ఢిల్లీ: బీసీలకు 42 శాతం రిజర్వేషన్లతో తెలంగాణలో స్థానిక ఎన్నికలు నిర్వహించేందుకు కృతనిశ్చయంతో ఉన్నట్లు ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. హైకోర్టు సైతం 90 రోజుల్లో (సెప్టెంబరు నెలాఖరులోగా) స్థానిక సంస్థలు ఎన్నికలు నిర్వహించాలని, 30 రోజుల్లో (జులై నెలాఖరులోగా) రిజర్వేషన్లు ఖరారు చేయాలని ఆదేశించిందన్నారు. ఢిల్లీలోని తన అధికారిక నివాసంలో ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి బుధవారం విలేకరులతో మాట్లాడారు.
బీసీలకు విద్యా, ఉపాధి రంగాల్లో రిజర్వేషన్లు, స్థానిక సంస్థల్లో 42 శాతం రిజర్వేషన్లకు సంబంధించి తెలంగాణ శాసనసభ పూర్తిస్థాయిలో చర్చించి ఆమోదించిన రెండు బిల్లులను ఆమోదించడంలో కేంద్ర ప్రభుత్వం తాత్సారం చేస్తోందని సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ రెండు బిల్లుల ఆమోదానికి కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు లోక్‌సభలో విపక్ష నేత రాహుల్ గాంధీ, రాజ్యసభలో విపక్ష నేత మల్లికార్జున్ ఖర్గేలను గురువారం ఉదయం కలిసి తెలంగాణ ప్రభత్వం చేపట్టిన సామాజిక, ఆర్థిక, విద్య, ఉద్యోగ, రాజకీయ మరియు కుల సర్వే (SEEEPC) జరిపిన తీరు, రాష్ట్ర ప్రభుత్వం అనుసరించిన విధానాలను వివరిస్తామని తెలిపారు. సాయంత్రం కాంగ్రెస్ లోక్‌సభ, రాజ్యసభ సభ్యులకు ఈ అంశాన్ని వివరిస్తామని సీఎం వెల్లడించారు.

ఈ పార్లమెంట్ సమావేశాల్లోనే తెలంగాణ ప్రభుత్వం చేసిన రెండు బిల్లుల ఆమోదానికి పట్టుపడతామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లకు సంబంధించి తెలంగాణ శాసనసభలో బీజేపీ, బీఆర్ఎస్, సీపీఐ, ఎంఐఎం మద్దతు పలికాయని సీఎం గుర్తుచేశారు. బీసీలకు రిజర్వేషన్లను అడ్డుకునేందుకు కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, సంజయ్ ముస్లింలను సాకుగా చూపుతున్నారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మండిపడ్డారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సొంత రాష్ట్రం గుజరాత్, ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న ఉత్తరప్రదేశ్, ఆర్ఎస్ఎస్ ప్రధాన కార్యాలయం ఉన్న మహారాష్ట్రలోనూ ముస్లింలకు రిజర్వేషన్లు అమలవుతున్నాయని, బీజేపీ నేతలకు దమ్ముంటే ఆ రాష్ట్రాల్లో ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేస్తామని ప్రకటించాలని సీఎం సవాల్ విసిరారు. గుజరాత్‌లో ముస్లింలకు రిజర్వేషన్లు అమలవుతున్నాయని, ఇక ముందు అమలు చేస్తామని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా ఒక ఇంటర్వ్యూలో చెప్పిన విషయాన్ని ప్రస్తావిస్తూ, బీజేపీ నేతలు అందుకు ఆయనను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తారా అని సీఎం ప్రశ్నించారు.
తెలంగాణలో సామాజిక, ఆర్థిక, ఉపాధి, విద్యా, రాజకీయ మరియు కుల సర్వే ప్రక్రియను 2024, ఫిబ్రవరి 4న మొదలు పెట్టి 2025, ఫిబ్రవరి 4వ తేదీ నాటికి పూర్తి చేసి శాసనసభలోనూ ఆమోదించామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. అందుకే తెలంగాణలో ఫిబ్రవరి 4ను సామాజిక న్యాయ దినోత్సవంగా (సోషల్ జస్టిస్ డే) జరుపుతున్నామని తెలిపారు. ఈ సర్వేలో తెలంగాణలో 3.55 కోట్ల మంది వివరాలు సేకరించామని సీఎం పేర్కొన్నారు. సర్వే వివరాలను శాసనసభ ముందుంచామని… దాని ప్రకారం 56.4 శాతం బీసీలు, 17.45 శాతం ఎస్సీలు, 10.08 శాతం ఎస్టీలు, 10.09 శాతం ఉన్నత వర్గాల వారు ఉన్నారని సీఎం చెప్పారు. తెలంగాణలో 3.09 శాతం మంది తాము ఏ కులానికి చెందమని ప్రకటించారని.. తెలంగాణలో ఇదో కొత్త పరిణామమని అన్నారు.
సర్వే వివరాలను స్వతంత్ర నిపుణుల సలహా కమిటీకి ఇచ్చామని, వారు దానిపై చర్చించి నివేదికను రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించారని ముఖ్యమంత్రి తెలిపారు. ఆ నివేదికను మంత్రివర్గంలో చర్చించి శాసనసభలో ప్రవేశపెడతామని వెల్లడించారు. సర్వే చేసినప్పటికీ వ్యక్తిగత వివరాలు వెల్లడించకూదని… అది వ్యక్తిగత డేటా ప్రైవసీ యాక్ట్‌కు విరుద్ధమని సీఎం ఓ ప్రశ్నకు సమాధానమిచ్చారు.
కుల గణన విషయంలో తెలంగాణ ప్రభుత్వం దేశానికి రోల్‌మోడల్‌గా నిలిచిందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. కుల గణన చేపట్టమని సుప్రీంకోర్టుకు అఫిడవిట్ సమర్పించిన బీజేపీ ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం కుల గణన చేపట్టాక తమను అనుసరిస్తూ కుల గణనకు గెజిట్ విడుదల చేసిందన్నారు.. తెలంగాణ వేసిన రోడ్ మ్యాప్‌ను దేశవ్యాప్తంగా కుల గణన సేకరణకు కేంద్ర ప్రభుత్వం వినియోగించుకోవాలని సీఎం సూచించారు. కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు భారత్ జోడో యాత్ర చేపట్టిన రాహుల్ గాంధీ తాము అధికారంలోకి వస్తే కుల గణన చేపడతామని తెలంగాణలో ప్రకటించారని, ఆయన ప్రకటించినట్లుగానే తెలంగాణలో అధికారంలోకి రాగానే కుల గణన చేపట్టామని తెలిపారు.
రాబోయే 2029 లోక్‌సభ ఎన్నికలు ఓబీసీ రిజర్వేషన్లకు లిట్మస్ టెస్ట్‌గా నిలుస్తాయని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. రైతు బిల్లుల రద్దు విషయంలోనూ తొలుత మొండికేసిన బీజేపీ ప్రభుత్వాన్ని మెడలు వంచి రద్దు చేయించామని, కుల గణన విషయంలో తమ మార్గంలో నడిచేలా చేశామని సీఎం తెలిపారు. ఈడబ్ల్యూఎస్ కు 10 శాతం రిజర్వేషన్లు ఇవ్వడంతోనే 50 శాతం రిజర్వేషన్ల పరిమితి అంశం పక్కకు పోయిందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.

- ఉప రాష్ట్రపతి పదవి తెలంగాణకు ఇవ్వాలి:
ఉప రాష్ట్రపతి జగ్ దీప్ ధన్‌ఖడ్ రాజీనామాకు కారణాలేమిటో తనకు తెలియదని, కానీ ఆ రాజీనామా దురదృష్టకరమని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఉప రాష్ట్రపతి పదవిని ఈదఫా తెలంగాణకు ఇవ్వాలని సీఎం రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. ఉప రాష్ట్రపతిగా ఉన్న తెలుగు వ్యక్తి వెంకయ్య నాయుడును రాష్ట్రపతి కాకుండా ఇంటికి పంపించారని, సికింద్రాబాద్ నుంచి గెలిచి కేంద్ర మంత్రిగా ఉన్న బీసీ నేత దత్తాత్రేయను గవర్నర్‌గా పంపి ఆ పదవిని కిషన్ రెడ్డికి ఇచ్చారని సీఎం అన్నారు. బీసీ నేతగా ఉన్న సంజయ్‌ను బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి నుంచి తొలగించి కిషన్ రెడ్డికి, ఆయన తర్వాత రాంచందర్‌రావుకు ఇచ్చారని, బీజేపీ బీసీలకు అన్యాయం చేసిందని సీఎం విమర్శించారు.
దత్తాత్రేయ గవర్నర్ పదవీ కాలం కూడా ముగిసిపోయిందన్నారు. బీసీలకు చేసిన ఈ అన్యాయాన్ని సరిచేసుకునేందుకు దత్తాత్రేయకు ఉప రాష్ట్రపతి పదవి ఇస్తే బాగుంటుందని సీఎం అభిప్రాయపడ్డారు. అయితే ఉప రాష్ట్రపతి ఎన్నికలో అంతిమ నిర్ణయం కాంగ్రెస్ అధిష్టానానిదేనని, తనను అవకాశం ఉంటే దత్తాత్రేయకు మద్దతు ఇచ్చే విషయంలో ప్రయత్నం చేస్తానని సీఎం ఓ ప్రశ్నకు సమాధానం చెప్పారు. స్థానిక సంస్థల్లో ఇద్దరు పిల్లల నిబంధనను ఎత్తివేసే విషయాన్ని తీవ్రంగానే పరిశీలిస్తున్నామని మరో ప్రశ్నకు సీఎం రేవంత్ రెడ్డి బదులిచ్చారు.
సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు (బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ శాఖలు) షబ్బీర్ అలీ, హర్కార వేణుగోపాల రావు (ప్రొటోకాల్, ప్రజా సంబంధాలు), ఎంపీలు డాక్టర్ మల్లు రవి, చామల కిరణ్ కుమార్‌రెడ్డి, రామసహాయం రఘురామిరెడ్డి, పోరిక బలరాం నాయక్, కుందూరు రఘువీర్ రెడ్డి, గడ్డం వంశీ కృష్ణ, డాక్టర్ కడియం కావ్య, సురేశ్ షెట్కార్, అనిల్ కుమార్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.