Wednesday, March 4, 2026

Top 5 This Week

Related Posts

పీవీకే అతను పొలిటికల్ గురువు.. కాంగ్రెస్ ఎందుకు మరిచింది?

(‘సమీక్ష’ ప్రత్యేక కథనం)
బతికి ఉన్నపుడే విగ్రహాలు ఏర్పాటు చేసుకుంటున్న రోజులివి. ‘పోయాక’ ఎవరైనా గుర్తిస్తారో లేదోనని పలువురు రాజకీయ నేతలు మథనపడుతున్న కాలమిది.. కానీ ఓ యాభై ఏళ్ల తర్వాత.. అర్థ శతాబ్ధం ముగిశాక ఒకానొకప్పటి రాజకీయ నాయకుడికి విగ్రహం ఏర్పాటు చేయడం ఆశ్చర్యమే కదా? మరి ఈ విషయంలో ఆయన రాజకీయ వారసులుగా చెప్పుకునే గొప్ప గొప్ప నాయకులు ఇన్నాళ్లపాటు ఏం చేసినట్లు? రాజనీతి కోవిదునిగా పేరుగాాంచిన మాజీ ప్రధాని పీవీ నరసింహారావుకే రాజకీయ గురువుగా, సినీ పరిశ్రమ హైదరాబాద్ కు తరలివచ్చేందుకు ఎన్టీ రామారావుతో మాట్లాడి, ముఖ్య భూమికను పోషించిన చారిత్రక నేపథ్యం గల తమ నాయకుడిని సొంతపార్టీ కాంగ్రెస్ ఎందుకు గుర్తించలేకపోయింది? మేం మాత్రమే తెలంగాణాను తీసుకువచ్చామని పదే పదే భుజ కీర్తిలంకించుకుంటున్న గులాబీ పార్టీ నేతలకే ప్రత్యేక తెలంగాణా ఉద్యమంలో ఆద్యుడిగా, ఆదర్శ నాయకునిగా నిలిచిన నూకల రామచంద్రారెడ్డి లోతైన కథ ఇది.

నూకల రామచంద్రారెడ్డి విగ్రహానికి కేటీఆర్ సహా బీఆర్ఎస్ నాయకులు శనివారం నివాళి అర్పించిన చిత్రం

మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి శనివారం ఆవిష్కరించిన నూకల రామచంద్రారెడ్డి కాంస్య విగ్రహానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నివాళులు అర్పించడం, ఆ పార్టీకి చెందిన రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర, ఎమ్మెల్సీ తక్కళ్లపల్లి రవీందర్ రావు, మాజీ ఎంపీలు మాలోత్ కవిత, బోయినపల్లి వినోద్ కుమార్, మాజీ ఎమ్మెల్యే శంకర్ నాయక్ తదితరులు పాల్గొన్న ఘటన గురించి తెలిసిందే. అయితే నూకల రామచంద్రారెడ్డి చనిపోయిన 51 సంవత్సరాల తర్వాత అతని విగ్రహాన్ని ఏర్పాటు చేయడమే అత్యంత ఆసక్తికర పరిణామంగా చెప్పుకోవాలి. నూకల రామచంద్రారెడ్డి మరణానంతరం ఆయన ప్రాతినిధ్యం వహించిన డోర్నకల్ నియోజకవర్గంలో అతని రాజకీయ వారసులుగా ఎదిగిన నేతలెవరూ అతని విగ్రహ ఏర్పాటుకు ప్రయత్నించలేదనే విమర్శలూ లేకపోలేదు.

నూకల రామచంద్రారెడ్డి

అర్ధ శతాబ్ధం తర్వాత విగ్రహ రూపంలో నూకల రామచంద్రారెడ్డి గుర్తుకురావడం వెనుక అసలు నేపథ్యమేంటి? కాంగ్రెస్ రాజకీయాల్లో ఆయన వేసిన అడుగులేమిటి? ప్రత్యేక తెలంగాణా రాష్ట్ర సాధన కోసం తీసుకున్న ఆయన వేసిన డేరింగ్ స్టెప్ ఏమిటి? ఆద్యంతం ఆసక్తికర రాజకీయ నేఫథ్యం గల నూకల రామచంద్రారెడ్డిని కాంగ్రెస్ పార్టీ మాత్రమే కాదు, ఆ పార్టీకి చెందిన అతని రాజకీయ వారసులు కూడా విస్మరించారనే వాస్తవానికి యాభై ఏళ్ల తర్వాత ఏర్పాటైన కాంస్య విగ్రహమే ప్రబల నిదర్శనంగా అధికార పార్టీ శ్రేణులే అభివర్ణిస్తున్నాయి.

మానుకోటలో ఏర్పాటు చేసిన నూకల రామచంద్రారెడ్డి విగ్రహం

మహబూబాబాద్ మండలం జమాండ్లపల్లికి చెందిన నూకల రామచంద్రారెడ్డి స్వాతంత్రోద్యమ నాయకుడు కూడా. రాజకీయ పయనంలో భాగంగా 1956లో రాష్ట్ర కాంగ్రెస్ జనరల్ సెక్రటరీగా ఎన్నికయ్యారు. ఆ తర్వాత ఉమ్మడి వరంగల్ జిల్లాలోని డోర్నకల్ నుంచి నాలుగుసార్లు వరుసగా ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. నాలుగోసారి 1972లో ఆయన ఏకగ్రీవంగా ఎమ్మెల్యేగా ఎన్నిక కావడం విశేషం. దామోదరం సంజీవయ్య మంత్రివర్గంలో తొలిసారి 1960లో ఆహార, వ్యవసాయ, కార్మిక, భూ సంస్కరణల మంత్రిగా పని చేశారు. ఆ తర్వాత 1964లో పరిపాలనా సంస్కరణల చైర్మెన్ గా నియమితులయ్యారు. ప్రభుత్వ అధికారులకు అధికారాల వికేంద్రీకరణకు వీలు కల్పించే వినూత్న చర్యలను సూచించడంలో నూకల కీలక పాత్రను పోషించారు.

అంతేగాక 1962లో నీలం సంజీవరెడ్డి, 1964-67 పీరియడ్ లో కాసు బ్రహ్మానందరెడ్డి, 1973లో జలగం వెంగళరావు మంత్రివర్గాల్లో రెవెన్యూ, భూ సంస్కరణల, ఆర్థిక, వాణిజ్య పన్నుల శాఖల మంత్రిగా పనిచేశారు. తెలంగాణాలో వినోబా భావే స్థాపించిన భూదాన్ ఉద్యమంలో ప్రముఖ పాత్రను పోషించారు. బంజారాల కమ్యూనిటీ హక్కులకోసం, వారి అభివృద్ధికి పాటుపడ్డారు. అధికార పార్టీలో మంత్రిగానే కాదు, 1969-71ల మధ్య శాసనసభలో పరతిపక్ష నాయకుడిగానూ తన గళాన్ని వినిపించారు.

ఎన్టీ రామారావు

తెలుగు సినీ పరిశ్రమ హైదరాబాద్ కు తరలి రావాలనే తలంపుతో ఎన్టీఆర్ తో మాట్లాడారు. హైదరాబాద్ లో ఫిలిం స్టూడియో నిర్మించడంలోనూ ముఖ్యపాత్రను పోషించారు. తెలంగాణా ప్రాంతానికి చెందిన 30 మంది ఎమ్మెల్యేలను ఒకే తాటిపైకి తీసుకువచ్చి ‘తెలంగాణ యునైటెడ్ ఫ్రంట్’ (TUF)ను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన ఉద్యమ ప్రస్థానంలో ముషీరాబాద్ జైలులోనూ కొంతకాలం గడిపారు. ముల్కీలకు కేటాయించిన పోస్టుల్లో పనిచేస్తున్న ఆంధ్రా ఉద్యోగులను వారివారి ప్రాంతాలకు పంపాలని గట్టిగా పట్టుబట్టారు. ‘జెంటిల్మెన్’ (పెద్దమనుషుల) ఒప్పందాన్ని అమలు చేయడంలో గల లోపాలని సరిదిద్ది, తెలంగాణా మిగులు ఆదాయాలను తెలంగాణా ప్రాంత అభివృద్ధికే ఖర్చు చేయాలని కోరారు.

పీవీ నరసింహారావు

పీవీ నరసింహారావుకే రాజకీయ గురువు:
బహుబాషా కోవిదునిగా, దేశ ప్రధానిగా పనిచేసిన పీవీ నరసింహారావుకు నూకల రామచంద్రారెడ్డి రాజకీయ గురువంటే అశ్చర్యం కాదు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచే పీవీతో నూకలకు అనుబంధం ఏర్పడింది. స్వాతంత్య్రోద్యమంలో, వందేమాతర ఉద్యమంలో ఇద్దరూ కలిసి పనిచేసిన సందర్బంగా పీవీతోపాటు నూకల రామచంద్రారెడ్డిని కూడా నిజాం సర్కార్ యూనివర్సిటీ నుంచి బహిష్కరించింది. ఉన్నత చదువులు పూర్తయ్యాక ఇద్దరూ ఒకేసారి రాజకీయాల్లోకి వచ్చి, 1952 ఎన్నికల్లో పోటీ చేశారు. అయితే అప్పటి ఎన్నికల్లో కరీంనగర్ నుంచి పోటీ చేసిన పీవీ నరసింహారావు ఓటమి పాలు కాగా, హైదరాబాద్ నుంచి రామచంద్రారెడ్డి విజయం సాధించారు.

ఈ నేపథ్యంలోనే నీలం సంజీవరెడ్డి 1962లో సీఎం అయ్యాక రామచంద్రారెడ్డికి మళ్లీ మంత్రిగా అవకాశం లభించింది. ‘ఈ అబ్బాయిలో మాంచి స్పార్క్ ఉంది. అతనికి మంత్రి పదవి ఇవ్వకుండా నేను మంత్రి పదవిని తీసుకోలేను’ అంటూ పీవీ నరసింహారావు గురించి నీలం సంజీవరెడ్డికి చెప్పి, ఒప్పించి మొదటిసారి అతన్ని మంత్రివర్గంలోకి తీసుకురావడంలో నూకల సఫలీకృతమయ్యారు. తద్వారా దేశంలో అనేక మంది రాజనీతిజ్ఞులకే గురువుగా ప్రాచుర్యం పొందిన పీవీ నరసింహారావుకే రాజకీయ గురువయ్యారు నూకల రామచంద్రారెడ్డి.

నీలం సంజీవరెడ్డి

ఈ విధంగా పీవీ నరసింహారావులోని మేథాశక్తిని అప్పట్లోనే గుర్తించిన రామచంద్రారెడ్డి, అటువంటి మేధావి రాజకీయాల్లో ఖచ్చితంగా ఉండాలనే తలంపుతో ఆయను ఎంతగానో ప్రోత్సహించారు. ప్రతి విషయంలో, ప్రతీ సమావేశంలోనూ తనతోపాటు పీవీ నరసింహారావు కూడా ఉండేాలా చూసుకునేవారు. అందరిలోనూ అతనికి ప్రత్యేక స్థానం కల్పించేవారు. అయితే అప్పటి పరిస్థితుల్లో రామచంద్రారెడ్డి, పీవీ నరసింహారావులు పార్టీపరంగా విడిపోవడం గమనార్హం. రామచంద్రారెడ్డి టీపీఎస్ (తెలంగాణా ప్రజా సమితి)లోకి వెళ్లగా, పీవీ నరసింహారావు కాంగ్రెస్ లోనే ఉన్నారు. అయినప్పటికీ వీరిద్దరి మధ్య స్నేహం చెదరకపోవడం ఆసక్తికర అంశం. మంత్రిగా ఉన్న సమయంలోనే 1974 జూలై 27వ తేదీన నూకల రామచంద్రారెడ్డి గుండెపోటుతో హఠాన్మరనం చెందగా, ప్రభుత్వం అధికార లాంఛనాలతో అంత్యక్రియలను నిర్వహించింది.

ఇంతటి రాజకీయ చరిత్ర గల నూకల రామచంద్రారెడ్డి అనామక కుటుంబానికి చెందినవారేమీ కాదు. తెలంగాణాలో సంపన్నులుగా కీర్తించే దేశ్ ముఖ్ కుటుంబపు నేపథ్యం ఆయనది. వందలాది ఎకరాల భూస్వామ్య కుటుంబానికి చెందిన రామచంద్రారెడ్డికి ముగ్గురు సోదరులు, ఓ సోదరి. ఆయన తమ్ముడు నూకల నరోత్తమ్ రెడ్డి ఉస్మానియా వర్సిటీ వీసీగా, గోల్కొండ పత్రిక ఎడిటర్ గా పనిచేశారు. రామచంద్రారెడ్డి భార్య భారతీదేవి మాజీ ఎంపీ రామసహాయం సురేందర్ రెడ్డికి స్వయానా అక్క. ప్రత్యేక తెలంగాణా సాధనలో, తొలిదశ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన రామచంద్రారెడ్డిని కాంగ్రెస్ పార్టీ మర్చిపోవడమే అసలు విషాదం.

ఎందుకంటే నూకల రామచంద్రారెడ్డి విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని 2023 జూలైలో బీఆర్ఎస్ చీఫ్, అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించడమే ఇందుకు నిదర్శనంగా పరిశీలకులు ప్రస్తావిస్తున్నారు. డోర్నకల్ అసెంబ్లీ సెగ్మెంట్ నుంచి నూకల రాజకీయ వారసులుగా ఎదిగిన నాయకులకు కూడా యాభై ఏళ్లపాటు ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేయాలనే ఆలోచన రాకపోవడం విచిత్రంగానే పేర్కొంటున్నారు. ప్రస్తుత డోర్నకల్ నియోజకవర్గానికి కూడా మరిపెడ కేంద్రంగానే వ్యవహరిస్తారు. కనీసం ఇప్పటికైనా మరిపెడలో నూకల రామచంద్రారెడ్డి విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని కాంగ్రెస్ అభిమానులు కోరుకుంటున్నారు.

నూకల రామచంద్రారెడ్డి విగ్రహాన్ని ఏర్పాటు చేయాలనే కేసీఆర్ తలంపుపై మహబూబాబాద్ కు చెందిన ఓ సీనియర్ జర్నలిస్ట్ మిత్రుడు స్పందిస్తూ, అప్పట్లో రేవంత్ రెడ్డికి అనుకూలంగా రెడ్లు ఏకమవుతున్నారనే సమాచారంతో గులాబీ పార్టీ అధినేత స్పందించారని వ్యాఖ్యానించడం విశేషం. మానుకోట జిల్లాలో రెడ్ల ప్రభావం తీవ్రంగా ఉండడం కూడా ఇందుకు కారణంగా పేర్కొన్నారు. అయితే కాంగ్రెస్ నాయకులకు పట్టని నూకల రామచంద్రారెడ్డి తన రాజకీయ చారిత్రక నేపథ్యానికి గుర్తుగా యాభై ఏళ్ల తర్వాతనైనా విగ్రహ రూపంలోకి మారడం శుభపరిణామంగా ఆ సీనియర్ జర్నలిస్ట్ పేర్కొన్నారు.

Popular Articles