రైతు భరోసా పథకం దారి తప్పింది. ఫలితంగా అనేక గ్రామాల్లో రైతులు తీవ్ర నిరాశా ముఖ వదనంతో కనిపిస్తున్నారు. కర్షక కుటుంబాల బ్యాంకు ఖాతాల్లో టకీ..టకీమని గత అర్ధారాత్రి నుంచే నిధులు జమ అవుతాయని సాక్షాత్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. అయితే గత పద్ధతికి భిన్నంగా రైతు భరోసా నిధులు కొందరి ఖాతాల్లో మాత్రమే జమ అవుతున్న తీరుపై మిగతా రైతులు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు.
గత ఖరీఫ్ సీజన్ లో రైతు భరోసా నిధులకు మంగళం పాడిన పాలకులు ఈ రబీ సీజన్ నిధులనూ పాత పద్ధతి ప్రకారం జమ చేయకపోవడమే రైతుల్లో గందరగోళ పరిస్థితులకు కారణమైంది. రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు వెల్లడించిన ప్రకారం.. సోమవారం రాష్ట్ర వ్యాప్తంగా రైతుల ఖాతాల్లో రూ. 563 కోట్ల నిధులు రైతు భరోసా పథకం కింద జమయ్యాయి. రాష్ట్ర వ్యాప్తంగా 4,41,911 మంది రైతుల ఖాతాల్లో 9,48,33 ఎకరాలకు గాను రూ. 530 కోట్లు జమ చేసినట్లు మంత్రి ప్రకటించారు. రాష్ట్రంలోని 577 మండలాల్లో రైతు భరోసా నిధులు కర్షకుల ఖాతాల్లో జమ చేసినట్లు ప్రభుత్వం తరపున మంత్రి తుమ్మల అధికారికంగా ప్రకటించారు. అయితే పథకం అమలులో గత సంప్రదాయాన్ని లేదా పద్ధతిని ప్రస్తుత ప్రభుత్వం విస్మరించడమే గందరగోళ పరిస్థితులకు దారి తీసినట్లు పేర్కొనవచ్చు.

బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో పథకాన్ని ప్రారంభించిన తొలి విడతలో రైతులందరికీ దాదాపు ఒకటి, రెండు రోజుల్లోనే రైతుల ఖాతాల్లో రైతు బంధు నిధులు జమ చేశారు. ఆ తర్వాత పరిణామాల్లో ఎకరం, రెండెకరాలు, మూడెకరాలు, అయిదెకరాలు, పదెకరాలు.. ఆ తర్వాత బడా రైతులకు గరిష్ట విస్తీర్ణానికి విడతల వారీగా రైతు బంధు నిధులు జమ అయ్యాయి.
కానీ ప్రస్తుత ప్రభుత్వం ఆయా విధానానికి విరుద్ధంగా రైతు భరోసా నిధులను సోమవారం విడుదల చేయడం గమనార్హం. దీంతో రాష్ట్రంలోని వేలాది గ్రామాల రైతులు తీవ్ర నిరాశలో మునిగిపోయారు. సోమవారం నాటి ప్రక్రియలో మండలానికి ఓ గ్రామం చొప్పున ‘ఎంపిక’ చేసి నిధులను జమ చేశారు. మున్సిపాలిటీల్లో ఓ వార్డును ప్రాతిపదికగా తీసుకున్నారు. ‘ఎంపిక’ చేసిన విధానంలో మండలానికో గ్రామం అంటే దానికీ ఓ ప్రామాణికతను ఎంచుకున్నారు. సంబంధిత మండలంలో అతి చిన్న రెవెన్యూ గ్రామాన్ని, మున్సిపాలిటీలో అత్యంత చిన్న వార్డును మాత్రమే నిధుల విడుదలకు ఎంపిక చేశారు. ఆయా గ్రామాలు, వార్డులు ప్రామాణికంగా పరిమితి లేకుండా రైతుల ఖాతాల్లో రైతు భరోసా నిధులు జమ కావడం విశేషం. ఫలితంగా తొలి రోజు పావు ఎకరం గల చిన్న రైతుకే కాదు పదెకరాల ఆసామికి కూడా రైతు భరోసా నిధులు ఖాతాల్లోకి చేరాయి. దీంతో ప్రతి మండలంలో ఓ రెవెన్యూ గ్రామానికి చెందిన రైతులు, ప్రతి మున్సిపాలిటీలో అతి చిన్న వార్డుకు చెందిన కర్షకులు మాత్రం సంతోషంలో ఉన్నారు.

కానీ ఈ విధానం వల్ల మండలంలోని మిగతా గ్రామాలకు చెందిన రైతులు, మున్సిపాలిటీలోని మిగతా వార్డులకు చెందిన రైతులు తీవ్ర నిరాశలో మునిగిపోయారు. సాయంత్రం ఆరున్నర గంటల వరకు కూడా రైతు బంధు నిధులు జమ కాకపోవడంతో తమ పరిస్థితి ఏమిటనే ఆందోళనలో రైతులు మునిగిపోయారు. దీంతో వచ్చే మార్చి నెలాఖరు వరకు రూ. 10 వేల కోట్ల రూపాయల నిధులను జమ చేస్తామని నిన్న చంద్రవంచ సభలో సీఎం రేవంత్ చేసిన ప్రకటనకు అసలు అర్థం ఇదేనా? అని రైతులు ప్రశ్నిస్తున్నారు. సోమవారం నాటి పరిస్థితులే కొనసాగితే తమ గ్రామం వంతు వచ్చేసరికి మార్చి వస్తుందో, ఏప్రిల్ వస్తుందో తెలియక చిన్న, సన్నకారు రైతులు ప్రభుత్వంపై శాపనార్థ వ్యాఖ్యలు చేస్తుండడం గ్రామీణ ప్రాంతాల్లో కనిపిస్తోంది. అయితే ప్రభుత్వం నిన్న లాంఛనంగా ప్రారంభించిన నాలుగు పథకాలను కూడా ‘ఎంపిక’ చేసిన గ్రామాల్లో ఏకకాలంలో అమలు చేస్తుండడం కొసమెరుపు.

