Friday, January 23, 2026

Top 5 This Week

Related Posts

దళపతిగా తిరుపతి..! నిజమేనా!?

మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ కార్యదర్శిగా తిప్పిరి తిరుపతి అలియాస్ దేవ్ జీ (58) నియమితులయ్యారనేది వెలువడిన వార్తల సారాంశం. ఈ నాయకత్వ బాధ్యతల్లో గల నంబాల కేశవరావు అలియాస్ బసవరాజ్ గత మే 21వ తేదీన ఛత్తీస్ గఢ్ అడవుల్లో జరిగిన ఎన్కౌంటర్ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన తర్వాత ఆయన స్థానంలో దేవ్ జీ నియామకం జరిగినట్లు వివిధ సమాచార, ప్రసార మాధ్యమాల్లో, మీడియాలో వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే దేవ్ జీ నియామకం నిజమేనా? కాదా? అనే ప్రశ్నపైనే భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఎందుకంటే ఇతని నియామకంపై పార్టీ అధికారికంగా ఎటువంటి ప్రకటన జారీ చేయకపోవడమే దీనికి కారణంగా విప్లవోద్యమ పరిశీలకులు భావిస్తున్నారు.

ఇదే సందర్భంలో ప్రస్తుత పరిస్థితుల్లో మావోయిస్టు పార్టీకి కేంద్ర స్థాయిలో నాయకత్వ భర్తీని చేసే పరిస్థితులు ఉన్నాయా? అనేది అసలు ప్రశ్న. వచ్చే మార్చి లోపు మావోయిస్టు పార్టీని అంతమొందిస్తామని, నక్సల్స్ రహిత దేశంగా మారుస్తామని కేంద్ర ప్రభుత్వం పదే పదే ప్రకటిస్తున్న పరిస్థితులు, అందుకు అనుగుణంగానే ఛత్తీస్ గఢ్ లో చోటు చేసుకుంటున్న వరుస ఎన్కౌంటర్లు, ముఖ్య నేతలు అనేక మంది నేలకొరుగుుతున్న నేపథ్యంలో మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ కార్యదర్శిని నియమించుకునే సానుకూల వాతావరణం ఛత్తీస్ గఢ్ లో ఉందా? అనే సంశయాలు విప్లవోద్యమ పరిశీలకుల్లో తలెత్తుతున్నాయి. ప్రతి ఐదు కిలోమీటర్లకు ఓ బేస్ క్యాంపు ఏర్పాటు చొప్పున భద్రతా బలగాలు ఛత్తీస్ గఢ్ అడవులను ఆధీనంలోకి తీసుకుంటున్న పరిస్థితులు తెలిసిందే.

(ఫైల్ ఫొటో)

విప్లవ పార్టీలో నాయకత్వ భర్తీకి ఓ ప్రక్రియ ఉంటుంది. కేంద్ర కమిటీ కార్యద్శి వంటి ముఖ్య నేతను ఎన్నుకునే ముందు ఈ ప్రక్రియను తప్పనిసరిగా నిర్వహిస్తారు. ముఖ్యంగా పార్టీ మహాసభనుగాని, ప్లీనరీనిగాని నిర్వహించాలి. ఈ సభలో తీసుకున్న నిర్ణయంయపై కేంద్ర కమిటీ సమావేశమై తదుపరి అడుగు వేస్తుంది. అనంతరం పొలిట్ బ్యూరో సభ్యుల సమావేశం జరుగుతుంది. విప్లవోద్యమ పార్టీల్లో మావోయిస్టు పార్టీ పొలిట్ బ్యూరోను కూడా కలిగి ఉండడం గమనార్హం. ఈ మూడు ముఖ్య సమావేశాల్లో చర్చల అనంతరం తీసుకున్న నిర్ణయం ప్రకారం కేంద్ర కమిటీ కార్యదర్శి నియామకం జరుగుతుంది. పద్ధతి ప్రకారం ఆయా సమావేశాలు నిర్వహించుకునే సానుకూల వాతావరణంగాని, పరిస్థితులుగాని లేనప్పుడు నేరుగా పొలిట్ బ్యూరో సభ్యుల మధ్య జరిగిన సమావేశంలోనూ కేంద్ర కమిటీ కార్యదర్శి నియామకంపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఇదీ సాధ్యకాని పరిస్థితుల్లో ‘కార్యదర్శివర్గ’ కమిటీ సూచనల మేరకు కూడా నిర్ణయం తీసుకోవచ్చు.

కానీ, ఛత్తీస్ గఢ్ అడవులను భద్రతా బలగాలు జల్లెడ పడుతున్న తీవ్ర నిర్బంధం మధ్య, అడుగు తీసి అడుగు వేయలేని పరిస్థితుల్లో పార్టీకి చెందిన దాదాపు పది మంది పొలిట్ బ్యూరో సభ్యులైనా సమావేశమై ఈ నిర్ణయం తీసుకుని ఉంటారా? అనే ప్రశ్న తలెత్తుతోంది. అయితే నంబాల కేశవరావు ఎన్కౌంటర్ లో చనిపోయిన మూడున్నర నెలల తర్వాత నాయకత్వ భర్తీ పార్టీకి అనివార్యమైందనే అభిప్రాయాలు ఈ సందర్భంగా వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా వరుస ఎన్కౌంటర్లు, లొంగుబాట్ల నేపథ్యంలో మిగిలి ఉన్న కేడర్ లో ఆత్మస్థయిర్యాన్ని నింపడానికి కేంద్ర కమిటీ కార్యదర్శి నియామకం అనివార్యమైందంటున్నారు.

(ఫైల్ ఫొటో)

ఇదే అంశంపై మావోయిస్టు పార్టీ మాజీ కీలక నేత జంపన్న ‘సమీక్ష’ న్యూస్ తో మాట్లాడుతూ, నిర్బంధం ఎంత తీవ్రంగా ఉన్నప్పటికీ నియామకం జరిగే ఉంటుందని అభిప్రాయపడ్డారు. సీపీఐ (ఎంఎల్) మాస్ లైన్ రాష్ట్ర కార్యదర్శి పోటు రంగారావు మాట్లాడుతూ, తిరుపతి అలియాస్ దేవ్ జీ నియామకం జరిగే ఉంటుందని తాము భావిస్తున్నట్లు చెప్పారు. పోలీసు నిర్బంధం ఎంత తీవ్రంగా ఉన్నప్పటికీ, అందుబాటులో ఉన్న పొలిట్ బ్యూరో సభ్యులు ఎక్కడో ఓచోట సమావేశమై ఉంటారని, చర్చించిన తర్వాతే దేవ్ జీ నియామకంపై నిర్ణయం తీసుకుని ఉంటారని చెప్పారు. అందుబాటులో లేని పొలిట్ బ్యూరో సభ్యులు ఉత్తరాల ద్వారా తమ అభిప్రాయాన్ని వెల్లడించి ఉంటారని చెప్పారు. నాయకత్వ భర్తీ అనివార్యతను సైతం పోటు రంగారావు ఈ సందర్భంగా ప్రస్తావించారు.

ఇదిలా ఉండగా మావోయిస్టు పార్టీలో కేంద్ర కమిటీ కార్యదర్శిగా నియమితుడైన తిరుపతి అలియాస్ దేవ్ జీ దళిత సమాజిక వర్గానికి చెందిన రెండో నాయకుడు కావడం గమనార్హం. కొండపల్లి సీతారామయ్య పార్టీకి తొలి కార్యదర్శి కాగా, ఆయన తర్వాత దళిత సామాజిక వర్గానికి చెందిన కేజీ సత్యమూర్తి ఈ పదవిలో ఉన్నారు. కేంద్ర కమిటీ కార్యదర్శి పదవిలోనే కేజీ సత్యమూర్తి పార్టీ నుంచి నిష్ట్రమించాల్సిన పరిస్థితులు అప్పట్లో ఏర్పడ్డాయి. అనంతరం కొండపల్లి సీతారామయ్య మరోసారి కేంద్ర కమిటీ కార్యదర్శి పదవిని చేపట్టారు. ఆయన తర్వాత ముప్పాళ్ల లక్ష్మణ్ రావు అలియాస్ గణపతి, ఆతర్వాత నంబాల కేశవరావు ఈ నాయకత్వ బాధ్యతలను నిర్వహించారు. ప్రస్తుతం దేవ్ జీ నియామకంతో సత్యమూర్తి తర్వాత పార్టీ మరోసారి దళిత సామాజికవర్గానికి ప్రాధాన్యత ఇచ్చిందనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. మొత్తంగా మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ కార్యదర్శిగా తిరుపతి నియామకంపై పార్టీపరంగా ఎటువంటి అధికారిక ప్రకటన వెలువడకపోవడం గమనించాల్సిన అంశం.

Popular Articles