నిజామాబాద్, మంచిర్యాల, గోదావరిఖని తదితర ప్రాంతాల నుంచి వచ్చే వాహనాలకూ టోల్ గేట్లు ఎదురవుతుంటాయి.
అదేవిధంగా నల్గొండ, సూర్యాపేట, మహబూబ్ నగర్, మెదక్, కరీంనగర్ తదితర ప్రాంతాల నుంచి వచ్చే మార్గాల్లోనూ పలు టోల్ గేట్లు ఉన్నాయి. ఆయా మార్గాల్లోనేగాక హన్మకొండ-మేడారం మార్గంలో జవహర్ నగర్ వద్ద గల టోల్ గేట్ ను మాత్రం ఏ వాహనమూ తప్పించుకునే అవకాశం లేదు. ఈ పరిస్థితుల్లో కేవలం ‘సంక్రాంతి’ పండుగను ఎంజాయ్ చేసేవారికే కాదు, సమ్మక్క తల్లి భక్తులకు కూడా ‘టోల్ ఫ్రీ’ కోసం మంత్రి కోమటిరెడ్డి నితిన్ గడ్కరీకి లేఖ రాయాల్సిన అవసరముందనే డిమాండ్ వినిపిస్తోంది. ఈనెల 28వ తేదీ నుంచి 31వ తేదీ వరకు జరగనున్న మేడారం మహాజాతరకు హాజరయ్యే దాదాపు కోటిన్నర మంది భక్తులకు లబ్ధి చేకూర్చడమే కాదు, ట్రాఫిక్ జామ్ కాకుండా మంత్రి కోమటిరెడ్డి వెంటనే లేఖ రాయాలని వనదేవతల భక్తులు కోరుతున్నారు.

