Sunday, August 31, 2025

Top 5 This Week

Related Posts

చంద్రబాబుకు మంత్రి సురేఖ వినతి

దేవుని భూములు కబ్జాచేసేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ హెచ్చరించారు. భద్రాచలం రామాలయ ఈవో రమాదేవిపై భూ ఆక్రమణదారులు దాడి చేసిన ఘటనపై మంత్రి కొండా సురేఖ స్పందించారు. దేవాలయాల ఈవోలపై దాడులు చేస్తే ఊరుకునేది లేదన్నారు. దేవుని భూములు కబ్జా చేస్తే పీడీ యాక్ట్ నమోదు చేసి జైలుకు పంపిస్తామని హెచ్చరించారు. భద్రాద్రి రాముని ఆలయ భూముల సమస్యను పరిష్కరించాలని మంత్రి కొండా సురేఖ ఈ సందర్భంగా ఏపీ సీఎం చంద్రబాబును కోరారు. ఈ విష‌యంలో ఏపీ ప్ర‌భుత్వం, ఆ రాష్ట్ర ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు ప్ర‌త్యేక చొర‌వ తీసుకుని స‌మ‌స్య‌ను ప‌రిష్కారం చేయాల‌ని సురేఖ అభ్య‌ర్థించారు.

మంగళవారం జరిగిన ఘటనలో భద్రాచలం ఆలయ ఈవో రమాదేవిపై ఏపీలోని పురుషోత్తమపట్నం ప్రాంతానికి చెందిన ప్రజలు దాడికి పాల్పడ్డారు. భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామికి పురుషోత్తపట్నంలో భూములున్న విషయం విదితమే. ఆ భూమిలో అనుమతి లేకుండా భవన నిర్మాణ పనులు చేపడుతుండటంతో భ‌ద్రాచ‌లం ఆలయ సిబ్బంది ఆక్రమణలను అడ్డుకునే క్రమంలో ఆ గ్రామస్థులతో త‌ర‌చూ ఘర్షణలు జరుగుతున్నాయి. ఏపీలోనేగాక తెలంగాణలోనూ భద్రాద్రి రాముడికి సుమారు 1,300 ఎకరాల భూములున్నాయి. అందులో అల్లూరి సీతారామరాజు జిల్లా ఎటపాక మండలం పురుషోత్తపట్నంలోనే గరిష్ఠంగా 889.5 ఎకరాలు ఉంది.

ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఈవో రమాదేవిని పరామర్శిస్తున్న భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు

అయితే పురుషోత్తపట్నంలోని భూమి ఎక్కువ భాగం దురాక్రమణకు గురైంది. కోర్టు తీర్పు ప్రకారం ఈ భూమిపై దేవస్థానానికి సర్క హక్కులు లభించినప్పటికీ, వీటిని పురుషోత్తపట్నం వాసులు పరిగణనలోకి తీసుకోవడం లేదు. పురుషోత్తపట్నంలోకి ప్రవేశించే మార్గంలో పిల్లర్లతో నిర్మాణ పనులు చేపడుతున్నారనే సమాచారం అందుకున్న ఆలయ ఈవో, సిబ్బంది మంగళవారం అక్కడికి చేరుకున్నారు. అనుమతి లేకుండా ఇళ్ల నిర్మాణం చేయవద్దని, ఇది పూర్తిగా రాముడి భూమి అని వివరించారు. కోర్టు తీర్పులతో దేవుడి పేరిట పట్టాదారు పాసు పుస్తకాలు ఉన్నాయని కూడా పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఈవో అభ్యంత‌రాలు విన‌కుండా స్థానికులు ఆమెపై దాడికి పాల్పడ్డారు. దీంతో ఆమె సృహా కోల్పోయిన ప‌రిస్థితిలో భద్రాచల ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

Popular Articles