హైదరాబాద్: డబుల్ బెడ్ రూం, జెఎన్ఆర్ఎం తదితర పథకాల కింది ఇండ్లు పొంది, దుర్వినియోగం చేస్తున్న లబ్ధిదారులకు తెలంగాణా ప్రభుత్వం షాక్ ఇవ్వబోతోంది. ఇందులో భాగంగానే 2 BHK, జెఎన్ ఆర్.ఎమ్ తదితర పధకాల్లో ఇళ్లు పొంది వాటిలో నివసించకుండా అద్దెకు ఇస్తున్నవారికి, ఏళ్ల తరబడి తాళాలు వేసి ఖాళీగా ఉంచుతున్నవారికి అధికారులు నోటీసులు జారీ చేయనున్నారు. నోటీసులకు స్పందించనివారి ఇళ్లను రద్ధు చేసి అర్హులైన పేదలకు కేటాయించనున్నారు. నోటీసులపై స్పందించిన లబ్దిదారుల నుంచి తాము ఇక్కడే నివాసం ఉంటామని, లేదంటే కేటాయింపును రద్దు చేసే అధికారాన్ని ప్రభుత్వానికి అప్పగిస్తూ ప్రభుత్వ నిబంధనలకు ఆమోదం తెలిపేలా లబ్ధిదారుల నుంచి అండర్ టేకింగ్ లేఖను తీసుకోనున్నారు.
రాష్ట్ర సచివాలయంలో మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, అజారుద్దీన్ లతో కలిసి రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి క్యూర్ ఏరియాలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం, డబుల్ బెడ్ రూం ఇళ్ల కేటాయింపులపై కీలక సమీక్ష నిర్వహించారు. క్యూర్ (CURE) పరిధిలో మొదటి విడత ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి కార్యాచరణపైనా సమీక్ఝ జరిపారు. ఈ సమావేశంలోనే డబుల్ బెడ్ రూం, జెఎన్ఆర్ఎం తదితర పథకాల కింద ఇళ్లు పొందిన లబ్ధిదారులకు సంబంధించి ఆయా అంశాలపై కీలక నిర్ణయం తీసుకున్నారు.

అదేవిధంగా హైదరాబాద్,రంగారెడ్డి, సంగారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాల క్యూర్ ( కోర్ అర్భన్ రీజియన్ ఎకానమీ) పరిధిలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి అవసరమైన కార్యాచరణను సిద్దం చేయాలని అధికారులను ఆదేశించారు. పట్టణ ప్రాంతాల్లో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నామని, దీనికి తగ్గట్టుగా అధికారులు పనిచేయాలని మంత్రులు ఆదేశించారు. క్యూర్ పరిధిలో ఇందిరమ్మ ఇళ్లకు, అలాగే డబుల్ బెడ్ రూం ఇళ్లకు పారదర్శకంగా లబ్దిదారుల ఎంపిక ఉండాలని, ఎలాంటి రాజకీయ వత్తిళ్లకు తలోగ్గవద్దని ఈ సందర్బంగా అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.
నాలుగు జిల్లాల పరిధిలోని కాలనీల్లో ముఖ్యంగా విద్యుత్, త్రాగునీరు, డ్రైనేజ్ వంటి కనీస వసతులను తప్పని సరిగా కల్పించాలన్నారు. ఈ విషయంలో జీహెచ్ ఎంసీ సహకారాన్ని తీసుకోవాలని అధికారులకు సూచించారు. అసంపూర్తిగా ఉన్న డబుల్ బెడ్ రూమ్ టవర్లు మొత్తం పూర్తయ్యేవరకూ ఆగకుండా, పూర్తయిన వాటిని ఎప్పటికప్పుడు లబ్దిదారులకు కేటాయించాలని నిర్ణయించారు. ఈ సమావేశంలో గృహ నిర్మాణ శాఖ కార్యదర్శి, మేనేజింగ్ డైరెక్టర్ వీపీ గౌతమ్, హైదరాబాద్, రంగారెడ్డి, సంగారెడ్డి, మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లాల కలెక్టర్లు, ఇతర అధికారులు పాల్గొన్నారు.

