Top 5 This Week

Related Posts

తోలు తీసే ఉద్యోగం ఎప్పుడు తీసుకున్నారు?: కేసీఆర్ పై భట్టి సెటైర్

తల్లాడ: బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ ముందు అసెంబ్లీకి రావాలని తెలంగాణా డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అన్నారు. అసెంబ్లీ అంటే కేసీఆర్ కు భయమెందుకని ప్రశ్నించారు. కేసీఆర్ తోలు ఒలుస్తామంటే ఇక్కడెవరూ ఖాళీగా లేరని, చూస్తూ ఊర్కోబోమని ఆయన అన్నారు. ప్రజలకు పనికొచ్చే సంక్షేమ పథకాలు చేపడుతున్నాం కాబట్టే, ప్రజలు కాంగ్రెస్ బలపరిచిన 85% మందిని సర్పంచులుగా గెలిపించి పంపిస్తే తోలువలుస్తా అని కేసిఆర్ మాట్లాడుతున్నారని భట్టి అన్నారు. తమకు దిగజారి మాట్లాడడం రాదని, చేతల ద్వారా ప్రజా సంక్షేమ కార్యక్రమాల ద్వారా బీఆర్ఎస్ నేతలకు బుద్ధి చెప్పిస్తామన్నారు. ఖమ్మం జిల్లా తల్లాడ మండలం పాత పినపాక గ్రామంలో పలు సబ్ స్టేషన్ ల పనులకు మంగళవారం శంకుస్థాపన చేసిన అనంతరం స్థానికంగా ఏర్పాటుచేసిన బహిరంగ సభలో డిప్యూటీ సీఎం ప్రసంగించారు.

రెండేళ్లపాటు పాటు ఫామ్ హౌస్ లో పండుకుని.. నిన్న, మొన్న ఒక పెద్దాయన మీడియా సమావేశంలో మాట్లాడుతున్నారంటే ప్రజా ప్రభుత్వంలో సంక్షేమ కార్యక్రమాలు చక్కగా జరుగుతున్నట్లుగా భట్టి చెప్పారు. మంచిగా చేయండి అని ఆయన ఆశీర్వదిస్తారని భావించామని, కానీ ఆయన తోలు తీస్తామంటూ మాట్లాడటం సరైంది కాదన్నారు. తోలు తీస్తాం అని కేసీఆర్ అంటున్నారని, ఆయన తోలు వలిచే ఉద్యోగం ఎప్పుడు తీసుకున్నారోనని భట్టి విక్రమార్క వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ప్రతిపక్ష నాయకుడిగా రెండు సంవత్సరాల్లో ఒక్కరోజు కూడా కేసీఆర్ అసెంబ్లీకి ఎందుకు రాలేదని ప్రశ్నించారు. అసెంబ్లీ అంటే కేసీఆర్ కు ఎందుకంత భయం? అని అన్నారు. అసెంబ్లీకి రాని ఆయనకు అసలు ప్రధాన ప్రతిపక్ష నాయకుని హోదా అవసరం లేదా? ఆయనకు ఆ హోదా అవసరమా? అని డిప్యూటీ సీఎం ప్రశ్నించారు.

తాము ప్రతిపక్షంలో ఉన్న పది సంవత్సరాలు ప్రధాన ప్రతిపక్ష నాయకునిగా తాను ఏ ఒక్కరోజు అసెంబ్లీకి గైర్హాజరు కాలేదని, ప్రతిరోజు ప్రజల సమస్యలపై అసెంబ్లీలో గళం వినిపించామని డిప్యూటీ సీఎం అన్నారు. పదిమంది నాయకులను పక్కన కూర్చోబెట్టుకొని ప్రజల కోసం పనిచేస్తున్న వారిని తోలు వలుస్తామంటే చూస్తూ ఊరుకోబోమని, ఇక్కడ ఖాళీగా ఎవరూ లేరని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో అత్యంత ప్రజాస్వామ్య పద్ధతుల్లో సర్పంచ్ ఎన్నికలు జరిగాయని, ఆ ఎన్నికల్లో బీఆర్ఎస్ మద్దతుదారులు ప్రజలకు అన్ని విషయాలు వివరించారని, అయినప్పటికీ కాంగ్రెస్ బలపరిచిన 85 శాతం మంది అభ్యర్థులను రాష్ట్ర ప్రజలు గెలిపించి ఆశీర్వదించారని భట్టి అన్నారు.

అసెంబ్లీ ఎన్నికల్లో నువ్వు పనికిరావని పక్కకు కూర్చోబెట్టారని, తాజాగా సర్పంచ్ ఎన్నికల్లో అంతకన్నా ఎక్కువ మెజారిటీతో కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులకు పల్లె ప్రజలు పట్టం కట్టారని భట్టి అన్నారు. తెలంగాణ రైజింగ్ అవుతున్నదని, రాష్ట్రానికి దేశవ్యాప్తంగా నాయకులు, బడా పారిశ్రామికవేత్తలు తరలివస్తున్నారని, రాష్ట్ర ప్రభుత్వాన్ని పొగుడుతున్నారన్నారు. ఈ సమయంలో తాము ఎక్కడ కనిపించకుండా పోతామనే ఆందోళనతో రెండు సంవత్సరాల తర్వాత బయటకు వచ్చి రాష్ట్ర ప్రభుత్వంపై విషం కక్కి తిరిగి ఫామ్ హౌస్ లో పడుకోవడానికి వెళ్లారని, వారికి ప్రజలే బుద్ధి చెబుతారని డిప్యూటీ సీఎం అన్నారు.

రాష్ట్రంలోని 94 శాసనసభ నియోజకవర్గాల్లో పంచాయతీ ఎన్నికలు జరిగితే 85 శాసనసభ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ అభ్యర్థులు అత్యధిక మెజార్టీతో గెలుపొందారన్నారు. ఈ మధ్యకాలంలో ఏ రాజకీయ పార్టీకి ఇంత పెద్ద ఎత్తున ప్రజల ఆశీర్వాదం లభించలేదని అన్నారు. ప్రజల మధ్య నిలబడి ప్రజల కోసం ఇందిరమ్మ రాజ్యం నిర్ణయాలు చేయడంతోనే సర్పంచి ఎన్నికల్లో కాంగ్రెస్ మద్దతుదారులు పెద్ద సంఖ్యలో గెలుపొందారని డిప్యూటీ సీఎం భట్టి తెలిపారు.

Popular Articles