Friday, January 23, 2026

Top 5 This Week

Related Posts

వచ్చే వందేళ్లు పేదలకోసం కొట్లాడాలి: ‘కామ్రేడ్స్’కు రేవంత్ పిలుపు

ఖమ్మం: రాబోయే వందేళ్లు కూడా కమ్యూనిస్టులు పేదలకోసం కొట్లాడాలని తెలంగాణా సీఎం రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. కాంగ్రెస్, కమ్యూనిస్టులు వేర్వేరు కాదన్నారు. కమ్యూనిస్టులు ప్రజలకోసం కష్టపడతారని, కొట్లాడుతారని, వారి నినాదాలనే కాంగ్రెస్ పార్టీ చట్టాన్ని, శాసనాలను చేస్తుందన్నారు. ఈనాటి ఈ అధికారంలో కమ్యూనిస్టుల సహకారం, శ్రమ కూడా ఉందని సీఎం రేవంత్ పేర్కొన్నారు. ఖమ్మం నగరంలో జరుగుతున్న సీపీఐ వందేళ్ల ఉత్సవాల్లో సీఎం రేవంత్ రెడ్డి ఆదివారం పాల్గొని ప్రసంగించారు.

ఇది పేదల రాజ్యమని, పేదల ప్రభుత్వమని, ఆనాడు కమ్యూనిస్టులు ఇచ్చిన ప్రజారాజ్యం పిలుపుతోనే ఈనాడు ప్రజల ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశామన్నారు. ఖమ్మం జిల్లాకు ప్రత్యేకత ఉందని, నరేంద్ర మోదీ, అమిత్ షాలు కట్టగట్టుకుని వచ్చినా ఇక్కడ ఇద్దరు సర్పంచులను కూడా గెలిపించుకోలేరని రేవంత్ వ్యాఖ్యానించారు. ఈ గడ్డమీది తులసివనంలో గంజాయి మొక్కలకు స్థానం లేదన్నారు. ఖమ్మం జిల్లా గడ్డపై బీజేపీ సర్పంచులను కూడా గెలిపించుకోలేదన్నారు.

కమ్యూనిస్టు సోదరులు ఈ ప్రాాంతంలో బలమైన ఉద్యమాలను నెలకొల్పడం వల్లే ఈరోజు బీజేపీకి ఇక్కడ స్థానం లేదన్నారు. భవిష్యత్తుల్లో నరేంద్ర మోదీకి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ చేయబోయే పోరాటాల్లో కలిసి రావాలని కమ్యూనిస్టులకు రేవంత్ పిలుపునిచ్చారు. మనందరం కలిసి బీజేపీని గద్దె దింపుదామని, రాహుల్ గాంధీని ప్రధాన మంత్రిని చేద్దామన్నారు. ఇందుకు మీ అందరి సహకారం ఉండాలని, రాబోయే వందేళ్లు పేదల కోసం మీరు కొట్లాడాలని రేవంత్ కోరారు.

Popular Articles