Wednesday, March 4, 2026

Top 5 This Week

Related Posts

నేటి నుంచి మేడారంలో ‘తిరుగువారం’..జాతర

మేడారం: సరిగ్గా వారం క్రితం.. గత నెల 28వ తేదీన ప్రారంభమై, 31వ తేదీన ముగిసిన మేడారం జాతరకు వెళ్లలేకపోయామని చింతించే భక్తులు తెలుసుకోవలసిన ఆసక్తికర విషయమిది. మహాజాతరకు వెళ్లలేకపోయిన భక్తులకు ఇది మరో అవకాశంగా భావించవచ్చు. దీన్నే ‘తిరుగు జాతర’ లేదా ‘తిరుగువారం’ అని భక్తులు సంబోధిస్తుంటారు. మేడారం వనదేవతల దర్శనానికి ‘తిరుగు జాతర’ కూడా భక్తులకు ఆహ్వానం పలుకుతుంది. ఏమిటీ తిరుగుజాతర అనుకుంటున్నారా?

ఎప్పుడూ నిర్వహించే పద్ధతే. కాకపోతే చాలా మందికి ఈ ‘తిరుగు జాతర’ సంప్రదాయం గురించి తెలియకపోవడమే విశేషం. గత నెల 28, 29, 30, 31 తేదీల్లో మేడారం మహా జాతరను సందర్శించిన భాగ్యమే ‘తిరుగు జాతర’లోనూ భక్తులకు దక్కుతుందన్నది ఆదివాసీ తెగకు చెందిన సమ్మక్క వంశస్థుల నిర్వచనం. ఈ బుధ, గురు, శుక్ర, శనివారాల్లో.. అంటే ఈనెల 4, 5, 6, 7 తేదీల్లో మేడారంలో తిరుగు జాతర నిర్వహిస్తారు. వారం క్రితంనాటి మహా జాతరకు రాలేకపోయిన భక్తులు ఈ సందర్భంగానూ వనదేవతలను దర్శనం చేసుకోవచ్చు.

‘తిరుగు జాతర’ ప్రాశస్త్యంపై వనదేవతల వంశస్తులు చెప్పేదేమిటంటే.. ఈ సమయంలోనూ భక్తులను సమ్మక్క-సారలమ్మలు కరుణిస్తారు. మహా జాతరలో దక్కిన దేవతల ఆశీర్వాదమే ‘తిరుగు జాతర’లోనూ భక్తులకు లభిస్తుంది. ఓ రకంగా చెప్పాలంటే ‘పెళ్లికి రాలేకపోయిన బంధువులు రిసెప్షన్ కు హాజరైనట్లు’గా భావించవచ్చని ‘తిరుగు జాతర’పై వనదేవతల వంశీయుల నిర్వచనం. అందువల్ల వారం క్రితం ముగిసిన సమ్మక్క-సారలమ్మలను మహాజాతరలో దర్శనం చేసుకోలేకపోయామని భక్తులు బాధ పడాల్సిన అవసరమే లేదు. నేటి నుంచి వరుసగా నాలుగు రోజులపాటు ‘తిరుగు జాతర’ జరుగుతుంది.

Popular Articles