Friday, October 17, 2025

Top 5 This Week

Related Posts

తెలంగాణాలో స్థానిక సంస్థల ఎన్నికలపై హైకోర్టు స్టే

హైదరాబాద్: స్థానిక సంస్థల ఎన్నికలపై తెలంగాణా హైకోర్టు స్టే విధించింది. ఎన్నికల నిర్వహణకు విడుదలైన నోటిఫికేషన్ పైనా హైకోర్టు స్టే ఇవ్వడం గమనార్హం. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ తెలంగాణ ప్రభుత్వం జారీ చేసిన జీవో నెం. 9పై హైకోర్టు స్టే ఇచ్చింది. ఈ అంశంలో హైకోర్టులో రెండు రోజులపాటు విచారణ జరిగింది. జీవో అమలును నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వులను హైకోర్టు జారీ చేసింది. నాలుగు వారాల్లోగా కౌంటర్‌ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశిస్తూనే, సర్కారు కౌంటర్లపై అభ్యంతరాల దాఖలుకు పిటిషనర్లకు రెండు వారాల గడువును విధించింది. తదుపరి విచారణను ఆరు వారాలకు వాయిదా వేసింది. ఈ నేపథ్యంలో తెలంగాణాలో స్థానిక ఎన్నికల ప్రక్రియ ఆరు వారాలపాటు నిలిచిపోనున్నది.

కాగా తమకు న్యాయం కావాలంటూ హైకోర్టు గేటు బయట బీసీ సంఘాలు నిరసనకు దిగాయి. బీజేపీ, బీఆర్ఎస్ కలిసి బీసీ రిజర్వేషన్లను అడ్డుకున్నాయని, కేసులు దాఖలు చేయించింది బీఆర్ఎస్ పార్టీనేనని మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. బీసీల నోటికాడి ముద్దను లాక్కున్నట్టయిందని ఆయన వ్యాఖ్యానించారు. అయితే బీసీ రిజర్వేషన్లు ప్రభుత్వ నాటకంగా బీఆర్ఎస్ నాయకుడు హరీష్ రావు ఆరోపించారు. సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికైనా డ్రామాలు ఆపాలని ఆయన అన్నారు.

Popular Articles