Monday, December 1, 2025

Top 5 This Week

Related Posts

ఆర్టీఏ చెక్ పోస్టుల్లో ఇదీ ‘రాత్రి కలెక్షన్స్’ లెక్క!

హైదరాబాద్: తెలంగాణా రవాణా శాఖకు చెందిన 12 సరిహద్దు చెక్ పోస్టుల్లో ఒక్కరాత్రి అక్రమ కలెక్షన్ల లెక్క తేలింది. గత రాత్రి నుంచి ఈ ఉదయం వరకు రాష్ట్ర సరిహద్దుల్లో గల ఆర్టీఏ చెక్ పోస్టుల్లో ఏసీబీ దాడులు నిర్వహించి, సోదాలు చేసిన సంగతి తెలిసిందే. ఈ దాడులకు సంబంధించి ఏసీబీ విడుదల చేసిన అధికార ప్రకటన ప్రకారం.. గడచిన ఒక్క రాత్రికే ఆయా చెక్ పోస్టుల్లో లెక్కల్లోకి రాని డబ్బు అక్షరాలా నాలుగు లక్షల 18 వేల 880 రూపాయలుగా వెల్లడైంది.

ఆర్టీఏ చెక్ పోస్టుల్లో ట్రాన్స్ పోర్ట్ లారీ డ్రైవర్లు లేదా క్టీనర్ల నుంచి అక్రమ వసూళ్లు చేస్తున్నారనే విశ్వసనీయ సమాచారం మేరకు ఏసీబీ గత అర్ధరాత్రి నుంచి తనిఖీలు జరిపింది. నల్లగొండ జిల్లా విష్ణుపురం, సూర్యాపేట జిల్లా కోదాడ, నారాయణపేట జిల్లా క్రిష్ణా, ఆదిలాబాద్ జిల్లా భోరాజ్, నిర్మల్ జిల్లా భైంసా, కొమురం భీం జిల్లా వాంకిడి, కామారెడ్డి జిల్లా సలాబత్ పూర్, పెందుర్తి, సంగారెడ్డి జిల్లా జహీరాబాద్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ, అశ్వారావుపేట, ఖమ్మం జిల్లా ముత్తగూడెం ఆర్టీఏ చెక్ పోస్టుల్లో ఏసీబీ అధికారులు తనిఖీలు నిర్వహించారు.

పాల్వంచ ఆర్టీఏ చెక్ పోస్టులో ఏసీబీ అధికారుల తనిఖీ దృశ్యం

ఈ సందర్భంగా చెక్ పోస్ట్ వద్దకు రాగానే అక్కడ గల సిబ్బందికి లారీల డ్రైవర్లు రొటీన్ గా నగదును ఇస్తున్నారని, తద్వారా సురక్షితంగా ముందుకు ప్రయాణిస్తున్నారని ఏసీబీ గుర్తించింది. సంబంధిత అధికారులు నిర్లక్ష్యంగా విధులు నిర్వహిస్తున్నారని, ఏజెంట్లను నియమించుకుని వాహనాలను ఆపుతూ అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నట్లు కూడా ఏసీబీ అధికారులు తమ తనిఖీల్లో గుర్తించారు. ఇందుకు సంబంధించి సమగ్ర నివేదికను ప్రభుత్వానికి సమర్పిస్తూ తగిన చర్యలకు సిఫారసు చేసినట్లు ఏసీబీ వివరించింది.

కాగా ఒక్క రాత్రికే అక్రమ కలెక్షన్లు రూ. 4.18 లక్షలైతే, ఈ ప్రాతిపదికన నెలకు 1.20 కోట్లకుపైగా చొప్పున ఏడాదికి చేస్తున్న వసూళ్ల దందా మొత్తం ఎంతో లెక్కలు కట్టవచ్చనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అయితే నిన్న బీసీ బంద్ కారణంగా వాహనాల సంఖ్య తక్కువగా ఉందని, లేనట్లయితే ఈ మొత్తం మరింత భారీగానే ఉండేదనే చర్చ సోషల్ మీడియాలో జరుగుతుండడం గమనార్హం.

Popular Articles