Sunday, August 31, 2025

Top 5 This Week

Related Posts

ఉద్యోగుల సమస్యలపై డిప్యూటీ సీఎం భట్టి కీలక ప్రకటన

ప్రభుత్వ ఉద్యోగుల సమస్యల పరిష్కారం తమ బాధ్యతగా తెలంగాణా డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. ఉద్యోగుల సమస్యల పట్ల సానుకూలంగా స్పందించి సమస్యలు పరిష్కరించాలని సీఎం రేవంత్ రెడ్డి మంత్రుల సబ్ కమిటీని, అధికారుల కమిటీని నియమించారని చెప్పారు. బుధవారం డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ సచివాలయంలో సబ్ కమిటీ సభ్యులు మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ సలహాదారు కేశవరావు తదితరులతో కలిసి సమావేశంలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం మాట్లాడుతూ, ఉద్యోగుల సమస్యలపై మీ అందరితో చర్చించి సాధ్యమైనంత త్వరగా సమస్యల పరిష్కారానికి సానుకూలంగా నిర్ణయం తీసుకునే విధంగా సీఎం రేవంత్ రెడ్డి మంత్రుల కమిటీకి సూచించారని తెలిపారు. గత కొన్ని సంవత్సరాలుగా బకాయిలు పేరుకుపోవడంతో అన్ని ఒకేసారి చేయలేకపోయాం, ఇక ఎక్కువ కాలం పెండింగ్లో పెట్టకుండా ఉద్యోగుల సమస్యలకు పరిష్కారం చూపాలనదే ప్రభుత్వ ఆలోచనగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఉద్యోగ సంఘాలకు వివరించారు. గురువారం క్యాబినెట్ సమావేశం నేపథ్యంలో అధికారుల నివేదికతో పాటు నేరుగా ఉద్యోగ సంఘాలతో చర్చించాలని నిర్ణయించినట్టు తెలిపారు.

ప్రభుత్వ ఆదాయానికి, ఖర్చుకు చేయాల్సిన పనులను బేరీజు వేసుకొని ఆర్థిక భారం ఉన్నప్పటికీ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని సీఎం రేవంత్ రెడ్డి బలంగా ఉన్నారని డిప్యూటీ సీఎం ఉద్యోగ సంఘాలకు భరోసా ఇచ్చారు. ఉద్యోగుల కుటుంబాల్లో పెళ్లిళ్లు, ఆసుపత్రుల ఖర్చులకు సంబంధించిన సమస్యలపై క్యాబినెట్ సహచరులం అంతర్గతంగా పలుమార్లు చర్చించుకున్నామని ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలన్న అంశంపై ఎవరికీ భిన్నాభిప్రాయం లేదన్నారు. గురువారం క్యాబినెట్ సమావేశం నేపథ్యంలో ఉద్యోగ సంఘాల సమస్యలపై ఏర్పాటు చేసిన అధికారుల త్రీ మెన్ కమిటీ, ఆర్థిక శాఖ, ఇతర అధికారులతో చర్చించి ఒక నివేదిక రూపొందించి క్యాబినెట్ కు నివేదిస్తాం, పరిష్కారం కనుగొంటామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు ఉద్యోగ సంఘాల నేతలకు వివరించారు. సమావేశం లో అధికారులు నవీన్ మిట్టల్, లోకేష్ కుమార్, కృష్ణభాస్కర్, సందీప్ కుమార్ సుల్తానియా, మహేష్ దత్ ఎక్కా తదితరులు పాల్గొన్నారు

Popular Articles