ఛత్తీస్ గఢ్ లో మరో ఎన్కౌంటర్ ఘటన చోటు చేసుకుంది. ఇంకో కీలక మావోయిస్టు నేత మృతి చెందారు. బీజాపూర్ జిల్లా నేషనల్ పార్క్ అటవీ ప్రాంతంలో భద్రతా బలగాలకు, మావోయిస్ట్ పార్టీ నక్సలైట్లకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో ఆ పార్టీ తెలంగాణా రాష్ట్ర కమిటీ సభ్యుడు మైలారపు ఆడెల్లు అలియాస్ భాస్కర్ ప్రాణాలు కోల్పోయారు. ఆదిలాబాద్ జిల్లా బోథ్ మండలం పోచెరకు చెందిన భాస్కర్ 1995 నుంచి అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. తెలంగాణాలో మావోయిస్ట్ పార్టీకి పునరుజ్జీవం పోసేందుకు భాస్కర్ పలు ప్రయత్నాలు చేయడం గమనార్హం. అయితే భాస్కర్ యత్నాలను తెలంగాణా పోలీసులు ఎప్పటికప్పుడు నిలువరించారు. ఎన్కౌంటర్ ఘటనా స్థలంలో ఏకే-47 ఆయుధాన్ని భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నట్లు ఛత్తీస్ గఢ్ పోలీసులు ప్రకటించారు.
కాగా నిన్న జరిగిన ఎన్కౌంటర్ లో మావోయిస్ట్ పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు సుధాకర్ మృతి చెందిన సంగతి తెలిసిందే. అంతకు ముందు గత నెల 21వ తేదీన జరిగిన మరో భారీ ఎన్కౌంటర్ ఘటనలో మావోయిస్ట్ పార్టీ కేంద్ర కమిటీ కార్యదర్శి నంబాల కేశవరావు మరణించారు. గడచిన 17 రోజుల వ్యవధిలోనే ముగ్గురు ముఖ్యనేతలు ఎన్కౌంటర్ లో మృతి చెందిన ఘటనలు ఆ పార్టీకి భారీ నష్టంగా విప్లవ కార్యకలాపాల పరిశీలకులు భావిస్తున్నారు.

