ఖమ్మం: కాంగ్రెస్ ప్రభుత్వంలో, సీఎం రేవంత్ రెడ్డి పాలనలో తెలంగాణాలో కొనసాగుతున్నది ప్రజా పాలనే కదా? గత ప్రభుత్వంలో ఎదురైన అనేక చేదు అనుభవాల నుంచి అన్నివర్గాలకు స్వేచ్ఛ లభించిందనే కదా పాలకులు పదే పదే చెబుతున్నది? ప్రజాస్వామ్యయుతంగా ధర్నాలు, రాస్తారోకోలు చేసుకునే హక్కు లభించిందనే కదా ప్రజా సమస్యలపై పోరాటం చేసే పార్టీలు భావిస్తున్నది? బీఆర్ఎస్ పాలనలో స్వేచ్ఛగా ఫోన్ మాట్లాడుకునే స్వేచ్ఛ కూడా లేదని, తమ ప్రభుత్వ హయాంలో అటువంటి దుస్థితి లేకుండా చేశామనే కదా సీఎం రేవంత్ రెడ్డి అనేక సందర్భాల్లో, సభల్లో చెబుతున్నది? ఎందుకీ ప్రశ్నలు.. ఏంటి అసలు విషయం అనుకుంటున్నారా? అయితే దిగవన గల ఈ సర్క్యులర్ ను ఓసారి క్షుణ్ణంగా చదవండి..
తెలంగాణా ఆయిల్ ఫెడ్ మేనేజింగ్ డైరెక్టర్ వారు జారీ చేసిన సర్య్కులర్ ఇది. సారు ఏమంటున్నారంటే..? అనధికార వ్యక్తులుగాని, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాకు చెందిన వ్యక్తులుగాని టీజీ ఆయిల్ ఫెడ్ సంస్థకు చెందిన నర్సరీల్లోకిగాని, ఫ్యాక్టరీల్లోకిగాని, ఓపీఎస్ సంస్థల్లోకిగాని ప్రవేశించరాదన్నది సర్క్యులర్ లోని ఆదేశపు సారాంశం. ఒకవేళ ఆయా నర్సరీల్లోకిగాని, ఫ్యాక్టరీల్లోకి గాని, ఓపీఎస్ ప్రాంతాల్లోకిగాని వెళ్లాలని భావించేవారు ఆయిల్ ఫెడ్ సంస్థకు చెందిన ఉన్నత అధికారుల నుంచి అనుమతి తీసుకుని మరీ వెళ్లాలట. అంటే అశ్వారావుపేట స్థానిక విలేకరులే కాదు మరెక్కడివారయినా ఆయిల్ పామ్ గురించి వార్తల కవరేజీ కోసం సమాచారం సేకరించాలన్నా, ఫొటోలు తీసుకోవాలన్నా హైదరాబాద్ లో గల ఆయిల్ ఫెడ్ పెద్దసార్ల నుంచి అనుమతి తీసుకోవాలన్నమాట.

అనధికార వ్యక్తులు, మీడియా ప్రతినిధులు అనుమతి లేకుండా రావడం వల్ల ఆయా సంస్థల దినసరి కార్యకలాపాలకు అసౌకర్యం కలుగుతోందట. అందువల్ల సర్క్యులర్ లోని ఆదేశాలను తు.ఛ. తప్పకుండా పాటించాలని అప్పారావుపేట, అశ్వారావుపేట, నర్మెట్ట కేంద్రాల్లోని ఆయిల్ ఫెడ్ సంస్థల మేనేజర్లకు, జిల్లా ఇంఛార్జిలకు, ఓపీఎస్ హైదరాబాద్ వ్యవస్థకు సదరు సర్క్యులర్ ద్వారా నిర్దేశించారు. ఇందుకు విరుద్ధంగా జరిగితే సంబంధిత అధికారులపై క్రమశిక్షణా చర్యలు తీసుకుంటామని కూడా సర్క్యులర్ లో హెచ్చరించారు.
ఆయిల్ ఫెడ్ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ పేరుతో ఈనెల 4వ తేదీన జారీ అయిన ఈ సర్క్యులర్ ఆయిల్ పామ్ రైతాంగం నుంచి తీవ్ర విమర్శలకు తావు కల్పిస్తోంది. రైతుల భాగస్వామ్యంతో కూడిన సంస్థలో ఇటువంటి నియంతృత్వపు ఆదేశాలేమిటనే ప్రశ్నలు భిన్న వర్గాల నుంచి రేకెత్తుతున్నాయి. సర్క్యులర్ జారీ ద్వారా ఆంక్షలు విధిస్తున్నారంటే అక్కడేదో జరుగుతోందనే అనుమానాలను రైతాంగ వర్గాలు వ్యక్తం చేస్తున్నాయి. సాధారణంగా ఇటువంటి సర్క్యులర్లను వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు మాత్రం అంగీకరించరు. ఎందుకంటే ఆయిల్ పామ్ వ్యవస్థ ఆయన మంత్రిత్వ శాఖ పరిధిలోకే వస్తుంది. బహుషా ఆయనకు తెలియకుండా ఈ సర్క్యులర్ జారీ చేసి ఉంటారనే వాదన వినిపిస్తోంది.
మొత్తంగా ఇప్పుడీ సర్క్యులర్ ఆయిల్ ఫెడ్ సంస్థకు చెందిన వ్యవస్థల్లోని కార్యకలాపాలపై అనేక ప్రశ్నలను, సందేహాలను రేకెత్తిస్తోంది. అందువల్ల ఈ సర్య్కులర్ జారీ వెనుక అసలు ‘కత’ ఏమిటో? దీన్ని జారీ చేయడానికి వెనుక గల బలీయమైన బాగోతమేంటో? అందుకు బాధ్యులెవరో? ఇటువంటి సర్క్యులర్ ను జారీ చేయాలని ఆదేశాలిచ్చిందెవరో? తేల్చాలని ఆయిల్ పామ్ రైతాంగ వర్గాలు ‘ప్రజా’ ప్రభుత్వాన్ని కోరుతున్నాయి. చూడాలి ‘ప్రజా పాలన’ ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుందో!