Friday, October 17, 2025

Top 5 This Week

Related Posts

‘భ్రూణ’ హంతకునికి మళ్లీ ‘లైసెన్స్’!?

అసలు విషయంలోకి వెళ్లేముందు ఖమ్మం జిల్లా కలెక్టర్ అనుదీప్ ఇటీవల చేసిన కీలక సూచనలను, ఆదేశాలను ఓషారి పరిశీలిద్దాం. ఈనెల 7వ తేదీన నిర్వహించిన గర్భస్థ పూర్వ, గర్బస్థ లింగ నిర్దారణ చట్టం–1994 అమలుకు సంబంధించి జిల్లా అడ్వైజరీ కమిటి సమావేశంలో జిల్లా కలెక్టర్ అనుదీప్, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి చంద్రశేఖర రావు, ఖమ్మం పోలీస్ కమీషనర్ సునీల్ దత్ లు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా కలెక్టర్ అనుదీప్ మాట్లాడుతూ, గర్భధారణకు ముందు, గర్భధారణ సమయంలో రోగనిర్ధారణ పద్ధతుల నిషేధ చట్టాన్ని కట్టుదిట్టంగా అమలు చేయాలని సంబంధిత అధికారగణాన్ని ఆదేశించారు. ఖమ్మం జిల్లాలో జరిగే ప్రసవాల్లో వెయ్యి మంది మగ పిల్లలకు 946 మంది ఆడ పిల్లలు మాత్రమే జన్మిస్తున్నారని చెప్పారు. గర్బస్థ శిశువుగా ఉన్నప్పుడు స్త్రీ, పురుష లింగ నిర్ధారణ పరీక్షలు చేసినట్లయితే పరీక్షలు చేసినవారికి, చేయించుకున్నవారికి, అందుకు ప్రోత్సహించినవారికి చట్టప్రకారం జైలు శిక్ష, జరిమాన విధించబడుతుందని, అలాగే కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని కూడా హెచ్చరించారు.

ఈనెల 7వ తేదీన నిర్వహించిన సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్ అనుదీప్, పక్కన సీపీ సునీల్ దత్, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి చంద్రశేఖర రావు

అదేవిధంగా లింగ నిర్ధారణను అరికట్టడానికి ప్రతి నెల స్కానింగ్ సెంటర్లను తనిఖీ చేయాలని, జిల్లాలోని ఆసుపత్రులలో జరుగుతున్న అబార్షన్ కేసులను సైతం స్టడీ చేసి ఎక్కడైనా లింగ నిర్ధారణ కారణంగా అబార్షన్ జరిగిందా? అనే విషయాన్ని పరిశీలించాలన్నారు. ఇదే సమావేశంలో ఖమ్మం పోలీస్ కమిషనర్ సునీల్ దత్ మాట్లాడుతూ, పి.సి. పి.ఎన్.డి.టి. చట్టాన్ని కట్టుదిట్టంగా అమలు చేసేందుకు పోలీస్ శాఖ తరపున సంపూర్ణ సహకారం అందిస్తామన్నారు. ప్రతి కేసు నమోదు చేసే సమయంలో వీడియో రికార్డింగ్ సాక్ష్యాలతో పట్టుకోవాలన్నారు. గతంలో తప్పులు జరిగిన ఆసుపత్రులు మరో పేరుతో నడిపించే అవకాశం ఉందని, అటువంటి వాటిపై గట్టి నిఘా ఏర్పాటు చేయాలని కూడా సీపీ సునీల్ దత్ కీలక సూచన చేశారు.

ఇప్పుడు అసలు విషయంలోకి వస్తే.. అతని నోటి వెంట అభ్యుదయ మాటలు.. ప్రగతి శీల బాట నుంచి వచ్చాననే వినసొంపైన ‘విప్లవ’ సూక్తులు.. విప్లవోద్యమమే ఊపిరిగా బతుకుతున్నట్లు వేదికలపై ఉపోద్ఘాతాలు.. పరోక్షంగా తాను నక్సల్ ఉద్యమ నేపథ్యం నుంచి వచ్చాననే అర్థం స్ఫురించేలా పరిచయం. వృత్తి సంగతి ఎలా ఉన్నా, ప్రవృత్తి మాత్రం పక్కా ఇల్లీగల్ దందా.. దందా అంటే ఏదో సాదాసీదా యవ్వారం కాదు సుమీ.. భ్రూణ హత్యల దందాకు పాల్పడడం. గర్భంలో ఉన్న శిశువుల అసువులు తీసేయడమన్నమాట. ఓ రకంగా చెప్పాలంటే తల్లిగర్భంలో తొమ్మిది నెలలు నిండాకుండా, ఈ లోకాన్ని చూడకుండడా శిశు దశలోనే హత్య చేసి, కరెన్సీ కట్టలను వెనకేసుకోవడమన్నమాట. ఇటువంటి భ్రూణ హత్యల కేసుల నుంచి రక్షణ పొందడానికి జర్నలిస్టు ముసుగేసుకున్న పూర్వకాలపు విప్లవవాదిగా చెప్పుకునే వ్యక్తిత్వమన్నమాట.

అనధికారికంగా నిర్వహిస్తున్న పోర్టబుల్ అల్ట్రాసౌండ్ స్కానింగ్ యంత్రాన్ని ఈనెల 8వ తేదీనవైద్య, ఆరోగ్యశాఖ అధికారులు పట్టుకున్న చిత్రం

వాస్తవానికి ఇతనేమీ డాక్టర్ కాదు. కాంపౌండర్ కూడా కాదు. కనీసం ఇంజక్షన్ వేసే నైపుణ్యం కూడా లేదు. వైద్యరంగంతో ఏమాత్రం సంబంధం కూడా లేదు. కానీ ఖమ్మం కేంద్రంగా గతంలో ఆసుపత్రిని ఏర్పాటు చేశాడు. ఇందులో వైద్య చికిత్స సంగతి ఎలా ఉన్నప్పటికీ, గర్భస్థ శిశువుల, ముఖ్యంగా ఆడపిల్లగా స్కానింగ్ లో తేలిందే తడవుగా గర్భంలోనేనిర్దాక్షిణ్యంగా చిదిమేసే చీకటి దందాలో ఇతను ఆరితేరినట్లు కొంతకాలం క్రితం వైద్య, ఆరోగ్యశాఖ అధికారుల దాడుల్లోనే తేలింది. అతని నిర్వహణలోగల ఆసుపత్రిలో భ్రూణహత్య జరుగుతుండగానే రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుని మరీ హాస్పిటల్ ను సీజ్ చేశారు అధికారులు. ఆ తర్వాత కొద్దిరోజులకే మరోచోట, మరో ఆసుపత్రిపై భాగాన ఓ గదిని అద్దుకు తీసుకుని ఇదే దందాకు పాల్పడుతుంటే మళ్లీ అక్కడా సీజ్ చేశారు. అత్యంత పాశవికంగా ఇతని నాయకత్వంలో నడిచిన ఆయా ఆసుపత్రుల్లో దాదాపు 400 పైచిలుకు అబార్షన్లు జరిగినట్లు వైద్య, ఆరోగ్య శాఖ గుర్తించినట్లు తెలిసింది. కానీ ఇంతటి ఘాతుకాలకు పాల్పడిన ఈ వ్యక్తిపై ఇప్పటి వరకు ఎటువంటి కఠిన చర్యలు తీసుకున్న దాఖలాలు మాత్రం లేవు.

ఎందుకంటే అతను వైట్ కాలర్ వృత్తిలో ఉన్నాడు మరి. ‘జర్నలిస్ట్’ ముసుగేసుకున్నాడు. పాత్రికేయపు పరపతిని ఉపయోగించి కఠిన చర్యల నుంచి అప్పట్లో తప్పించుకున్నాడనే ప్రచారం ఉండనే ఉంది. కానీ ఇప్పుడేం జరుగుతోంది? తల్లిగర్భంలోని పిండాన్ని చిదిమేసి రక్తపు మరకల కరెన్సీకి బాగా అలావాటుపడిన ప్రాణం కదా? మళ్లీ అదే దందాకోసం శతవిధ ప్రయత్నాలు. మూతపడిన ఆసుపత్రిని తిరిగి తెరిపించుకునే ‘పరపతి’ ప్రయత్నాలు గతంలోనే బెడిసికొట్టాయి. అందుకే మరోసారి దొడ్డిదారి ప్రయత్నం. అదెలాగంటే?

పట్టుబడ్డ అక్రమ స్కానర్

ఈనెల 7వ తేదీన జరిగిన కీలక సమావేశంలో పోలీస్ కమిషనర్ ఏం చెప్పారు? ‘గతంలో తప్పులు జరిగిన ఆసుపత్రులు మరో పేరుతో నడిపించే అవకాశం ఉంది, అటువంటి వాటిపై గట్టి నిఘా ఏర్పాటు చేయాలి’ ఇదీ సీపీ సునీల్ దత్ చేసిన కీలక సూచన. అచ్చంగా ఇప్పుడు ఇలాగే జరుగుతోంది. కట్టలు కట్టలుగా వచ్చిపడే కరెన్సీ కోసం జర్నలిస్టు ముసుగేసుకున్న సదరు భ్రూణ హత్యల ఆసుపత్రి నిర్వాహకుడు మళ్లీ తన ప్రయత్నాన్ని ప్రారంభించినట్లు సమాచారం. ఇందులో భాగంగానే మరో ఇద్దరు సారూప్య స్వభావం గల సహచరులను కూడా భాగస్వాములుగా చేసుకుని, స్వల్ప తేడాతో సరికొత్త పేరుతో ‘భ్రూణ’హత్యల కోసం ఆసుపత్రిని తెరించేందుకు సమాయాత్తమయ్యాడట. ఇందుకు అవసరమైన దరఖాస్తు ప్రక్రియను కూడా పూర్తి చేసినట్లు తెలుస్తోంది.

అయితే ఈసారి ఈ ‘భ్రూణ హత్యల’ ఆసుపత్రి నిర్వాహకుని ప్రయత్నానికి అధికార అండదండలు కూడా తోడైనట్లు ప్రచారం జరుగుతోంది. జిల్లాలోని ఓ కీలక రాజకీయ నాయకుడి ముఖ్య అనుచరుడు ‘భ్రూణ’ హత్యల ఆసుపత్రి నిర్వాహకునికి సరికొత్తగా అనుమతి ఇవ్వాలని వైద్య. ఆరోగ్యశాఖకు సిఫారసు చేశాడట. అయితే ఈ సిఫారసుకు వైద్య, ఆరోగ్యశాఖ అనుమతిస్తుందా? లేదా? అనేది ప్రశ్నార్థకంగా మారింది. అధికార ఒత్తిడికి తలొగ్గి ఈ ప్రయత్నానికి ఆమోద ముద్ర వేస్తే ‘భ్రూణ’ హంతకునికి సరికొత్తగా ‘లైసెన్స్’ ఇచ్చినట్లుగానే ఖమ్మం వైద్య వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. కాగా ఖమ్మం నగరంలోని ఓ ప్రముఖ వైద్యుడు ఈ ‘భ్రూణ’ హంతకుని గురించి ప్రస్తావిస్తూ, తాను వైద్య, ఆరోగ్యశాఖ అధికారినైతే అప్పట్లోనే అతనితో జైలు ఊచలు లెక్కించేవాడినని వ్యాఖ్యానించడం గమనార్హం.

Popular Articles