హైదరాబాద్: మావోయిస్ట్ పార్టీకి చెందిన ముగ్గురు కీలక నక్సల్ నేతలు తెలంగాణా డీజీపీ శివధర్ రెడ్డి ముందు లొంగిపోయారు. జనజీవన స్రవంతిలో కలిసిన నక్సల్ నేతల్లో సౌత్ బస్తర్ డివిజనల్ కమిటీ ఇంఛార్జి కుంకటి వెంకటయ్య అలియాస్ వికాస్, దండకారణ్యం స్పెషల్ జోన్ కమిటీ సీఎన్ఎం ఇంఛార్జి మొగిలిచెర్ల వెంకట్రాజు అలియాస్ చందు, జనతన సర్కార్ సౌత్ బస్తర్ డివిజనల్ కమిటీ ఇంఛార్జి తోడెం గంగ అలియాస్ సోని ఉన్నారు.

సిద్ధిపేట జిల్లాకు చెందిన కుంకటి వెంకటయ్య 1990లో అప్పటి పీపుల్స్ వార్ గ్రూపునకు అనుబంధ సంస్థ రైతుకూలీ సంఘం సభలకు హాజరై అదే సంవత్సరం అడవిబాట పట్టారు. పీపుల్స్ వార్ గ్రూప్ బాలన్న దళంలో చేరిన వెంకటయ్య పార్టీలో అంచెలంచెలుగా ఎదిగి మూడున్నర దశాబ్ధాలపాటు వివిధ హోదాల్లో పనిచేశారు. ఈ సందర్భంగా డీజీపీ శివధర్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణాకు చెందిన 72 మంది నక్సలైట్లు ఇంకా అజ్ఞాతంలో ఉన్నారని, అందులో ఎనిమిది మంది కేంద్ర కమిటీ సభ్యులుగా ఉన్నారని, వీరంతా లొంగిపోవాలని పిలుపునిచ్చారు.

అదేవిధంగా హన్మకొండ మండలం ధర్మసాగర్ మండలం తాటికాయల గ్రామానికి చెందిన మొగిలిచెర్ల వెంకటరాజు అలియాస్ చందు పదకొండేళ్ల చిరుప్రాయంలోనే విప్లవ పాటలకు ఆకర్షితుడయ్యాడు. అనంతరం అప్పటి పీపుల్స్ వార్ పార్టీలో చేరి నర్సంపేట సాయుధ దళంలో 1993లో నియమితులయ్యారు. ఆ తర్వాత రాష్ట్రస్థాయిలో వివిద హోదాల్లో చందు పనిచేశారు.

అదేవిధంగా లొంగిపోయిన మరో నక్సల్ నేత తోడెం గంగ అలిాయాస్ సోని ఛత్తీస్ గఢ్ లోని సుక్మా జిల్లా కిష్టారం పోలీస్ స్టేషన్ పరిధిలోని ధర్మపేటకు చెందినవారు. గంగత 2019 మే నెలలో మావోయిస్ట్ పార్టీలో చేరి రాష్ట్ర కమిటీ సభ్యుడు మొగిలిచెర్ల వెంకటరాజు అలియాష్ చందును వివాహం చేసుకుంది. కాగా మావోయిస్టు పార్టీలో విభేదాలు వాస్తవమేనని, అగ్ర నాయకుల మధ్య భేదాభిప్రాయాలు ఉన్నాయని వికాస్ ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఆయుధాలు వదిలి పెట్టాలనే చర్చ మల్లోజుల వేణుగోపాల్, జగన్ ల మధ్య కొనసాగుతూనే ఉందని, ఈ అంశం పార్టీలో ఎప్పటినుంచో ఉందన్నారు.