అమరావతి: ఏపీ సీఎం చంద్రబాబుతో తెలంగాణా వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా పలు అంశాలను తుమ్మల సీఎం చంద్రబాబు ముందుంచారు. తెలంగాణాకు చెందిన భక్తుల కోసం తిరుమలలో స్థలం కేటాయింపు సహా జాతీయ రహదారులు, పెదవాగు ప్రాజెక్టు, ఏపీలో విలీనమైన తెలంగాణా గ్రామాలు తదితర అంశాలను పరిష్కరించాలని తుమ్మల కోరారు. ఈ సందర్భంగా మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు చంద్రబాబుకు నివేదించిన విజ్ఞప్తుల వివరాలను పరిశీలిస్తే..
- రాష్ట్ర పునర్విభనలో భద్రాచలం మండలానికి ఆనుకుని ఉన్న అయిదు గ్రామపంచాయతీలను తెలంగాణలో విలీనం చేయాల్సిన అవసరం ఉందని మంత్రి తుమ్మల వివరించారు. ఎటపాక, కన్నాయిగూడెం, పిచ్చికలపాడు, పురుషోత్తపట్నం, గుండాల గ్రామపంచాయతీలు భౌగోళికంగా తెలంగాణ ప్రాంతాల మధ్యలో ఉండటం వల్ల ప్రజలు పరిపాలనాపరంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లారు.
- ఈ గ్రామాలు గోదావరి నది, అటవీ ప్రాంతాల మధ్య ఉండటంతో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఎంక్లేవ్‌లా మారిపోయాయని అన్నారు. జిల్లా కేంద్రాలకు చేరుకోవడానికి ప్రజలు దాదాపు 8 గంటలు ప్రయాణించాల్సి వస్తోందని మంత్రి పేర్కొన్నారు. అంతర్రాష్ట్ర చెక్‌పోస్టులు, పన్నులు, పరిపాలనా అనుసంధానం లోపం, భద్రతా సమస్యలు వంటి అంశాలు స్థానిక గిరిజన ప్రజల జీవన విధానాన్ని ప్రభావితం చేస్తున్నాయని వివరించారు.
- భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి దేవాలయానికి సంబంధించిన భూభాగాల్లో కొంత భాగం ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ పరిధిలో ఉందన్నారు. దీనివల్ల దేవస్థానం పరిపాలనలో ఇబ్బందులు ఎదురవుతున్నాయన్నార. భక్తులకు మెరుగైన సేవలు అందించాలంటే ఈ గ్రామాల విలీనం అవసరమని మంత్రి అభిప్రాయపడ్డారు. గిరిజన ప్రాంతాల అభివృద్ధి, పరిపాలనా సౌలభ్యం దృష్ట్యా ఈ చర్య కీలకమని తెలిపారు.
- అదే విధంగా ఖమ్మం జిల్లాలోని పెద్దవాగు సాగునీటి ప్రాజెక్ట్ శాశ్వత మరమ్మత్తులు అత్యవసరంగా చేపట్టాల్సిన అవసరం ఉందని మంత్రి పేర్కొన్నారు. ఈ ప్రాజెక్ట్ ద్వారా మొత్తం 16,000 ఎకరాలకు సాగునీరు అందుతుండగా, అందులో సుమారు 13,640 ఎకరాలు (85.25%) ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, 2,360 ఎకరాలు (14.75%) తెలంగాణ రాష్ట్రంలో ఉన్నాయని తెలిపారు.
- ప్రాజెక్ట్ శాశ్వత పునరుద్ధరణకు సుమారు రూ. 92.20 కోట్ల వ్యయం అంచనా వేశారన్నారు. రెండు రాష్ట్రాలకు లబ్ధి చేకూరుతున్న నేపథ్యంలో ఖర్చును 85:15 నిష్పత్తిలో భరించేలా చర్యలు తీసుకోవాలన్నారు. రైతుల సాగు, జీవనాధారం ఈ ప్రాజెక్ట్‌పై ఆధారపడి ఉన్నందున తక్షణ ఆర్థిక సహకారం అందించాలని విజ్ఞప్తి చేశారు.
- ఇటీవల ఆంధ్రప్రదేశ్ పరిధిలో గోదావరి వరద రక్షణ కరకట్టలోని 3వ స్లూయిస్ వద్ద గోడ దెబ్బతిన్న విషయం కూడా మంత్రి ప్రస్తావించారు. భద్రాచలం పట్టణాన్ని వరదల నుంచి రక్షించేందుకు నిర్మించిన ఈ రక్షణ గోడలో జరిగిన ఈ నష్టం భవిష్యత్తులో భారీ ప్రమాదానికి దారితీయొచ్చని పేర్కొన్నారు. కరకట్టలోని ఆ భాగం విభజన అనంతరం ఆంధ్రప్రదేశ్ పరిధిలోకి వెళ్లడంతో నిర్వహణలో సమస్యలు ఏర్పడ్డాయని తెలిపారు.
- ఈ విషయాన్ని ఇప్పటికే తెలంగాణా అధికారులు ఆంధ్రప్రదేశ్ ఇరిగేషన్ శాఖ దృష్టికి తీసుకెళ్లినప్పటికీ, ఇప్పటివరకు తగిన చర్యలు తీసుకోలేదన్నారు. తక్షణ సాంకేతిక పరిశీలన చేసి తాత్కాలిక రక్షణ చర్యలు చేపట్టడంతో పాటు, రెండు రాష్ట్రాల సమన్వయంతో శాశ్వత పునరుద్ధరణ చర్యలు ప్రారంభించాలని కోరారు. ప్రజల ప్రాణ భద్రత దృష్ట్యా వెంటనే చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
- ఖమ్మం పట్టణంలో శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయ నిర్మాణానికి అవసరమైన భూమి గుర్తింపు పూర్తైందని నివేదించారు. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో పనులు ప్రారంభించేందుకు అనుమతి ఇవ్వాలని మంత్రి కోరారు. స్థానిక భక్తుల దీర్ఘకాలిక ఆశయాన్ని నెరవేర్చే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని అభ్యర్థించారు.
- అదేవిధంగా తిరుమలలో తెలంగాణ భక్తుల కోసం ప్రత్యేక యాత్రికుల భవనం నిర్మాణానికి సుమారు 5 ఎకరాల భూమి కేటాయించాలని మంత్రి ప్రతిపాదించారు. పండుగలు, ప్రత్యేక సందర్భాల్లో వసతి కొరతను తగ్గించి భక్తులకు సౌకర్యవంతమైన దర్శన అనుభవం కల్పించేందుకు ఈ ప్రాజెక్ట్ ఉపయోగపడుతుందని మంత్రి తుమ్మల తెలిపారు.
- రెండు రాష్ట్రాల మధ్య పరస్పర సహకారం, సమన్వయం పెంపొందిస్తే సాగునీరు, గిరిజన ప్రాంతాల అభివృద్ధి, భక్తుల సౌకర్యాలు, మౌలిక వసతుల విస్తరణలో వేగవంతమైన పురోగతి సాధ్యమవుతుందని పేర్కొన్నారు. సత్తుపల్లి-కొవ్వూరు రైల్వే లైన్, పెనుబల్లి-అమరావతి రైల్వే లైన్ నిర్మాణానికి సహకరించాలని కోరారు. ఈ ప్రతిపాదనలపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సానుకూలంగా స్పందించి తక్షణ చర్యలు తీసుకుంటుందనే ఆశాభావాన్ని మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు వ్యక్తం చేశారు.

