Top 5 This Week

Related Posts

గుల్జార్ హౌజ్ అగ్నిప్రమాదం: బాధిత కుటుంబాలకు పరిహారం

హైదరాబాద్​ పాతబస్తీలోని గుల్జార్‌ హౌస్‌ సమీపంలో జరిగిన  అగ్నిప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు ఒక్కొక్కరికి ఐదు లక్షల రూపాయల చొప్పున ఎక్స్ గ్రేషియాను రాష్ట్ర ప్రభుత్వం అందిస్తుందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు చెప్పారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచన మేరకు ఖమ్మం జిల్లా మధిర నుంచి హుటాహుటిన ఉస్మానియా ఆసుపత్రికి చేరుకొని అగ్నిప్రమాదంపై మంత్రులు పొన్నం ప్రభాకర్, దామోదర్ రాజా నరసింహతో కలిసి పరిస్థితిని సమీక్షించారు. మార్చురీ వద్ద మృతుల కుటుంబాలను పరామర్శించి ప్రగాఢ సంతాపం సానుభూతిని తెలిపారు. వారి కుటుంబాలకు మనోధైర్యం భగవంతుడు కల్పించాలని ప్రార్థించారు. ప్రమాద సంఘటన సంబంధించిన వివరాలను హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సివి ఆనంద్, జిహెచ్ఎంసి కమిషనర్ కర్ణన్, అగ్నిమాపక శాఖ డీజీ వై నాగిరెడ్డిలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఉస్మానియా ఆసుపత్రి మార్చురీ గేటు వద్ద మీడియాతో మాట్లాడారు.

ఈ ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. పాతబస్తీలోని గుల్జార్‌ హౌస్‌ సమీపంలో ఈరోజు ఉదయం జరిగిన అగ్ని ప్రమాదంలో 17 మంది మృతి చెందడం అత్యంత దురదృష్టకరమని, ఈ ఘటనపై రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, యావత్తు మంత్రిమండలి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిందని తెలిపారు. ప్రమాద సంఘటన తెలిసిన వెంటనే రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వేగంగా స్పందించి మంత్రులు, సంబంధిత అధికారులతో ఫోన్లో మాట్లాడి అగ్ని ప్రమాద నివారణ చర్యలు చేపట్టడంతో పాటు బాధితులకు సహాయక చర్యలు చేపట్టాలని మినీ టు మినిట్ పర్యవేక్షణ చేశారని చెప్పారు.

హైదరాబాద్ ఇన్చార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ సంఘటన జరిగిన విషయం తెలిసిన వెంటనే అక్కడికి చేరుకొని పరిస్థితిని క్షేత్రస్థాయిలో పర్యవేక్షించారని తెలిపారు. ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ఉస్మానియా ఆసుపత్రికి చేరుకొని వైద్య బృందంతో సమీక్షించి క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందేలా చూశారని చెప్పారు. ఈరోజు మధిర నియోజకవర్గం పర్యటనలో ఉండగా తనకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫోన్ చేసి తక్షణమే ఆసుపత్రికి చేరుకొని పరిస్థితిని సమీక్షించాలని సూచించడంతో హుటాహుటిన మధిర నుంచి ఉస్మానియా ఆసుపత్రికి చేరుకోవడం జరిగిందని వివరించారు. అప్పటికే రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫైర్ జిహెచ్ఎంసి పోలీస్ రెవిన్యూ హెల్త్ అధికారులతో ఎప్పటికప్పుడు పరిస్థితిని తెలుసుకొని పర్యవేక్షించడంతో పాటు బాధిత కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి మాట్లాడి పరామర్శించినట్లు చెప్పారు.

ప్రాథమిక విచారణలో ఈ అగ్ని ప్రమాదం షార్ట్ సర్క్యూట్ వల్ల జరిగిందని అధికారులు చెప్పారు. ఉదయం 6 గంటల 16 నిమిషాలకు అగ్రి ప్రమాదం జరిగిన పరిసర ప్రాంతం నుంచి అగ్నిమాపక శాఖకు ఫోన్ రావడంతో ఉదయం 6 గంటల 17నిమిషాలకు మొగల్ పురా నుంచి ఫైర్ ఇంజన్ బయలుదేరి ఉదయం 6గంటల 20 నిమిషాలకు సంఘటన స్థలానికి చేరుకొని ఆపరేషన్ ప్రారంభించినట్లు వెల్లడించారు. అగ్ని ప్రమాదంలో చిక్కుకున్న 17 మందిని అగ్నిమాపక శాఖ సిబ్బంది రక్షించి ఆసుపత్రికి తరలించారని చెప్పారు. ఈ అగ్ని ప్రమాదం నివారించడానికి మొత్తం 12 వాహనాలు ఘటన స్థలానికి  చేరుకుని రెస్క్యూ ఆపరేషన్ నిర్వహించాయని తెలిపారు 11 ఫైర్ ఇంజన్లు, 01 ఫైర్ ఫైటింగ్ రోబోట్, 17 అగ్నిమాపక అధికారులు, 70 మంది సిబ్బంది ఈ ఆపరేషన్లో పాల్గొని మంటలను వ్యాప్తి చెందకుండా అరికట్టారని తెలిపారు.

గతంలో జరిగిన ఇలాంటి అగ్ని ప్రమాదాల పట్ల రాష్ట్ర ప్రభుత్వం సీరియస్ గా తీసుకొని పునరావృతం కాకుండా తీసుకోవలసిన అన్ని చర్యలపై రాష్ట్ర క్యాబినెట్లో రెండు మూడుసార్లు సమీక్షించినట్లు చెప్పారు. గుల్జర్ హౌస్ సంఘటనలు పునరావృతం కాకుండా అన్ని చర్యలు తీసుకుంటామని చెబుతూ మంటలు ఆర్పే క్రమంలో ఫైర్ ఫైటర్ ఒకరు తీవ్ర అస్వస్థతకు గురై ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లు డిప్యూటీ సీఎం భట్టి వివరించారు.

Popular Articles