మెయిన్ స్ట్రీమ్ మీడియాలోని ప్రముఖ పత్రికల్లో పనిచేసిన నేపథ్యం గల నేను పెట్టాల్సిన హెడ్డింగ్ కాదిది. కంటెంట్ లోని దోపిడీ ‘కత’ను తెలుసుకున్నాక కలిగిన ఫీల్ నుంచి పుట్టిన హెడ్డింగ్ మాత్రమే. బరితెగించి బరిబాత వేషంలో నడిబజారులో రైతును దోపిడీ చేసిన ముగ్గురు విలేకరుల దురాగత పర్వమిది. విషయంలోకి వెడితే..
ఆదిలాబాద్ జిల్లా నేరడిగొండ మండలం సుర్జాపూర్ గ్రామానికి చెందిన టగరే కాసాన్ దాస్ సామాన్య రైతు. వ్యవసాయంపైనే ఆధారపడి జీవితాన్ని నెట్టుకొస్తున్నారు. తన కూతురు పెళ్లి నిశ్చయం కావడంతో డబ్బు అవసరమైంది. ఈ నేపథ్యంలోనే గత మే నెలలో దాస్ చేలో పండిన మక్కలను గ్రామ సమీపంలోని ప్రభుత్వ పాఠశాల ఆవరణలో ఆరబెట్టారు. మక్కలను విక్రయించి వచ్చిన డబ్బుతో కూతురు పెళ్లి చేయాలని రైతు దాస్ భావించారు. ప్రభుత్వ పాఠశాల ఆవరణలో మక్కలను ఆరబెట్టడాన్ని గమనించిన నేరడుగొండ స్థానిక విలేకరులైన షేక్ ఫసియుద్దీన్, గాజుల దేవేందర్, గాజుల శ్రీకాంత్ లు గమనించారు. సర్కారు వారి స్కూలు ఆవరణలో ఓ రైతు తన పంటను ఆరబెట్టుకోవడం వీళ్లకు చట్టవిరుద్ద చర్యగా కనిపించింది.

ఇంకేముంది..? రైతును బెదిరించారు. పాఠశాల ఆవరణలో మక్క పంటను ఆరబెట్టినందుకు పోలీసులకు ఫిర్యాదు చేస్తామని, నీపై కేసు పెట్టి బొక్కలో వేయిస్తామని రైతు టగరే కాసాన్ దాస్ ను బెదిరించారు. ఈ విషయం ఎవరికీ తెలియకుండా ఉండాలంటే రూ. 50 వేలు ఇవ్వాలని ఈ ముగ్గురు విలేకరులు రైతును డిమాండ్ చేశారు. పోలీసులు, కేసు అనేసరికి భయపడిన రైతు దాస్ అప్పో, సప్పోచేసి చివరికి రూ. 30 వేలు విలేకరులకు సమర్పించుకున్నారు. ఆ తర్వాత తేరుకున్న రైతు దాస్ పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు. దీంతో ముగ్గురు విలేకరులు షేక్ ఫసియుద్దీన్,గాజుల దేవేందర్, గాజుల శ్రీకాంత్ లను నేరడుగొండ పోలీసులు అరెస్ట్ చేసి జైలుకు పంపారు.
ఈ మొత్తం ఎపిసోడ్ లో గమనించాల్సిన విషయమేమిటంటే.. ‘బెదిరించి దోపిడీలకు పాల్పడే నయా ట్రెండ్ జర్నలిజపు విద్యను నేరడుగొండకు చెందిన ఈ ముగ్గురు విలేకరులు సరిగ్గా ఒంట బట్టించుకున్నట్లు లేదు. విలేకరితనమంటే పట్టణాల్లో ఎవరైనా భారీ భవంతులు నిర్మిస్తుంటే ఫొటోలు తీసి వార్తలు రాయాలి. రియల్ ఎస్టేట్ సంస్థలను మాత్రమే లక్ష్యంగా చేసుకుని సరికొత్త ట్రెండ్ పేరుతో ‘నయా జర్నలిజం’ చేయాలి. ప్రజా ప్రయోజన వార్త ఒక్కటంటే ఒక్కటి కూడా కనిపించకుండా అచ్చం ఇదే తరహా వార్తలతో వర్ధిల్లుతున్న తెలుగు మీడియాలోని ఓ ఈ-పేపర్ పోకడను చూసైనా ఈ ముగ్గురు విలేకరులు దోపిడీ విద్యను నేర్చుకోలేదు’ అనే సెటైర్లు సమాజ హితాన్ని కోరుకునే జర్నలిస్టు వర్గాల నుంచే కాదు, సామాన్య జనం నుంచీ వినిపిస్తున్నాయి.