Sunday, August 31, 2025

Top 5 This Week

Related Posts

డీలిమిటేషన్ కసరత్తుపై TG అసెంబ్లీ కీలక తీర్మానం

లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజన దిశగా కేంద్ర ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు, అనుసరించబోయే విధి విధానాలు, రాష్ట్ర ప్రభుత్వాలతో పారదర్శకమైన సంప్రదింపులు జరపకుండా చేస్తున్న కసరత్తు పట్ల తెలంగాణ శాసనసభ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియలో లోక్‌సభ సీట్ల సంఖ్యను యథాతథంగా కొనసాగించడంతో పాటు రాష్ట్రాన్ని యూనిట్‌గా తీసుకుని ప్రస్తుత సరిహద్దులను మార్పు చేయాలని కోరుతూ సభా నాయకుడు, ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి ప్రవేశపెట్టిన తీర్మానాన్ని శాసనసభ ఆమోదించింది.

నియోజకవర్గాల పునర్విభజనకు సంబంధించిన కసరత్తు పారదర్శకంగా ఉండాలని, అన్ని రాష్ట్రాలు, రాజకీయ పార్టీలతో సంప్రదింపులు జరపాలని తీర్మానంలో కోరారు. పునర్విభజనకు ప్రాతిపదిక విషయంలో రాష్ట్రాలతో సంప్రదింపులు జరపకపోవడం, ప్రస్తుత కసరత్తు వల్ల పునర్విభజనలో దక్షిణాది రాష్ట్రాల నష్టం వాటిల్లుతుంది.

కేంద్ర ప్రభుత్వానికి తమ అభిమతాన్ని తెలియజేయాలన్న ఉద్దేశంతో శాసనసభ తీర్మానం ప్రతిపాదించినట్టు ఈ సందర్భంగా సీఎం సభ ముందు వివరించారు.

తీర్మానాన్ని సీఎం రేవంత్ సభలో ప్రవేశపెడుతూ.. లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజన దిశగా కేంద్ర ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు, అనుసరించబోయే విధివిధానాలు, రాష్ట్ర ప్రభుత్వాలతో పారదర్శకమైన సంప్రదింపులు లేకుండాజరుగుతున్న కసరత్తుపై ఈ సభ తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తోందన్నారు.

అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు, అన్ని రాజకీయ పార్టీలు, భాగస్వామ్య పక్షాలతో విస్తృతమైన సంప్రదింపుల తర్వాత పునర్విభజన కసరత్తును పారదర్శకంగా చేపట్టాలని సభ కోరుతోందన్నారు. కేంద్ర ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాలకు అనుగుణంగా జనాభా నియంత్రణ కార్యక్రమాన్ని సమర్థవంతంగా అమలు చేసిన రాష్ట్రాలకు పునర్విభజన శాపంగా మారకూడదన్నారు.

జాతీయ జనాభా స్థిరీకరణ ఉద్దేశ్యంతో చేపట్టిన 42, 84 మరియు 87వ రాజ్యాంగ సవరణల లక్ష్యాలు ఇంకా నెరవేరలేదనే చెప్పుకోవాలని, జనాభా నియంత్రణ అమలు చేయటం ద్వారా జనాభా వాటా తగ్గిన రాష్ట్రాలు నష్టపోకూడదని, అందుకే, నియోజకవర్గాల పునర్విభజనకు జనాభా ఒక్కటే ప్రామాణికం కాకూడదన్నారు.

పార్లమెంట్​ సీట్ల సంఖ్యను యథాతథంగా కొనసాగించాలని, రాష్ట్రాన్ని యూనిట్‌గా తీసుకుని ఇప్పుడున్న నియోజకవర్గాల సరిహద్దుల మార్పులు చేర్పులు చేయాలన్నారు. తాజా జనాభా లెక్కలకు అనుగుణంగా ఎస్సీ, ఎస్టీ సీట్లను పెంచాలి. మహిళలకు రిజర్వేషన్లు కల్పించాలన్నారు.

అంతే కాకుండా, ప్రాతినిధ్య ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయడానికి, తాజా జనాభా లెక్కల ప్రకారం, ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం-2014లో నిర్దేశించిన మేరకు ప్రస్తుతం ఉన్న 119 అసెంబ్లీ నియోజకవర్గాలను 153 వరకు తక్షణమే పెంచాలని ఈ సభ తీర్మానిస్తున్నది చెప్పారు. అందుకు అవసరమైన రాజ్యాంగ సవరణలను ప్రవేశ పెట్టాలని ఈ సభ కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతోందని ప్రతిపాదించారు.

ప్రతిపాదిత నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియ వల్ల దక్షిణాది రాష్ట్రాలకు నష్టం వాటిల్లుతుందని తమిళనాడు ముఖ్యమంత్రి నిర్వహించిన ఈ రాష్ట్రాల సమావేశం ఆందోళన వ్యక్తం చేసిన విషయాన్ని ఈ సందర్భంగా సీఎం రేవంత్ ప్రస్తావించారు. పునర్విభజన కోసం గతంలో అనుసరించిన విధానాలను సభలో వివరించారు.

జనాభా ప్రాతిపదికన పుర్విభజన చేపడితే దక్షిణాది రాష్ట్రాల నుంచి ఉన్న ప్రాతినిథ్యం 24 శాతం మేరకు నష్టం వాటిల్లుతుందని తెలిపారు. తెలంగాణలో 119 అసెంబ్లీ స్థానాలను 153 కు పెంచాలని ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం 2014 లో పేర్కొన్న విషయాన్ని ప్రస్తావించారు. ఆ చట్టంలో పేర్కొన్న విధంగా పునర్విభజన చేపట్టకపోవడాన్ని సభ ముందు వివరించారు. జమ్మూ కశ్మీర్ రాష్ట్రంలో నియోజకవర్గాల పునర్విభజన చేసిన తీరు, సిక్కింలో జరిగిన ప్రక్రియను తెలిపారు.

ప్రస్తుతం ప్రతిపాదిత పునర్విభజన దక్షిణాది రాష్ట్రాలకు ఏమాత్రం మంచిది కాదని, క్షేమకరం కాదని, అందుకే రాజకీయాలకు అతీతంగా ఈ తీర్మానం ప్రవేశపెట్టినట్టు వివరించారు.

Popular Articles