ఢిల్లీ: గోదావరి-బనకచర్ల ప్రాజెక్టు కడతామని ఏపీ ప్రభుత్వం నుంచి ప్రతిపాదనే చర్చకు రాలేదని తెలంగాణా సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. ఎజెండాలో ప్రాజెక్టు నిర్మాణం ప్రతిపాదనే చర్చకు రానప్పుడు ఆపాలనే చర్చే ఉండదని అన్నారు. ఉభయ తెలుగు రాష్ట్రాల సీఎంలతో జలశక్తి కార్యాలయంలో జల్ శక్తి మంత్రి సీఆర్ పాటిల్ అధ్యక్షతన బుధవారం సమావేశం అనంతరం రేవంత్ రెడ్డి మంత్రి ఉత్తమ్ తో కలిసి మీడియాతో మాట్లాడారు.
సమావేశానికి సంబంధించి తెలంగాణా సీఎంవో అధికారికంగా ప్రకటించిన సమావేశపు వివరాలు ఇలా ఉన్నాయి. అంగీకరించిన అంశాలు:
1. ప్రాజెక్టుల నుంచి నీటి విడుదలకు సంబంధించి టెలిమెట్రీ యంత్రాల ఏర్పాటుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచనకు ఆంధ్రప్రదేశ్ అంగీకారం.
2. గోదావరి నది యాజమాన్య బోర్డు తెలంగాణలో, కృష్ణా నది యాజమాన్య బోర్డు ఆంధ్రప్రదేశ్ లో ఏర్పాటుకు అంగీకారం.
3. శ్రీశైలం ప్రాజెక్ట్ మరమ్మతులకు ఆంధ్రప్రదేశ్ అంగీకారం.
4. ఇరు రాష్ట్రాల్లో గోదావరి, కృష్ణా నదులపై ఉన్న ప్రాజెక్టులకు సంబంధించి పెండింగ్ సమస్యల పరిష్కారానికి అధికారులు, సాంకేతిక నిపుణులతో వారం రోజుల్లో కమిటీ నియామకం.
5. ఇరు రాష్ట్రాల మధ్య చర్చలు సుహృద్భావ వాతావరణంలో జరిగాయి. అన్ని సమస్యలను చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని నిర్ణయం.
