హైదరాబాద్: వాహనాలపై గల పెండింగ్ చలాన్ల అపరాధ రుసుము వసూళ్ల తీరుపై తెలంగాణ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ విషయంలో ట్రాఫిక్ పోలీసులు బలవంతపు వసూళ్లకు దిగవద్దని హైకోర్టు ఆదేశించింది. చలాన్ల వసూళ్ల కోసం వాహనదారులను బలవంతపెట్టొద్దని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. పెండింగ్ చలాన్ల నెపంతో బైకుల తాళం చెవులు లాక్కోవడం, వాహనాలు ఆపి ఒత్తిడి చేయడం చట్టవిరుద్ధమని స్పష్టం చేసింది. చలాన్ల చెల్లింపు అనేది స్వచ్ఛందంగా ఉండాలే తప్ప బలవంతంగా వసూలు చేయరాదని హైకోర్టు ట్రాఫిక్ పోలీసులకు నిర్దేశించింది.
చలాన్లు చెల్లించనప్పుడు వాహనదారులకు నోటీసులను జారీ చేయడం మాత్రమే చట్టబద్ధ మార్గమని హైకోర్టు సూచించింది. రోడ్డుపై వాహనాలను, వాటి యజమానులను నిలిపివేసి ఇబ్బందులకు గురి చేయడం రాజ్యాంగ హక్కులకు విరుద్ధమని పేర్కొంది. ట్రాఫిక్ నిబంధనల అమలులో ప్రజల హక్కులను కాపాడాలని సూచన చేసింది. చలాన్ల వసూళ్లలో పారదర్శకత, చట్టబద్ధత తప్పనిసరిగా పేర్కొంటూ, వసూలు విధానంలో మార్పులు చేయాల్సిన పరిస్థితి ఉందని హైకోర్టు సూచించింది. ట్రాఫిక్ పోలీసులు బలవంతంగా చలాన్ల రుసుము వసూళ్లు చేస్తున్నారని దాఖలైన పిటిషన్ హైకోర్టు విచారణ జరిపింది. ఈ సందర్భంగా వాహనదారుల హక్కుల పరిరక్షణపై హైకోర్టు స్పష్టమైన సందేశం ఇచ్చింది.

