Sunday, August 31, 2025

Top 5 This Week

Related Posts

ఒకే వేదికపై ఆ ముగ్గురు

ఫొటో చూశారుగా..! డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావులు చేతులు కలిపి సంతోష వదనాలతో ఫొటోకు ఫోజిచ్చిన చిత్రమిది. ఉమ్మడి ఖమ్మం జిల్లా కాంగ్రెస్ నాయకులే కాదు, పార్టీకి చెందిన సామాన్య కార్యకర్తలకు సైతం నయనానందకర దృశ్యమిది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక, మంత్రివర్గంలో ఈ ముగ్గురు కీలక నాయకులు చోటు సంపాదించుకున్న తర్వాత అందరూ కలిసి ఒకే వేదికను పంచుకున్న సందర్భాలను వేళ్లమీద లెక్కించవచ్చు. ఉమ్మడి ఖమ్మం జిల్లా పర్యటనల్లోనూ ఈ ముగ్గురు నాయకులు కలిసి కార్యక్రమాలకు హాజరైన సంఘటనలు కూడా తక్కువే.

గడచిన ఏడాదిన్నర కాలంలో సీతారామ ప్రాజెక్టు, వైరా రిజర్వాయర్ తదితర అభివృద్ధి కార్యక్రమాల్లో మాత్రమే ఈ ముగ్గురూ కలిసి పాల్గొన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంలో భట్టి, పొంగులేటి, తుమ్మల ఎవరికి వారే తమదైన శైలిలో కీలక పాత్రలను పోషించారనేది బహిరంగమే. పార్టీపరంగానేగాక ఇతరత్రా అనేక అంశాల్లో ఈ ముగ్గురు ముఖ్య నేతల ఐక్యతపై కాంగ్రెస్ వర్గాల్లోనే భిన్నాభిప్రాయాలు ఉన్నాయనేది వేరే విషయం.

కానీ మంగళవారం ఎర్రుపాలెం మండలం ములుగుమాడు గ్రామంలో భూ భారతి సర్వే, రాష్ట్ర వ్యాప్తంగా రెవెన్యూ సదస్సుల కార్యక్రమం ప్రారంభోత్సవ కార్యక్రమంలో ముగ్గురు ముఖ్య నాయకులు కలిసి పాల్గొనడం కాంగ్రెస్ కేడర్ ను సంతోషపరిచిందనే చెప్పాలి. ఇలా ముగ్గురూ కలిసి తరచూ అభివృద్ధి కార్యక్రమాలనేకాదు, పార్టీ వేదికలను కూడా పంచుకుంటే ఐక్యతను ప్రతిబింబిస్తుందనే వ్యాఖ్యలు కాంగ్రెస్ శ్రేణుల్లో ఈ సందర్భంగా వినిపిస్తుండడం విశేషం.

Popular Articles