గల్పిక = చెంచాగాళ్ళు
ఆరోజు…
ఒక చెంచా చచ్చిపోయాడు…
అన్నాళ్ళు చెంచాను పెంచి పోషించిన నాయకుడు కన్నీళ్ల పర్యంతం కాలేదు కానీ, సానుభూతిగా, తన తరుపున ఒక పూల దండ పంపించాడు.
చెంచా చావు గురించి నలుగురు నాలుగు రకాలుగా మాట్లాడుకున్నారు.
‘కుక్క సావు జచ్చాడు’
‘ఫలితం అనుభవించాడు’
‘అయ్యో పాపం… కొరివితో తల గోక్కున్నాడు’
‘బతికుంటే బలుసాకు తినొచ్చు. బలుపు మాటలు మాట్లాడి ఎటు గాకుండ పోయిండు’
‘అన్యాయంగా పాణం బోయింది’
ఇట్లా ఎవరు ఎన్ని మాటలు మాట్లాడుకున్నా, పోయిన చెంచా మాత్రం తిరిగి రాలేదు.
చెంచా కథ ముగిసింది.
చెంచా కథ ఏమిటీ?
ఎందుకు చచ్చిపోయాడు?
ఎట్లా చచ్చిపోయాడు?
చంపారా? చంప బడ్డాడా?
అస్సలు ఏమైంది?

అక్కడ ~
రాజకీయం భగ్గు మంటున్నది..
సోషల్ మీడియాలో రాజకీయం చేయకపోతే మనశ్శాంతి లేని పరిస్థితి..
ఇంట్లో తల్లి పెళ్ళాం పిల్లలు ఎటుబోయినా పర్వాలేదు గాని, ఊరి రాజకీయాల నుండి దేశ రాజకీయాల వరకు రభస చేయకపోతే
క్షణం గడవని పరిస్థితి….
అక్కడ పెద్దలు ఇద్దరు హేమాహేమీలే.
అయినా రాజకీయమన్నాక…ఎలక్షన్ అన్నాక
..ఎవరో ఒకరు గెలవక తప్పదు ఎవరో ఒకరు ఓడిపోక తప్పదు. అక్కడ కూడా అదే జరిగింది. మునుపు గెలిచిన పెద్దాయన ఈసారి ఓడిపోయాడు. మునుపు ఓడిపోయిన పెద్దమనిషి ఈసారి గెలిచాడు.
పగ్గాలు మళ్ళీ చేతికి రాగానే గెలిచిన
పెద్దమనిషికి అదనపు బలం పుంజుకుంది. ఇక పెద్దాయన ఓడిపోయాడే గాని, కిరీటం జారిందే గాని, బలం తగ్గలేదు. అదే హోరు.. అదే పోరు..అదే జోరు..!
పెద్ద మనిషికి ఇది నచ్చలా. వీలైనంతగా అధికారాన్ని అడ్డం పెట్టుకొని పెద్దాయన్ని డ్యామేజ్ చేయాలనుకున్నాడు . అనుకున్నది ఆలస్యం చెంచాకు తాయిలాలు ఇచ్చాడు. ఇంకేం తాయిలాలు పుచ్చుకున్న చెంచా రెచ్చిపోయాడు.
పెద్దాయన గురించి ఉన్నవి లేనివి కల్పించాడు., వ్యక్తిగత జీవితం నుండి రాజకీయ జీవితం వరకు అవాకులతో చవాకులతో చించి చించి, ఉతికి ఆరేశాడు. ఇది ఒక్క రోజుతో అయిపోలేదు. ఐదు సంవత్సరాల వరకు ప్రహసనంలా కొనసాగింది. అధికారం కోల్పోయిన పెద్దాయనకు, పెద్దాయన మనుషులకు చెంచా ఒక సమస్యలా తయారయ్యాడు. అసహనం పెరిగిపోయింది. అయినా అధికారం తమది కాదు కాబట్టి ఓపిక వహించక తప్పలేదు.
కాలం గిర్రున తిరిగింది. మల్ల ఎలక్షన్లు వచ్చాయి. పెద్దమనిషి ఓడిపోయాడు…పెద్దాయన గెలిచాడు. పెద్దమనిషి ఓడిపోయాడు కానీ ఆయన బలం కూడా యధావిధిగా తగ్గలేదు. కాబట్టే మళ్ళా గెలుపు కోసం పావులు కదిపే పనిలో ఉన్నాడు. కానీ పెద్దాయన్ని నానా మాటలు మాట్లాడిన చెంచా పరిస్థితి గాలిలో దీపం అయ్యింది.
ఏం చేయాలో …..ఎట్లా బతకాలో… చెంచాకు అర్థం కావడం లేదు. ఓడిపోవడంతో పెద్దమనిషి తనని
పక్కకు పెట్టేసాడు.. నెల నెలా జీతంలా ఇచ్చే డబ్బులు కూడా ఆపేశాడు. మొత్తానికి చెంచా పరిస్థితి పీల్చి పడేసిన సిగరెట్ పీక అయ్యింది.
చెంచా ఒక నిర్ణయానికి వచ్చాడు. తాను మాట్లాడిన మాటలన్నీ అబద్దాలని… బలవంతంగా మాట్లాడించారని…. ఒక మాట చెప్పి, అన్నాళ్ళు కట్టు కథలతో సంపాదించిన డబ్బుతో ఎప్పట్లా స్వేచ్ఛగా బతకాలనుకున్నాడు.లేదంటే ఇవతలికి జంప్ అయ్యి పబ్బం గడుపుకోవాలి అనుకున్నాడు.
పెంచి పోషించిన పెద్దమనిషికి చెంచా ఆలోచన గురించి అస్సలు తెలియలేదు.. కానీ తన ప్రత్యర్థిని ఇరుకున పెట్టే ఉద్దేశ్యంతో వ్యూహం పన్నాడు . పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం వేసేసాడు. ఈ ప్రకారం చెంచా యూటర్న్ తీసుకోకముందే పకడ్బందీ పన్నాగంతో తన చేతులకు మట్టి అంటుకోకుండా ఈ భూమి నుండి తప్పించేసాడు.
అట్లా చెంచా బతుక్కి నూకలు చెల్లాయి . అనుకున్నట్టుగానే నేరం పెద్దాయనపై మోపబడింది. ఒకప్పుడు తనను ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడాడు కాబట్టి, కక్ష నింపుకున్న పెద్దాయన తను గెలవగానే చెంచాను తప్పించాడని జనాలు మాట్లాడుకున్నారు. పేపర్లు అదే మాట్లాడాయి. కేసులయ్యాయి.
పెద్దాయనకు నిజానిజాలు అంచనా వేసుకున్నాడు.. పెద్దాయనకే కాదు, చెంచా కుటుంబ సభ్యులకు కూడా నిజం తెలుసు. అంతేకాదు, నానా గడ్డితిని… ఇతరుల పరువు మర్యాదలతో ఆడుకుందాం అనుకుంటూ అవకాశం ఉన్నచోట కాచుకుని కూచున్న మిగతా చెంచాలకు కూడా తెలుసు.
అయినా….
చెంచాలు ఆగిపోలేదు…!
రేపటి సంగతి దేవుడు ఎరుగు అనుకుంటూ…
గెలిచిన పార్టీ కార్యాలయం ముందు క్యూలు కట్టి,
కంపు నోర్లను సిద్ధం చేసుకోసాగారు..
రాజకీయాల్లో ఇప్పుడు వీళ్లు ఒక ట్రెండు..
చిల్లర ట్రెండు..
‘సెలబ్రిటీ’ అనే చిరుగుల బొంత ఒకటి కప్పుకుని హఠాత్తుగా పుట్టుకు వస్తారు.
ఒకరిని చూసి ఒకరు.. ఒకరి తర్వాత ఒకరు..
సిగ్గు లజ్జ గాలికి వొదిలేసి పుట్టుకొస్తారు.
వాడిని ఆ వర్గమే చంపుతుందో… ఈ వర్గమే చంపుతుందో.. సొంత వర్గమే చంపుతుందో.. లేదా మధ్యలో వాడే భయంతో గుండె ఆగి చస్తాడో.. తెలువదు.
ఇది చెంచాల కథ..
పులి గుహల్లో తలలు పెట్టి విర్రవీగే చిట్టెలుకల్లాంటి చెంచాల కథ..!!
రాజకీయాల్లో కొనసాగుతున్న చెంచాలకు ఈ గల్పిక అంకితం..
✍ డా. తంగెళ్ల శ్రీదేవిరెడ్డి