Top 5 This Week

Related Posts

ఏపీలో జిల్లాల పునర్విభజన: అమిత్ షాకు తుమ్మల కీలక లేఖ

హైదరాబాద్: కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు తెలంగాణా వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు కీలక లేక రాశారు. లేఖ ప్రతిని ఏపీ సీఎం చంద్రబాబునాయుడికి కూడా పంపారు. ఆంధ్రప్రదేశ్ లో జిల్లాల పునర్విభజన జరుగుతున్న నేపథ్యంలో మంత్రి తుమ్మల ఈ లేఖ రాయడం విశేషం. ప్రస్తుతం ఏపీలో గల భద్రాచలం పరిసరాల్లోని ఐదు గ్రామాలను తెలంగాణ రాష్ట్రంలో కలపాలని ఆయన కోరారు. ఏపీలో ఉన్నటువంటి ఐదు గ్రామాల ప్రజల తీరని వేతలు తీర్చేలా ప్రత్యేక చొరవ చూపాలని మంత్రి తుమ్మల అమిత్ షాను కోరారు. భద్రాచలం పట్టణాన్ని ఆనుకుని ఉన్న యటపాక, కన్నాయిగూడెం, పిచుకలపాడు, పురుషోత్తపట్నం, గుండాల గ్రామ పంచాయతీలను తిరిగి తెలంగాణ రాష్ట్రంలో కలిపే అంశాన్ని పరిశీలించాలని తుమ్మల నాగేశ్వరరావు కోరారు.

ఈ సందర్భంగా ఆయన భద్రాచలం చారిత్రక అనుబంధాన్ని, గిరిజనుల కష్టాలను, అంతర్రాష్ట్ర తనిఖీలను, తీవ్రవాద ప్రభావిత ప్రాంతం, సమన్వయలోపం, రాములోరి భూముల అంశాలను మంత్రి తుమ్మల తన లేఖలో ప్రస్తావించారు. భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయం తెలంగాణలో ఉండగా, అనుబంధ ఆలయ ఆస్తులు, భూములు పురుషోత్తపట్నం ఆంధ్రప్రదేశ్ లో ఉండటం వల్ల రికార్డులు, పరిపాలన, అభివృద్ధి ప్రణాళికల్లో చిక్కులు ఎదురవుతున్నాయని తుమ్మల పేర్కొన్నారు. అదేవిధంగా డంపింగ్‌ యార్డ్‌, ఇతర దేవాలయ అవసరాల కోసం భూములు అందుబాటులో లేక తీవ్ర ఇబ్బందులు ఉన్నాయని వివరించారు. ప్రస్తుతం భద్రాచలం పట్టణం మాత్రమే ఇక్కడ ఉందని ఐదు గ్రామాలను తెలంగాణలో కలిపి భద్రాచలానికి అనుసంధానం చేస్తే భద్రాద్రి రామయ్య ఆలయం అభివృద్ధి, గిరిజన సాంప్రదాయ చారిత్రాత్మక వైభవం అలారారుతుందన్నారు.

ఇది ప్రజల దశాబ్దాల డిమాండ్ గా పేర్కొంటూ, రాజకీయ కోణం కాదని తుమ్మల స్పష్టం చేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతున్న జిల్లా సరిహద్దుల పునర్విభజన ప్రక్రియను దృష్టిలో ఉంచుకుని, ఈ ఐదు గ్రామాలను ఆంధ్రప్రదేశ్ నుంచి మినహాయించాలన్నారు. కేంద్ర ప్రభుత్వం సహకారంతో వాటిని తెలంగాణకు పునరుద్ధరించే అంశాన్ని పరిశీలించాలని తుమ్మల తన లేఖలో కోరారు. దశాబ్ద కాలంగా తెలంగాణ లోని భద్రాచలం ఐదు పరిసర గ్రామాల ప్రజలు ఆకాంక్ష నెరవేర్చేలా అటు కేంద్ర ప్రభుత్వం, ఇటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పెద్ద మనసుతో అంగీకరించాలని మంత్రి తుమ్మల అభ్యర్థించారు. రెండు రాష్ట్రాల కలసి పని చేసే భావంతో ఈ అంశం పరిష్కార దిశగా అడుగులు పడతాయని తుమ్మల ఆశాభావం వ్యక్తం చేశారు. మంత్రి తుమ్మల ఏపీ సీఎం చంద్రబాబుకు కూడా పంపిన లేఖను దిగువన గల పీడీఎఫ్ లో చదవవచ్చు.

Popular Articles