Monday, September 1, 2025

Top 5 This Week

Related Posts

చెల్పాక ‘ఎన్కౌంటర్’పై హైకోర్టు కీలక ఆదేశం

ఏటూరునాగారం మండలం చెల్పాకలో నిన్న జరిగిన ఎన్కౌంటర్ ఘటనకు సంబంధించి హైకోర్టు కీలక ఆదేశాలను జారీ చేసింది. ఎన్కౌంటర్ లో మరణించిన మావోయిస్టుల డెడ్ బాడీలను భద్రపరచాలని పోలీసులను ఆదేశించింది. ఈమేరకు ఈ ఎన్కౌంటర్ పై హైకోర్టులో సోమవారం విచారణ జరిగింది.

చెల్పాక ఘటనలో పోలీసులు బూటకపు ఎన్‌కౌంటర్‌ చేశారని పౌరహక్కుల సంఘం తరఫు న్యాయవాది కోర్టుకు నివేదించారు. భోజనంలో మత్తు పదార్థాలు కలిపి మావోయిస్టులను కస్టడీలోకి తీసుకున్నారని, ఆ తర్వాత చిత్రహింసలకు గురిచేసే కాల్చి చంపారని పౌరహక్కుల సంఘం తరపు న్యాయవాది హైకోర్టుకు వివరించారు. చనిపోయిన నక్సలైట్ల మృతదేహాలపై తీవ్ర గాయాలున్నాయని, మృతదేహాలను కనీసం కుటుంబ సభ్యులకు చూపించకుండా పోస్టుమార్టం కోసం తరలించారని పేర్కొన్నారు. ఈ అంశంలో ఎన్‌హెచ్‌ఆర్‌సీ నిబంధనలకు విరుద్ధంగా పోలీసులు వ్యవహరించారని పౌరహక్కుల సంఘం అడ్వకేట్ నివేదించారు.

అయితే అడవిలో పోలీసుల భద్రత దృష్ట్యా మృతదేహాలను వెంటనే ములుగు ఆస్పత్రికి తరలించామని ప్రభుత్వ న్యాయవాది కోర్టుకు నివేదించారు. కాకతీయ మెడికల్ కళాశాలకు చెందిన వైద్య నిపుణుల ఆధ్వర్యంలో పోస్టుమార్టం నిర్వహించారని, పోస్టుమార్టం ప్రక్రియ యావత్తునూ వీడియో తీశారని ప్రభుత్వ న్యాయవాది పేర్కొన్నారు.

ఇరుపక్షాల వాదనలను విన్న తర్వాత హైకోర్టు పోలీసులకు కీలక ఆదేశాలిచ్చింది. మృతదేహాలను రేపటి వరకు భద్రపర్చాలని, మృతదేహాలను కుటుంబ సభ్యులకు, బంధువులకు చూపించాలని హైకోర్టు పోలీసులను ఆదేశించింది. ఈ కేసు తదుపరి విచారణను హైకోర్టు మంగళవారానికి వాయిదా వేసింది.

Popular Articles