Saturday, January 24, 2026

Top 5 This Week

Related Posts

కేటీఆర్ గుర్తుంచుకోవలసిన మరో ‘చాయ్ దుకాణం’ కథ!

ఫొటో చూశారు కదా..! బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఫొటోలతో కూడిన ఫ్లెక్సీతో కనిపిస్తున్న టీ కొట్టు (చాయ్ దుకాణం) దృశ్యమిది. ఎమ్మెల్యేగా కేటీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న సిరిసిల్ల నియోజకవర్గ కేంద్రంలోనే గల ఈ టీ కొట్టు ఇప్పుడు వార్తల్లో నిలవడమే అసలు విశేషం. ఈ టీకొట్టు అంశంపై కేటీఆర్ తన ఎక్స్ ఖాతాలో స్పందిస్తూ ట్వీట్ చేయడం మరో ఆసక్తికర అంశం. ఇంతకీ ఈ టీ కొట్టు కథా కమామీషు ఏమిటంటే..?

సిరిసిల్లలోని బతుకమ్మ ఘాట్ వద్ద గల ఈ టీ స్టాల్ ను మూసివేయాలని మున్సిపల్ అధికారులు ఆదేశించడమే వివాదానికి దారి తీసింది. సిరిసిల్లలో ప్రభుత్వం కక్ష సాధింపునకు పాల్పడుతోందని, అభిమానంతో కేటీఆర్ బొమ్మ పెట్టుకున్నందుకే చిరు వ్యాపారిపై మున్సిపల్ అధికారులు తమ ప్రతాపాన్ని చూపారని, కలెక్టర్ మూసివేయించారని బీఆర్ఎస్ విమర్శిస్తున్నదని గులాబీ పార్టీ అధికార పత్రిక మెయిన్ ఎడిషన్ లో భారీ వార్తా కథనాన్ని ప్రచురించింది.

ఈ సంఘటనపై కేటీఆర్ కూడా తన ఎక్స్ ఖాతాలో స్పందిస్తూ ట్వీట్ చేయడం ఇంట్రస్టింగ్ పాయింట్. తన ఫొటో పెట్టుకున్నందుకు పేద వ్యక్తిని వేధించడం తగదని, ప్రతీదీ గుర్తు పెట్టుకుంటామని, ఏదీ మర్చిపోమని, ఖచ్చితంగా బదులిస్తామని కేటీఆర్ హెచ్చరించారట. ఈ విషయాన్ని కూడా బీఆర్ఎస్ అధికార పత్రిక సవివరంగా తన వార్తా కథనంలో నివేదించింది.

సిరిసిల్ల జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా

ఈ టీ స్టాల్ ఘటనపై ఇతర పత్రికల్లో భిన్నరీతిలో వార్తా కథనాలు రావడం గమనార్హం. జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా కొత్తచెరువు,రైతు బజార్, బతుకమ్మ ఘాట్ తోపాటు అనేక ఇతర వార్డులను కూడా సందర్శించారు. బతుకమ్మ ఘాట్ వద్ద ఫుట్ పాత్ పై బత్తుల శ్రీనివాస్ అనే టీ స్టాల్ నిర్వాహకుడు కేటీఆర్ పై అభిమానంతో పేరును, ఫొటోను ఏర్పాటు చేసుకున్నాడు.

అయితే ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమలులో ఉన్న నేపథ్యంలో కేటీఆర్ ఫొటో గల ఫ్లెక్సీని తొలగించాలని కలెక్టర్ ఆదేశించారట. అయితే ఈ విషయంలో కలెక్టర్ చెప్పిన విషయాన్ని సరిగ్గా అర్థం చేసుకోని మున్సిపల్ అధికారులు ఏకంగా టీ స్టాల్ ను ట్రేడ్ లైసెన్స్ లేదనే సాకుతో మూసేయించగా, బీఆర్ఎస్ నాయకులు అక్కడికి చేరుకుని తిరిగి టీ స్టాల్ ను తెరిపించారట. ఇదీ సిరిసిల్లలోని కేటీఆర్ బొమ్మతో గల టీ స్టాల్ కథ.

ఈ నేపథ్యంలోనే బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఖమ్మం నగరంలో చోటు చేసుకున్నట్లు భిన్న కథనాలు ప్రచారంలో గల ఇంకో టీ స్టాల్ కథ కూడా ఇప్పుడు మరోసారి చర్చకు రావడమే ఆసక్తికర అంశం. ఖమ్మం నగరంలోని సర్డార్ పటేల్ స్టేడియం సమీపన గల ఓ షాపింగ్ మాల్ పక్కనే గల చిన్నపాటి హోటల్ అది. ఇక్కడికి టీ తాగడానికి వచ్చీపోయే వారు కాస్త రాజకీయాల గురించి కూడా పిచ్చాపాటీ కబుర్లు చెప్పుకునేవారు. ముఖ్యంగా రాజకీయ కబుర్లకు ఖమ్మం నగరంలో ఇటువంటి ప్రదేశాలు ప్రసిద్ధి కూడా.

సిరిసిల్లలోని టీ స్టాల్ ఇదే..

స్టేడియంలో వాకింగ్ కు వచ్చీపోయేవారు పక్కనే గల హోటల్ లో టీ తాగుతూ వచ్చే ఎన్నికల్లో ఫలానా రాజకీయ నాయకుడు ఓడిపోతాడని, మరో నాయకుడు గెలుస్తాడని ఉబుసుపోని ఊసులెన్నో మాట్లాడుకునేవారు. ఈ బాతాఖానీలోనే ఓ నాయకుడు ఖచ్చితంగా ఓడిపోతాడని కొందరి మధ్య ఈ హోటల్ లోనే చర్చ జరిగింది. ఇంకేముంది విషయం అధికారంలో గల బీఆర్ఎస్ ముఖ్యనేత చెవిలో పడింది. ఫలితంగా హోటల్ నిర్వాహకుడే కాదు, ఓ వాకర్ ను కూడా పోలీసులు పోలీస్ స్టేషన్ కు తీసుకువెళ్లి తమదైన శైలిలో కూర్చోబెట్టి ఇబ్బంది పెట్టారనేది అప్పట్లో జరిగినట్లు పేర్కొన్న ఈ ఘటనపై ఇప్పటికీ కథలు కథలుగా చెప్పుకుంటుంటారు.

విషయం రాద్దాంతమై, వివాదాస్పదమవుతున్న పరిణామాల్లో తమకు ఈ వ్యవహారంతో సంబంధం లేదని హోటల్ నిర్వాహకునితోపాటు వాకర్ కూడా అనివార్యమైన పరిస్థితుల్లో మీడియాకు చెప్పారనేది వ్యాప్తిలో గల మరో కథనం. అంతేకాదు తనకు జరిగిన ఇబ్బందికి ప్రతీకారంగా ఈ హోటల్ నిర్వాహకుడు గత ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఓటమికోసం దాదాపు రూ. 20 వేల సొంత డబ్బును ఖర్చు చేసి మరీ కష్టపడ్డాడనేది కూడా ప్రచారంలో గల ఇంకో కథనపు సారాంశం. ఈ విషయం ఇలా ఉంటే సొంతపార్టీకి చెందిన నాయకుల బర్త్ డే వేడుకల ఫ్లెక్సీ కట్టుకునే స్వాతంత్య్రం కూడా లేని నిర్బంధాన్ని అప్పటి అధికార బీఆర్ఎస్ పార్టీ నాయకులే ఎదుర్కున్నారనేది ఖమ్మం నగరంలో బహిరంగ రహస్యమే. తన నియోజకవర్గంలో జరిగిన టీ స్టాల్ ఘటన గురించి ఎక్స్ ఖాతాలో స్పందించిన కేటీఆర్ ఖమ్మం హోటల్ కథను, సొంత పార్టీ నాయకులు చవి చూసిన నిర్బంధ పరిణామాలను కూడా తెలుసుకుని గుర్తు పెట్టుకోవలసిన అవసరముందనే వ్యాఖ్యలు రాజకీయ పరిశీలకుల నుంచి వినిపిస్తున్నాయి.

Popular Articles