ఆవు చేలో మేస్తే దూడ గట్టున మేస్తుందా? ప్రభుత్వ పెద్దలే అలా ఉంటే ఇంక అధికారులు ఎలా ఉంటారు? ఆఖరుకు చట్టసభలో దేవుళ్లను కూడా పంచేశారు! విడ్డూరం, విచిత్రం! “మీకు వెంకటేశ్వరస్వామి ఉంటే మాకు లక్ష్మీ నరసింహస్వామి లేడా? మీకు టీటీడీ ఉంటే మాకు వైటీడీ లేదా? భద్రాచలంలో రాముడు లేడా? రామప్పలో శివుడు లేడా?”… ఇవీ తెలంగాణ ముఖ్యమంత్రి, రైజింగ్ స్టార్ రేవంత్ రెడ్డి ఇటీవల రవీంద్ర భారతిలో నిర్వహించిన ‘కొలువుల పండుగ’ కార్యక్రమంలో మాట్లాడిన మాటలు!
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జగన్ రెడ్డి హయాంలో టీటీడీలో తెలంగాణ ప్రజా ప్రతినిధుల సిఫారసు ఉత్తరాలు చెల్లుబాటు కాకుండా చేశారు! గత ఐదేళ్ళు అదే రూల్ నడిచింది! కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయకత్వంలో వచ్చాక ఆయన అన్నీ పరిశీలించి ఈనెల 24వ తేదీ నుంచి తెలంగాణ ప్రజా ప్రతినిధులు, ఉన్నతాధికారుల ఉత్తరాలు తిరుమలలో చెల్లుబాటు అవుతాయని ప్రకటించారు! ఆ సమాచారం తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి చేరిందో లేదో కానీ, ఆయన రవీంద్ర భారతి కార్యక్రమంలో తీవ్రంగా మాట్లాడారు! “వాళ్ళను అడుక్కోవడం ఏమిటి? మనకు ఇక్కడ ఇంతమంది దేవుళ్ళు ఉండగా” అన్నారు!
ఇరుగు పొరుగు రాష్ట్రాలు! విడిపోయాయి! రెండు తెలుగు భాషా రాష్ట్రాలు! మనం ఉత్తరాది హిందీ భాషా రాష్ట్రాలను చూసి ఐక్యత నేర్చుకోవాల్సిన అవసరం కనిపిస్తోంది! వాళ్ళు వారి పొరుగు రాష్ట్రాలపై ఇలా విరుచుకు పడరు! తెలుగు వారి రెండు రాష్ట్రాలు కావడిలా కలసి ఉండాలి! సమస్యలను సానుకూలంగా పరిష్కరించుకోవాలి! ఇలా ఒకరికని ఒకరు రెచ్చగొట్టుకుంటూ ఉంటే పరిణామాలు ఎటు దారి తీస్తాయి? ముఖ్యమంత్రి ఇంకో రాష్ట్ర ముఖ్యమంత్రికి ఉత్తరం రాసి సమస్యను పరిష్కరించుకోవడంలో చిన్నతనం ఏమీ ఉండదు! దాన్ని అడుక్కోవడం అని ఎవరూ అనుకోరు! గత ఐదేళ్ళు తిరుమల విషయంలో కేసీఆర్ పట్టించుకోలేదు! ఆయనకు జగన్ తో మిత్రుత్వం వున్నా సరే! ఇప్పుడు చంద్రబాబు ముఖ్యమంత్రి! ఆయనతో రేవంత్ రెడ్డికి సఖ్యతే వుంది! ఏదయినా సాధించుకోవచ్చు! తొందరపడి ముందే మాటలు ఎందుకు?
సందర్భం కాదు కానీ, ఒక్క విషయం ఇక్కడ ప్రస్తావించుకుందాం! మొన్నా మధ్య మహా నాట్య గురు పద్మశ్రీ డా. నటరాజ రామకృష్ణ 102వ జయంతి వేడుకలు తెలంగాణ ప్రభుత్వ సంగీత నాటక అకాడమి ఆధ్వర్యంలోనే జరిగాయి! కానీ, గత 11 ఏళ్లుగా ఆయన తీర్చిదిద్దిన ఆంధ్ర నాట్యాన్ని మాత్రం పూర్తిగా గత ప్రభుత్వం విస్మరించింది! దీనికి కారణం ఆ నాట్యం పేరులో ఆంధ్ర ఉండటమే! కనీసం ఒక్కటంటే ఒక్కటి, ఒక్క ఆంధ్ర నాట్య కళాకారునికి అవకాశం ఇవ్వలేదు! ప్రముఖ నాట్యగురు ఆచార్య డా. అలేఖ్య పుంజాల సంగీత నాటక అకాడమీ అధ్యక్షురాలు అయ్యాక ఇటీవల నిర్వహించిన నృత్యోత్సవాల్లో ఆమె అవకాశం కల్పించారు! 11 ఏళ్లుగా ఆంధ్ర నాట్యం నేర్చుకున్న కళాకారులను ప్రభుత్వం పూర్తిగా మరిచిపోయింది! నటరాజ రామకృష్ణ పునః సృష్టించిన పేరిణి నాట్యాన్ని మాత్రమే ప్రోత్సహించారు! ఆంధ్ర నాట్యం అయనదే, పేరిణీ అయనదే!
దేవదాసి నాట్యంలోంచి ఆయన పరిశోధనలు చేసి ఆంధ్ర నాట్యంగా మలిచారు! ఆంధ్ర ఆంటే తెలుగు! తెలుగు వారి నాట్యం కాబట్టి ఆంధ్ర నాట్యం అని ఆయన నామకరణం చేశారు! తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత అదే పాపం అయిపోయింది! ఇక్కడ తెలంగాణలో ఉత్తరాది రాష్ట్రాల నుంచి వచ్చిన కథక్, ఒడిస్సీ, దక్షిణాది రాష్ట్రాలకు చెందిన భరత నాట్యం, మోహినీ ఆట్టం తదితర అన్నిటినీ ప్రోత్సహిస్తారు! ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన కూచిపూడి, ఆంధ్ర పేరున్న ఆంధ్ర నాట్యాన్ని మాత్రం వెలి వేస్తారు! అంతా విచిత్రం! అంతెందుకు.. నటరాజ రామకృష్ణ తన జీవితాన్ని నాట్యానికి ధారపోసి హైదరాబాద్ లోనే స్థిరపడి కూచిపూడి, భరత నాట్యం, కథక్, ఆంధ్ర నాట్యం, పేరిణి, లాస్య, చిందు ఇలా అన్ని నాట్య ప్రక్రియలను తెలంగాణలో విస్తృతం చేశారు! నిన్న ఆయన జయంతి వేడుక హైదరాబాద్ లోనే జరిగింది! ఆంధ్రప్రదేశ్ లో జరగలేదు! ఆయన సమాధి ఇక్కడే వుంది!
ఆధ్యాత్మిక సంపద, కళా సంపదకు హద్దులు ఉండవు! ఆకాశమే హద్దు! ప్రపంచమే హద్దు! రాజకీయ మేధావులారా మీకు కళాకారుల తరఫున నా వినతి! స్వాములను, కళలను విడగొట్టకండి! కళాకారులను భక్తులను రాజకీయ చదరంగం లోకి లాగకండి! తెలుగు కళలు వర్ధిల్లాలి!
– డా. మహ్మద్ రఫీ