Top 5 This Week

Related Posts

ఖమ్మం నక్సల్ సంస్థపై తెలంగాణా సర్కార్ ‘ఉక్కుపాదం’

(సమీక్ష ప్రత్యేక కథనం)
ఖమ్మం జిల్లా వెలుగుమట్ల కూల్చివేతల వివాదాస్పద అంశంలో కీలకంగా వ్యవహరించిన ఓ నక్సల్ సంస్థపై ఉక్కుపాదం మోపేందుకు తెలంగాణా ప్రభుత్వం సంసిద్ధమైంది. ఈ సంస్థకు చెందిన కార్యకలాపాలపై డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు తుమ్మల నాగేశ్వర్ రావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డిలు బుధవారం బహిరంగంగానే నిప్పులు చెరిగారు. ఇటువంటి ‘మాఫియా’ ముఠాను ఉపేక్షించవద్దని డిప్యూటీ సీఎం సహా ముగ్గురు మంత్రులు ఖమ్మం పోలీస్ కమిషనర్ సునీల్ దత్ కు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు.

ఈ నేపథ్యంలోనే ఆ విప్లవ సంస్థకు చెందినవారిపై పీడీ యాక్ట్ కూడా నమోదు చేస్తామని సీపీ సునీల్ దత్ ప్రకటించడం గమనార్హం. ఈ పరిణామాల్లో వెలుగుమట్ల భూదాన్ భూముల అంశం వేదికగా వివాదాస్పదమైన UCCRI (ML) నక్సల్ సంస్థ నిర్వాహకులకు గడ్డు పరిస్థితి ఎదురైందనే చెప్పాలి. తరిమెల నాగిరెడ్డి, దేవులపల్లి వెంకటేశ్వరరావులు స్థాపించిన విప్లవ సంస్థ నుంచి ఆవిర్భవించిన ఈ సంస్థ కార్యకలాపాలపై పోలీస్ శాఖ తీవ్ర చర్యలకు ఉద్యుక్తమైనట్లుగానే భావించాలి.

వెలుగుమట్ల భూముల్లో గ్రామీణ పేదల సంఘం సభ నిర్వహించినప్పటి చిత్రం (ఫైల్)

వెలుగుమట్ల కూల్చివేతల్లో నిరాశ్రయులైన అర్హులైన పేదలకు ఇంటి నివాస స్థల పట్టాలను, ఇందిరమ్మ ఇండ్ల మంజూరు పత్రాలను డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు తుమ్మల నాగేశ్వర్ రావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డిలు బుధవారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటైన కార్యక్రమంలో మాట్లాడిన ఆయా ముఖ్యనేతలు వెలుగుమట్ల వివాదానికి కారకసంస్థగా గుర్తించిన UCCRI (ML) పార్టీపై తీవ్రస్థాయిలో విరుచుపడడం గమనార్హం. UCCRI (ML) కు అనుబంధమైన ఓపీడీఆర్, గ్రామీణ పేదల సంఘం నాయకులపై మంత్రులు పోలీసు శాఖకు కీలక ఆదేశాలు జారీ చేశారు.

డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క

డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క సమావేశంలో మాట్లాడుతూ, వెలుగుమట్లలో పేదలను బెదిరించారని, డబ్బు వసూళ్లు చేశారని, ఇల్లు ఎవరికి కేటాయిస్తున్నారో కూడా తెలియని పరిస్థితిని చవి చూపించారని అన్నారు. మాఫియాకు భయపడవద్దని బాధితులకు భట్టి హితవు చెప్పారు. ఇక్కడ నరకం చూపినవారి సమాచారం ఇవ్వాలని ఆయన వెలుగుమట్ల పేదలను కోరారు. వసూళ్లు చేసిన మాఫియా నుంచి పేదల డబ్బును రికవరీ చేయాలని కూడా డిప్యూటీ సీఎం భట్టి సీపీ సునీల్ దత్ కు సూచించారు.

వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు

మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు కార్యక్రమంలో మాట్లాడుతూ, ప్రజాప్రతినిధులను, పాత్రికేయులను లోనికి రానీయకుండా బారికేడ్లు, టోల్ గేట్లతో కలెక్టర్ ఆఫీసు పక్కనే పేదల పేరుతో దోపిడీ జరిగిందన్నారు. దౌర్జన్యపూరితంగా, అహంకారపూరితంగా ఒక సమాంతర రాజ్యాన్ని నడుపుతూ ఉంటే చూస్తూ ఉండడానికి ఇది గుడ్డి ప్రభుత్వం కాదన్నారు. ఇటువంటి దగాకోరులను బయటపెట్టడానికే మిమ్మల్ని కూడా వెలుగుమట్ల భూముల నుంచి బయటకు పంపించాల్సి వచ్చిందని, ఈ చర్య పేదలను రక్షించడానికేనని బాధితులను ఉద్దేశించి మంత్రి తుమ్మల స్పష్టం చేశారు. స్వచ్ఛమైన, స్వేచ్ఛా జీవనం కోసం ఈ చర్య అనివార్యమైందన్నారు. వెలుగుమట్లలో ఇళ్ల నిర్మాణం పూర్తయ్యే వరకు ఇటువంటి శక్తులను దూరం పెట్టాలని, వారినుంచి ఏదేని ఇబ్బంది ఎదురైతే ప్రభుత్వానికి చెప్పాలని మంత్రి తుమ్మల సూచించారు.

రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి

వెలుగుమట్ల భూముల్లో పేదలను దోచుకున్నవారిని ఉక్కుపాదంతో ఒక్క రూపాయి కూడా మిస్ కాకుండా చర్యలు తీసుకోవాలని పోలీస్ కమిషనర్ ను ఆదేశిస్తున్నట్లు మంత్రి పొంగులేటి వేదికపైనే వెల్లడించారు. పేదల కష్టాన్ని దోచుకున్నవారు ఎంత పెద్దవాడైనా సరే వదిలిపెట్టొద్దని పొంగులేటి సూచించారు. వెలుగుమట్ల స్థలాల్లో పేదలు నష్టపోయినమాట వాస్తవమని కూడా మంత్రి ఈ సందర్బంగా పేర్కొన్నారు.

ఖమ్మం పోలీస్ కమిషనర్ సునీల్ దత్

పోలీస్ కమిషనర్ సునీల్ దత్ మాట్లాడుతూ, వెలుగుమట్ల భూముల అంశంలో UCCRI (ML), ఓపిడీఆర్, గ్రామీణ పేదల సంఘానికి చెందిన వ్యక్తులు రూ. 3.00 కోట్ల వరకు వసూళ్లు చేసినట్లు ఇప్పటి వరకు జరిపిన దర్యాప్తులో తేలిందన్నారు. ఈమేరకు తమకు కొన్ని ఆధారాలు కూడా లభ్యమైనట్లు చెప్పారు. పేదల నుంచి వసూళ్లకు పాల్పడిన ఆయా సంస్థలకు చెందిన వ్యక్తుల ఆస్తులను గుర్తిస్తామని, డబ్బు ఏయే ఖాతాలకు బదిలీ అయ్యిందో కనిపెడతామని చెప్పారు. వసూళ్ల చేసిన డబ్బును వంద శాతం రికవరీ చేసి బాధితులకు న్యాయం చేస్తామన్నారు. నిందితులపై ఇప్పటికూ 26 కేసులు నమోదు చేశామని, 20 మందిని అరెస్ట్ చేశామన్నారు.

వెలుగుమట్లలో పేదలను పీడించినవారిపై చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు ప్రభుత్వం నుంచి స్పష్టమైన ఆదేశాలు ఉన్నాయని, వారిపై పీడీ యాక్ట్ కింద కూడా కేసులు నమోదు చేస్తామని సీపీ సునీల్ దత్ ప్రకటించారు. ఈ నేపథ్యంలో వెలుగుమట్ల భూదాన్ భూముల వ్యవహారంలో కీలక పాత్రను పోషించిన UCCRI (ML) సంస్థ నిర్వాహకులకు మున్ముందు గడ్డుకాలంగానే భావించవచ్చు.

Popular Articles