ఛత్తీస్ గఢ్ అడవుల్లో మావోయిస్టుల వేటలో భాగంగా సాగుతున్న ఆపరేషన్ కగార్ పై మంత్రి సీతక్క స్పందించారు. ఆదివాసీల ప్రయోజనాల దృష్టిలో ఆపరేషన్ కగార్ ను తక్షణం నిలిపివేయాలని ఆమె డిమాండ్ చేశారు. శాంతియుత వాతావరణం నెలకొల్పడమే ప్రభుత్వాల లక్ష్యం గా ఉండాలన్నారు. తెలంగాణ, చత్తీస్ ఘడ్ సరిహద్దుల్లో శాంతియుత వాతావరణం నెలకొనాలని ఆమె ఆకాంక్షించారు.
మధ్య భారతంలోని ఆదివాసీ ప్రాంతాలు రాజ్యాంగంలోని షెడ్యూల్ 5 పరిధిలోకి వస్తాయని, అక్కడ ఆదివాసీలకు ప్రత్యేక హక్కులుంటాయని, ఆదివాసీ ప్రాంతాల్లో ప్రత్యేక పరిపాలన విధానాలు ఉంటాయన్నారు. అందుకే ప్రభుత్వాలు రాజ్యాంగబద్ధంగా వ్యవహరించి వారి శాంతియుత జీవన విధానానికి ఎలాంటి ఆటంకాలు లేకుండా చూడాలన్నారు. ప్రభుత్వాలు రాజ్యాంగానికి లోబడే వ్యవహరించాలని, బల ప్రయోగంతో కాకుండా, చర్చల ద్వారా సమస్య పరిష్కారం జరిగేలా కేంద్ర ప్రభుత్వం వ్యవహరించాలని ఆదివాసి బిడ్డగా కోరుకుంటున్నట్లు సీతక్క చెప్పారు.

ఆదివాసీల హక్కులను ఎవరూ కాలరాయవద్దని, ఆ జాతి బిడ్డగా ఆది వాసులకు అండగా నిలుస్తానని చెప్పారు. ఆపరేషన్ కగార్ తో ఆదివాసీలు తీవ్ర భయాందోళనతో ఉన్నారని, మావోయిస్టుల శాంతి చర్చల ప్రతిపాదనకు కేంద్రం సానుకూలంగా స్పందించాలని, రెండు వైపుల ప్రాణ నష్ట నివారణకు శాంతి చర్చలు మార్గం చూపుతాయని సీతక్క అభిప్రాయపడ్డారు.
