Top 5 This Week

Related Posts

దిల్ సుఖ్ నగర్ పేలుళ్ల కేసు: హైకోర్టు కీలక తీర్పు

హైదరాబాద్ లోని దిల్ సుఖ్ నగర్ జంట పేలుళ్ల కేసులో తెలంగాణా హైకోర్టు మంగళవారం కీలక తీర్పునిచ్చింది. ఈ కేసులో దోషులకు ఎన్ఐఏ విధించిన ఉరిశిక్ష తీర్పును హైకోర్టు సమర్ధించింది. తమకు ఎన్ఐఏ కోర్టు విధించిన ఉరిశిక్షను రద్దు చేయాలంటూ ఐదుగురు దోషులు చేసుకున్న అప్పీళ్లను హైకోర్టు డిస్మిస్ చేసింది.

దిల్ సుఖ్ నగర్ బస్ స్టాపులో, మిర్చి పాయింట్ వద్ద 2013 ఫిబ్రవరి 21వ తేదీన జరిగిన జంట పేలుళ్ల ఘటనలో 18 మంది ప్రాణాలు కోల్పోగా, 131 మంది గాయపడ్డారు. ఈ పేలుళ్ల కేసులో దోషిగా తేలిన ప్రధాన నిందితుడు మహ్మద్ రియాజ్ అలియాస్ రియాజ్ భత్కల్ పరారీలో ఉన్నాడు. మిగతా ఐదుగురు నిందితులు కేసు విచారణలో దోషులుగా తేలడంతో వారికి ఉరిశిక్షను విధిస్తూ 2016 డిసెంబర్ 13వ తేదీన ఎన్ఐఏ కోర్టు సంచలన తీర్పునిచ్చింది.

ఉరిశిక్ష ధ్రువీకరణ కోసం ఎన్ఐఏ కోర్టు తన తీర్పును హైకోర్టుకు సమర్పించింది. అయితే ఎన్ఐఏ కోర్టు తీర్పులో ఉరిశిక్ష పడిన దోషులు అసదుల్లా అఖ్తర్ అలియాస్ హద్ది, జియా ఉర్ రహ్మాన్ అలియాస్ వఘాస్, మహ్మద్ తహసీన్ అఖ్తర్ అలియాస్ హసన్, యాసిన్ భత్కల్ అలియాస్ షారూఖ్, అజీజ్ షేక్ అలియాస్ సమర్ ఆర్మార్ తుండెలు దిగువ కోర్టు ఇచ్చిన తీర్పును రద్దు చేయాలని అప్పీల్ చేసుకున్నారు.

వీటిని 45 రోజులపాటు సుదీర్ఘ విచారణ జరిపిన జస్టిస్ కె. లక్ష్మణ్, జస్టిస్ శ్రీసుధలతో కూడిన హైకోర్టు ధర్మాసనం తీర్పును వాయిదా వేసింది. మంగళవారం ఎన్ఐఏ కోర్టు తీర్పును సమర్ధిస్తూ హైకోర్టు కీలక తీర్పును వెలువరించింది. దిల్ సుఖ్ నగర్ జంట పేలుళ్ల ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే.

Popular Articles