తెలంగాణా రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మరో ఇంటి నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లి నియోజకవర్గంలోని కల్లూరు మండలంలోని తన స్వగ్రామమైన నారాయణపురంలో మంత్రి ఈసారి కొత్త ఇంటి నిర్మాణానికి ఉపక్రమించడం విశేషం. ఈమేరకు నూతన గృహనిర్మాణానికి మంత్రి సతీమణి పొంగులేటి మాధురి, ఆయన సోదరుడు ప్రసాదరెడ్డి-శ్రీలక్ష్మి దంపతులు గురువారం శంకుస్థాపన చేశారు.

ఖమ్మం నగరంలోని శ్రీనగర్ కాలనీలో మంత్రి పొంగులేటి గతంలోనే విశాలమైన ఇంటిని నిర్మించుకున్నారు. ప్రస్తుతం ఈ నివాసం మంత్రి వ్యక్తిగత క్యాంపు కార్యాలయంగా మారింది. దాదాపు ఏడాదిన్నర క్రితం హైదరాబాద్ హిమాయత్ సాగర్ ప్రాంతంలో మంత్రి పొంగులేటి సోదరులు విశాల విస్తీర్ణంలో చెరొకటి చొప్పున నివాస గృహాలు నిర్మించుకున్నారు. తాజాగా తన స్వగ్రామమైన కల్లూరులో మంత్రి పొంగులేటి కుటుంబం మరో ఇంటి నిర్మాణానికి శ్రీకాం చుట్టడం విశేషం. భవిష్యత్ అవసరాల కోసం ఈ ఇల్లు నిర్మిస్తున్నట్లు మంత్రి అభిమానులు భావిస్తున్నారు.