అమరజీవి పొట్టి శ్రీరాములు త్యాగం తెలుగు వారు మరచిపోరని, తెలుగు జాతి పొట్టి శ్రీరాములును గుండెల్లో పెట్టుకున్నారని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఘన నివాళులు అర్పించారు! పొట్టి శ్రీరాములు 125వ జయంతి ఉత్సవాలు ఏడాది పొడవునా అధికారికంగా నిర్వహించనున్నట్లు ఆయన ప్రకటించారు. నెల్లూరు జిల్లాలోని శ్రీరాములు సొంతూరును ఒక పర్యాటక స్థలంగా తీర్చిదిద్దనున్నట్లు తెలిపారు. ఆ ఊర్లో పొట్టి శ్రీరాములు నివాసాన్ని మ్యూజియంగా మారుస్తామని, అదే ఊర్లో పొట్టి శ్రీరాములు ఆధునిక ఉన్నత పాఠశాల ఏర్పాటు చేస్తామని చంద్రబాబు ప్రకటించారు. శ్రీరాములు స్ఫూర్తిని గుర్తు చేస్తూ హైస్కూల్, కళాశాల స్థాయిలో వక్తృత్వ, వ్యాస రచన పోటీలు, యువతకు స్ఫూర్తినిచ్చే కార్యక్రమాలు రూపొందిస్తామని చంద్రబాబు చెప్పారు! పొట్టి శ్రీరాములు 125వ జయంతి సందర్భంగా 12 నెలలు 12 కార్యక్రమాలు నిర్వహించాలని నిర్ణయించినట్లు చంద్రబాబు తెలిపారు.
ఎన్టీఆర్ పేరు తొలగించే దమ్ముందా?:
కేంద్ర మంత్రి బండి సంజయ్
పొట్టి శ్రీరాములు జయంతి సందర్భంగా ఆదివారం కరీంనగర్ లో కేంద్ర మంత్రి బండి సంజయ్ స్పందించారు. తెలుగు యూనివర్సిటీకి పొట్టి శ్రీరాములు పేరు ఉంటే ఎందుకు తొలగించాల్సి వచ్చిందో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పాలని కోరారు. ట్యాంక్ బండ్ పై వున్న ఎన్టీఆర్, నీలం సంజీవరెడ్డి విగ్రహాలను తొలగించే దమ్ముందా? అని ప్రశ్నించారు. కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియం, కాసు బ్రహ్మానంద రెడ్డి పార్కు పేర్లు తొలగించే దమ్ముందా? వెంటనే శాసనసభ లో చేసిన తీర్మానం ఉపసంహరించుకుని తిరిగి పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ పేరు కొనసాగించాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు. ఆంధ్ర మూలాలు ఉన్నంత మాత్రాన తొలగిస్తారా? వారి సేవలను గుర్తించరా? అని కేంద్ర మంత్రి బండి సంజయ్ ధ్వజమెత్తారు.
పొట్టి శ్రీరాములు పేరిట మ్యూజియం ఏర్పాటు చేయాలని నాలుగు పర్యాయాలు ముఖ్యమంత్రి అయిన చంద్రబాబుకు ఈదఫా గుర్తొచ్చినందుకు సంతోషించాలో, ఆవేదన చెందాలో అర్ధం కావడం లేదు! మొత్తానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ఈ మాత్రం చలనం వచ్చింది! తెలుగు వారి కోసం ప్రాణ త్యాగం చేసిన పొట్టి శ్రీరాములు ను తెలంగాణ ప్రభుత్వం పట్టించుకోకపోవడం విడ్డూరం! తెలంగాణ వాదం గొప్పదే కానీ, స్వాతంత్య్ర సమర యోధులు, రాష్ట్రానికి సేవలు అందించిన మహనీయులను రెండు రాష్ట్రాలు గౌరవించాల్సిన అవసరం ఉంది! సురవరం ప్రతాపరెడ్డి కూడా గొప్పవారే! ఇంకో యూనివర్సిటీకో ఇంకో ఆడిటోరియానికో పెట్టుకోవచ్చు! తిరిగి ఒక్క అడుగు వెనక్కి వేయడంలో తప్పేం లేదు!
Update:
పేర్లు మార్చాం రాజకీయం చేయవద్దు: సీఎం
పొట్టి శ్రీరాములు అంటే తమకు, తమ ప్రభుత్వానికి ఎంతో గౌరవం ఉందని, చిన్నచూపు ఏమాత్రం లేదని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. చర్లపల్లి రైల్వే టెర్మినల్ కు పొట్టి శ్రీరాములు పేరు పెడదామని, ఇందుకు కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ లు సహకరించాలని కోరారు. చీరాల నుంచి వచ్చి హైదరాబాద్ ను ఓన్ చేసుకున్న పూర్వ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య పేరును బల్కంపేట్ లోని ప్రభుత్వ ప్రకృతి చికిత్స కేంద్రానికి పెట్టనున్నామని, అక్కడే రోశయ్య విగ్రహం కూడా నెలకొల్పుతామని రేవంత్ రెడ్డి అసెంబ్లీ లో ప్రకటించారు.
చాకలి ఐలమ్మ, కొండా లక్ష్మణ్ బాపూజీ, సురవరం ప్రతాపరెడ్డి పేర్లను యూనివర్సిటీ లకు పెట్టాలని నిర్ణయించి ఈ నిర్ణయం తీసుకున్నామని, అందరూ గౌరవించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కోరారు. గుజరాత్ లో స్టేడియం కు సర్దార్ వల్లభాయ్ పటేల్ పేరు తొలగించి మోదీ పేరు ఎందుకు పెట్టారో మంత్రులు బండి సంజయ్, కిషన్ రెడ్డి చెప్పాలని ప్రశ్నించారు. వెంటనే బీజేపీ శాసన సభాపక్ష నేత మహేశ్వరరెడ్డి స్పందించారు. స్టేడియానికి పటేల్ పేరు ఇప్పటికీ ఉందని, కేవలం గ్రౌండ్ కు మాత్రమే మోదీ పేరు పెట్టారని వివరించారు. తెలుగు యూనివర్సిటీకి పొట్టి శ్రీరాములు పేరు కొనసాగించాలని, అవసరమైతే ఉస్మానియా యూనివర్శిటీకి సురవరం ప్రతాప్ రెడ్డి పేరు పెడితే తమకు అభ్యంతరం లేదని ఆయన సూచించారు.
– డా. మహ్మద్ రఫీ