Sunday, August 31, 2025

Top 5 This Week

Related Posts

క‌రోనా కథ ముగిసినట్లే : మంత్రి ఎర్రబెల్లి

కరోనా వైరస్ పై మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. క‌రోనా దాదాపు త‌గ్గిందని, అతి త‌క్కువ‌గా కేసులు న‌మోద‌వుతున్నాయని, పెద్ద‌గా ఆందోళ‌న చెందాల్సిన ప‌నిలేదని, కరోనా సోకిన నిరుపేద‌ల‌ను ప్రభుత్వం ఆదుకుంటున్నదని ఆయన క‌రోనా బాధితుల‌కు భ‌రోసానిచ్చారు.

పాలకుర్తి నియోజకవర్గ కేంద్రంలో శుక్రవారం బతుకమ్మ చీరలను పంపిణీ చేసిన మంత్రి మాట్లాడుతూ, పండగ పూట ఆడబిడ్డలకు బతుకమ్మ చీరెలు పంపిణీ చేయడం ఆనందంగా ఉందన్నారు. అలాగే వైర‌స్ తీవ్ర‌త కూడా అంత‌గా లేదనీ, ప్రజలంతా భయపడాల్సిన పనిలేదన్నారు. అదే సమయంలో సామాజిక దూరం, మాస్కులు ధ‌రిస్తూ, క‌రోనాని జ‌యించ‌వ‌చ్చ‌ని మంత్రి ధైర్యాన్ని చెప్పారు. క‌రోనా బాధితుల‌తో మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు టెలీ కాన్ఫ‌రెన్స్ నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా మంత్రి ఒక్కో క‌రోనా పేషంట్ తో, వారి కుటుంబ స‌భ్యుల‌తో స్వ‌యంగా మాట్లాడారు. వారి యోగ క్షేమాలు అడిగి తెలుసుకున్నారు.

క‌రోనా పాజిటివ్ వ‌చ్చిన ‌వాళ్ళంతా ఇంట్లోనే క్వారంటైన్ అయ్యార‌ని, ఎవ‌రూ సీరియ‌స్ గా లేర‌ని, దీన్ని బట్టి క‌రోనా తీవ్ర‌త త‌గ్గింద‌నే విష‌యం అర్థ‌మ‌వుతున్న‌ద‌న్నారు. ప్ర‌జ‌లు మ‌రికొంత‌కాలం అప్ర‌మ‌త్తంగా ఉంటే స‌రిపోతుంద‌ని మంత్రి అన్నారు. అధికారులు, డాక్ట‌ర్లు క‌రోనా పాజిటివ్ కేసులు అధికంగా ఉన్న గ్రామాల‌పై దృష్టి సారించాల‌ని చెప్పారు. స్థానిక‌ ప్ర‌జాప్ర‌తినిధులు ప్ర‌తి రోజూ క‌రోనా బాధితుల‌తో, వారి కుటుంబ స‌భ్యుల‌తో మాట్లాడాల‌ని, వారికి ధైర్యం చెప్ప‌డమేగాక‌, నిరుపేద‌ల‌కు నిత్యావ‌స‌ర స‌రుకులు పంపిణీ చేసి, ఆదుకోవాల‌ని మంత్రి ఎర్ర‌బెల్లి ఆదేశించారు.

ఇదిలా ఉండగా దేశవ్యాప్తంగా కరోనా ఉద్ధృతి కొనసాగుతోంది. గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా 11,68,705 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా, 70,496 కేసులు వెలుగులోకి వచ్చాయి. దీంతో దేశవ్యాప్తంగా మొత్తం కేసుల సంఖ్య 59,06,151 కి చేరింది. వీరిలో 8,93,592 మంది వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతుండగా, 59,06,069 మంది కోలుకుని ఇళ్లకు చేరుకున్నారు. ఇక కొత్తగా 964 మంది కరోనా మహమ్మారికి బలయ్యారు. దీంతో ఇప్పటి వరకు కరోనా బారిన పడి మరణించిన వారి సంఖ్య 1,06,490కి పెరిగింది. ఇక దేశవ్యాప్తంగా రికవరీ రేటు 85.52 శాతంగా ఉండగా, మరణాల రేటు 1.54 శాతంగా ఉండడం గమనార్హం.

ఫొటో: పాలకుర్తిలో బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమంలో మాట్లాడుతున్న మంత్రి దయాకర్ రావు

Popular Articles