వరంగల్ మహా నగరంలో మళ్లీ భయానక వాతావరణం నెలకొంది. వరంగల్ త్రి నగరాన్ని వర్షం వీడకపోవడమే ఇందుకు ప్రధాన కారణం. బుధవారం నుంచి మళ్లీ భారీగా వర్షం పడుతోంది.రాత్రి నుంచి వాన కురుస్తుండటం వల్ల వరంగల్, హన్మకొండ, కాజీపేట పట్టణాల్లోని ప్రధాన రోడ్లు, కాలనీలు జలమయమయ్యాయి.
నగరంలోని రోడ్లు చెరువులను తలపిస్తున్నాయి. గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలతో మహా నగరం అతలాకుతలం అవుతోంది. వర్షం కారణంగా భారీ కుదుపునకు గురైన వరంగల్ నగరాన్ని మంత్రి కేటీఆర్ సందర్శించిన సంగతి తెలిసిందే. మంత్రి పర్యటన అనంతరం మధ్యలో ఒక రోజు గ్యాప్ తరువాత మళ్లీ వాన జోరందుకుంది.

భారీ వర్షాలతో నగరంలోని నాలాలు, డ్రైనేజీలు మరోసారి పొంగిపొర్లుతున్నాయి. పలు చోట్ల విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగింది. ముంపు ప్రాంతాల కాలనీ వాసులు బిక్కుబిక్కుమంటూ కాలం గడుపుతున్నారు. భారీ వర్షానికి నగర వాసులు బయటకు రావడానికే జంకుతున్నారు.