సత్తుపల్లి: ఖమ్మం జిల్లా సత్తుపల్లి శివారులో బుధవారం ఉదయం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ముగ్గురు యువకులు దుర్మరణం చెందారు. ఇదే ఘటనలో మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. వీఎం బంజర వైపు నుంచి సత్తుపల్లి వైపు ప్రయాణిస్తున్న TG 04 A 4744 టాటా ఆల్ట్రోజ్ కారు కిష్టారం-అంబేడ్కర్ కాలనీ వద్ద డివైడర్ ను ఢీకొట్టడంతో ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. ఫలితంగా కారులో ప్రయాణిస్తున్న ఐదుగురిలో ముగ్గురు అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోయారు.

మృతులను సత్తుపల్లి కొంపల్లి కాలనీకి చెందిన విద్యార్డులు సిద్దేసి జయ్ (18) మార్సకట్ల శశి (11) చంద్రుగొండ మండలం మహబూబ్ నగర్ చెందిన సాజిద్ (25)లుగా గుర్తించారు. ఇదే ప్రమాదంలో మరో ఇద్దరు యువకులు తలారి అజయ్, ఇమ్రాన్ లకు తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదంపై సమాచారం అందుకున్న సత్తుపల్లి సీఐ శ్రీహరి, పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని క్షతగాత్రులను సత్తుపల్లి హాస్పిటల్ కు తరలించి బాధిత కుటుంబాలకు సమాచారం అందించారు. కాగా ప్రమాదానికి సంబంధించి విచారణ జరుపుతున్నట్టు కల్లూరు ఏసీపీ వసుంధర యాదవ్ తెలిపారు.

పొగమంచులో ప్రయాణం ప్రమాదకరం: పోలీస్ కమిషనర్
కాగా దట్టమైన పొగమంచు సమయాల్లో వాహన ప్రయాణం ప్రమాదకరమని, అత్యవసరమైతే తప్ప ప్రయాణాలు నివారించాలని ఖమ్మం పోలీస్ కమిషనర్ సునీల్ దత్ ప్రయాణికులకు విజ్ఞప్తి చేశారు. ఈరోజు తెల్లవారుజామున సత్తుపల్లిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు యువకులు మృతి చెందారని, పొగమంచు కారణంగా జరుగుతున్న రోడ్డు ప్రమాదాల దృష్టిలో పెట్టుకొని స్వల్ప నిర్లక్ష్యం పెద్ద ప్రమాదాలకు దారితీసే అవకాశం ఉందని అన్నారు. పొగమంచు కారణంగా రోడ్లపై ఎదురుగా వచ్చే వాహనదారులను, పాదచారులను గమనించే సామర్థ్యం గణనీయంగా తగ్గి ప్రమాదాలు జరిగే అవకాశం ఉందన్నారు. ముఖ్యంగా వాహనాలను వేగంగా నడపకూడదని, ముందుగా వాహన పరిస్థితిని తనిఖీ చేసుకోవాలన్నారు. డ్రైవింగ్ సమయంలో సెల్ ఫోన్ మాట్లాడటం, అనుకోకుండా ఓవర్‌టేక్ చేయడం, ట్రాఫిక్ నియమాల ఉల్లంఘనలు వంటి ప్రమాదకర చర్యలు పూర్తిగా నివారించాలని సూచించారు.

