Friday, January 23, 2026

Top 5 This Week

Related Posts

భలే ‘ఇంటెలిజెన్సీ’.. మంత్రికి బిగ్ షాక్!

అనగనగా ఓ తెలుగు రాష్ట్రం.. తెలంగాణానా? ఆంధ్రప్రదేశా? అని మాత్రం అడక్కండి. విషయాన్ని సీరియస్ గా చదవండి. ఆ రాష్ట్రంలో ఓ మంత్రి. అప్పటి ముఖ్యమంత్రి ఏరికోరి మరీ ఆయనకు మంత్రిత్వ పదవీ బాధ్యతలను అప్పగించారు. అందులోనూ ఆ రాష్ట్రానికి ‘ఉత్తర’ దిశన గల ఓ జిల్లాకు ఆ మంత్రికి ముఖ్యమంత్రి అత్యంత కీలక బాధ్యతలను అప్పగించారు. పాలనా వ్యవహారాలతోపాటు, పార్టీ విషయాలనూ చక్కదిద్దే బాధ్యత అన్నమాట. ఓ రకంగా ‘ఇంచార్జి’ బాధ్యతల టైపు మంత్రి అనుకోండి కాసేపు. ఇంచార్జి బాధ్యతల మంత్రి అన్నాక అవసరం ఏర్పడిన పార్టీ నాయకులైనా, అధికారులైనా, పారిశ్రామికవేత్తలైనా ఆయననే ఆశ్రయిస్తారు కదా! ముఖ్యమంత్రి అప్పగించిన బాధ్యతల నిర్వహణలో ఆయనకు మంచిపేరే వచ్చింది. తొలిసారి మంత్రి అయినప్పటికీ, పూర్వాశ్రమంలో వృత్తి రీత్యా అబ్బిన తెలివి తేటలతో సీఎం అప్పగించిన బాధ్యతలను చురుగ్గానే నిర్వహిస్తున్నారు.

తాను ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గం పక్క జిల్లాలోనే ఉండడంతో కీలక బాధ్యతలను నిర్వహిస్తున్న జిల్లాలోనూ అనతికాలంలోనే మాంచి పట్టు సాధించారు ఆ సచివుడు. ఓ పారిశ్రామికవేత్తకు ఈ మంత్రితో అవసరం రీత్యా పరిచయం ఏర్పడింది. రెండు, మూడుసార్లు మాటా, మంతీకోసం సిట్టింగ్ వేశారు. చర్చలు చివరికి ఓ కొలిక్కి వచ్చాయి. మొత్తం వ్యవహారంలో ‘సెటిల్మెంట్’ కుదిరింది. ఓరోజు సదరు మంత్రి తనకు కీలక బాధ్యతలు అప్పగించిన జిల్లాకు వచ్చిన సందర్భంగా ఆ పారిశ్రామికవేత్త ఒప్పుకున్న సెటిల్మెంట్ బాపతు రూ. 50 లక్షల మొత్తాన్ని ఓ బ్యాగులో సర్ది అప్పగించాడు. ఆ మొత్తం నగదుతో మంత్రి తిరిగి తన జిల్లాకు సంతోషంగా బయలుదేరారు. కీలక బాధ్యతల జిల్లా సరిహద్దులు దాటుతున్న సమయంలోనే ప్రభుత్వంలో నంబర్ -2గా చెలామణిలో గల కీలక నాయకుడి నుంచి మంత్రికి ఫోన్ కాల్.. మర్యాదపూర్వక విష్ కూడా చేయకముందే, మంత్రికి మరోమాట మాట్లాడే ఛాన్స్ లేకుండానే.. ‘ఫలానా పారిశ్రామికవేత్త నుంచి నువ్వు తీసుకున్న రూ. 50 లక్షలు ఇంటికి పంపించెయ్..!’ అని నంబర్-2 నాయకుడు ఆదేశించి ఫోన్ కట్ చేశారు.

ఒక్కసారిగా ఆ మంత్రికి నోట మాట కూడా రాలేదు. మైండ్ బ్లాంక్ అయ్యింది. డబ్బు తీసుకున్న విషయం తనకూ, ఇచ్చిన పారిశ్రామికవేత్తకు తప్ప మరెవరికీ తెలియదు. తన పీఏకే కాదు, చివరికి సూట్ కేసులో ఏముందో కారు నడిపే డ్రైవర్ కు, పక్కనే గల గన్ మెన్లకు కూడా తెలియదు. కానీ విషయం ఎలా తెలిసిందబ్బా..? అని ఆ మంత్రి తల నిమురుకుని బిత్తరబోయాడట. డౌట్ వచ్చి విషయం చెప్పకుండానే నాపై మీరు ఏదైనా నిఘా పెట్టారా? అని ఇంటెలిజెన్స్ విభాగానికి చెందిన ఓ అధికారిని మంత్రి నర్మగర్భంగా ఆరా తీశాడట. అబ్బే.. మాకేం తెలియదు సర్.. అని ఆ ఇంటెలిజెన్స్ అధికారి చెప్పాడట. విషయం అర్థమైనట్లే కదా..? అంతా ఫోన్ ట్యాపింగ్ మహిమ అన్నమాట.

ప్రస్తుతం తెలంగాణాలో ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణలో కొత్త కొత్త విషయాలు తెలియడంతోపాటు అనేక సంచలనాత్మక అంశాలు కూడా వార్తలుగా వ్యాప్తిలోకి వస్తున్న సంగతి తెలిసిందే. ఎవరినీ వదలకుండా, చివరికి తోడబుట్టిన చెల్లెల్లను కూడా వదలకుండా ఫోన్ ట్యాపింగ్ దందా నడిచినట్లు హాట్ హాట్ గా రాజకీయ చర్చ సాగుతోంది. అంతేకాదు తెలంగాణాలో ఫోన్ ట్యాప్ చేసి పక్కనే గల అప్పటి ప్రభుత్వానికి కూడా రికార్డెడ్ టేపులు అందజేశారనే ఆరోపణలతో కూడిన వార్తలు కూడా వస్తున్నాయి. వైఎస్ షర్మిల ఫోన్ ట్యాప్ చేశారనే వార్తలు కూడా ఇందులో భాగమే.

ఇంతకీ ఆ మంత్రి ఎవరు? ఏపీకి చెందిన మంత్రినా? తెలంగాణాకు చెందిన మంత్రినా? అని మాత్రం అడక్కండి. ఎందుకంటే ఇంతకన్నా అప్పటి విషయం నాకు ఇప్పుడు గుర్తు లేదు. కాకపోతే చిన్న క్లూ ఇవ్వగలను. ఆ తర్వాత కాలక్రమంలో ఆ మంత్రి తన పదవిని కోల్పోవడం. ఈ విషయాన్ని కూడా అప్పటి అధికార పార్టీకి చెందిన పత్రికలో పనిచేస్తున్న ఓ జర్నలిస్ట్ మిత్రుడు ఫలానా నాయకుని మంత్రి పదవిని ఎందుకు తీసేశారు? అని ప్రశ్నించిన సందర్భంగా అప్పట్లో అన్యాపదేశంగా నా చెవిలో వేశాడన్నమాట. ఫోన్ ట్యాపింగ్ అంశం ‘కతలు కతలు’గా తాజాగా వెలుగులోకి వస్తున్న పరిణామాల్లో ఆ జర్నలిస్టు మిత్రుడు చెప్పిన అప్పటి ఈ కథ కూడా ఇప్పుడు గుర్తుకొచ్చింది. అదీ అసలు సంగతి.

-ఎడమ సమ్మిరెడ్డి

Popular Articles