Top 5 This Week

Related Posts

‘బీసీ’ బంద్: స్తంభించిన తెలంగాణా

హైదరాబాద్: తమకు రిజర్వేషన్ల అమలుకోసం డిమాండ్ చేస్తూ బీసీ సంఘాల జేఏసీ ఇచ్చిన పిలుపు మేరకు శనివారం తెలంగాణాలో బంద్ కొనసాగుతోంది. బీసీ సంఘాల ఇచ్చిన బంద్ పిలుపుతో తెలంగాణా స్తంభించింది. ఆసుపత్రులు, మెడికల్ షాపుల వంటి ఎమర్జెన్సీ సర్వీసులు మినహా మిగతా రంగాలల్లో బంద్ జరుగుతోంది. బీసీ సంఘాల బంద్ కు కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ, ఉభయ కమ్యూనిస్టు పార్టీలు, డీజేఎస్, మాస్ లైన్, ఎమ్మార్పీఎస్, మాల మహానాడు, ఆదివాసీ, గిరిజన, మైనారిటీ, విద్యార్థి, ప్రజా సంఘాలతోపాటు మావోయిస్ట్ పార్టీ కూడా మద్ధతును ప్రకటించాయి.

బంద్ తో రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. బస్సులు రోడ్లపైకి రాకుండా బీసీ సంఘాల నాయకులేగాక, రాజకీయ పక్షాల నేతలు బస్ డిపోల ముందు బైఠాయించారు. పలు పార్టీల నాయకులు రోడ్లపైకి వచ్చి వాహనాల రాకపోకలను అడ్డుకుంటున్నారు. అనేకచోట్ల ఆఫీసులకు సెలవులు ప్రకటించారు. మరికొన్ని సంస్థలు వర్క్ ఫ్రం హోం వెసులుబాటును కల్పించాయి. కాగా బంద్ శాంతియుతంగా నిర్వహించుకోవాలని డీజీపీ శివధర్ రెడ్డి సూచించారు. అవాంఛనీయ ఘటనలకు పాల్పడితే ఉపేక్షించేది లేదని ఆయన హెచ్చరించారు. ఇదే అంశంపై అన్ని జిల్లాల పోలీస్ యంత్రాంగానికి ఆదేశాలు జారీ చేశారు.

Popular Articles